వీటిని ముఖానికి నేరుగా రాయకూడదట!

అందంగా కనిపించడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటాం. ముఖంలో మెరుపును సొంతం చేసుకోవడానికి కొందరు మార్కెట్లో లభించే వివిధ రకాల బ్యూటీ ప్రొడక్ట్స్‌ను నమ్ముకుంటే.. మరికొందరు సహజ సౌందర్యం కోసం వంటగదిని ఆశ్రయిస్తారు.

Updated : 13 Sep 2022 14:20 IST

అందంగా కనిపించడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటాం. ముఖంలో మెరుపును సొంతం చేసుకోవడానికి కొందరు మార్కెట్లో లభించే వివిధ రకాల బ్యూటీ ప్రొడక్ట్స్‌ను నమ్ముకుంటే.. మరికొందరు సహజ సౌందర్యం కోసం వంటగదిని ఆశ్రయిస్తారు. అక్కడ దొరికే వివిధ రకాల పదార్థాలతో ఫేస్ ప్యాక్‌లు, మాస్క్‌లు తయారుచేసుకుంటారు.

అవి ముఖానికి మంచిది కాదు!

అయితే కిచెన్‌లో ఉండే కొన్ని పదార్థాలు ముఖానికి ఏ మాత్రం మంచిది కాదంటున్నారు చర్మ సౌందర్య నిపుణులు. అవగాహన లేమితో వీటిని నేరుగా ముఖంపై రాయడం వల్ల ప్రతికూల ఫలితాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. మరి ఆ పదార్థాలేంటో తెలుసుకుందాం రండి.

నిమ్మ

వ్యాధి నిరోధక శక్తి గుణాలున్న నిమ్మరసం తక్షణ శక్తి అందించడంతో పాటు వివిధ రకాల అనారోగ్యాలు దరిచేరకుండా కాపాడుతుంది. అయితే ఇన్ని ప్రయోజనాలున్నప్పటికీ నిమ్మ రసాన్ని ముఖానికి రాయడం మంచిది కాదంటున్నారు చర్మ సౌందర్య నిపుణులు. ఎందుకంటే దీనిలో యాసిడ్‌ గుణాలు అధికంగా ఉంటాయి. దీనిని నేరుగా ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం సమతుల్యత దెబ్బతింటుంది. ఫలితంగా దురద, దద్దుర్లు, మంట తదితర సమస్యలు కలుగుతాయి.

దాల్చిన చెక్క

వివిధ రకాల వంటలకు అద్భుతమైన రుచిని తెచ్చిపెట్టే దాల్చిన చెక్కను ముఖానికి అసలు రాయకూడదు. ఎందుకంటే ఇది చర్మం పీహెచ్‌ స్థాయులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. నీటి స్థాయులను కూడా తగ్గిస్తుంది. ఫలితంగా ముఖంపై దద్దుర్లు ఏర్పడడం, మంట, చర్మం రంగు మారిపోవడం తదితర సమస్యలు వస్తాయి.

యాపిల్‌ సైడర్‌ వెనిగర్

బరువుతో పాటు జుట్టు రాలడాన్ని తగ్గించే యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ని ముఖానికి రాయడం వల్ల ఇరిటేషన్‌, మంట పుడుతుంది. ఎందుకంటే నిమ్మ మాదిరిగానే దీని పీహెచ్‌ విలువ 2-3 మధ్యలో ఉంటుంది. ఆమ్ల గుణాలు అధికంగా ఉంటాయి. దీనిని చర్మానికి రాయడం వల్ల ఇరిటేషన్‌, మంట పుట్టడం తదితర సమస్యలు కలుగుతాయి.

బేకింగ్‌ సోడా

బేకింగ్‌ సోడా పీహెచ్‌ విలువ 8కి పైనే ఉంటుంది. ఆల్కలైన్ (క్షార) గుణాలు అధికంగా ఉండే దీనిని ముఖానికి అప్లై చేయడం వల్ల ప్రతికూల పరిణామాలు తప్పవు. ఇది చర్మంలో నీటి స్థాయులను తగ్గిస్తుంది. ఫలితంగా ముఖం కాంతిని కోల్పోతుంది. ముఖంపై మొటిమలు ఏర్పడి వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి.

కొబ్బరి నూనె

యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలతో పాటు యాంటీ మైక్రోబియల్ లక్షణాలుండే కొబ్బరి నూనె శరీరానికి, శిరోజాలకు ఎంతో మేలు చేస్తుంది. అయితే ఇందులోని కొన్ని సమ్మేళనాలు ముఖంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. కొంతమందిలో మొటిమలు వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

ఇవి కూడా..

* పచ్చి గుడ్డులో సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. కాబట్టి దీనిని ముఖానికి రాసుకోవడం అంత మంచిది కాదంటారు చర్మ నిపుణులు.

* కొంతమంది ముఖంపై నల్లమచ్చలను తొలగించుకోవడానికి గ్లూ (జిగురు)ను రాస్తుంటారు. ఫలితంగా చర్మ రంధ్రాలు మూసుకుపోయి వివిధ రకాల సమస్యలు వస్తాయి.

* ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉండే మయొనైజ్‌ను కొందరు మాయిశ్చరైజర్‌గా వినియోగిస్తుంటారు. అయితే దీనిని మరీ ఎక్కువగా వాడితే చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి.

* వంటగదిలోని అన్ని రకాల మసాలా దినుసులు ముఖానికి అప్లై చేయకూడదు. యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలున్న పసుపు తదితర పదార్థాలను మాత్రమే రాసుకోవాలి.

* వెజిటబుల్‌ ఆయిల్‌ను ముఖానికి రాయడం వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోయే ప్రమాదం ఉంది.

* ముఖంపై జిడ్డును దూరం చేసుకోవడానికి కొందరు ఆల్కహాల్‌ను వినియోగిస్తుంటారు. కానీ ఆల్కహాల్‌ చర్మంలోని లిపిడ్లు, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులను తగ్గించేస్తుంది. ఫలితంగా ముఖం కాంతిని కోల్పోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్