పిల్లల పాల బాటిళ్లు.. ఇలా శుభ్రం చేద్దాం!

పసి పిల్లల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం.. కంటికి రెప్పలా కాపాడుకుంటాం..  అయినా కొన్ని విషయాల్లో మనకు తెలియకుండానే నిర్లక్ష్యం వహిస్తుంటాం.. వాళ్లు తరచూ పాలు తాగే పాల బాటిళ్లు/ఫీడింగ్‌ బాటిళ్లు కూడా ఇందులో ఒకటి. రోజూ ఉపయోగించేవే కదా అని వాటిని పైపైన శుభ్రం చేస్తుంటారు....

Published : 29 Apr 2022 20:06 IST

పసి పిల్లల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం.. కంటికి రెప్పలా కాపాడుకుంటాం..  అయినా కొన్ని విషయాల్లో మనకు తెలియకుండానే నిర్లక్ష్యం వహిస్తుంటాం.. వాళ్లు తరచూ పాలు తాగే పాల బాటిళ్లు/ఫీడింగ్‌ బాటిళ్లు కూడా ఇందులో ఒకటి. రోజూ ఉపయోగించేవే కదా అని వాటిని పైపైన శుభ్రం చేస్తుంటారు చాలామంది. అయితే దీనివల్ల వాటిలో సూక్ష్మ క్రిములు, బ్యాక్టీరియా.. వంటివి వృద్ధి చెందే అవకాశాలు ఎక్కువని చెబుతోంది సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ. అందుకే వాటిని కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఉపయోగించి ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం చాలా ముఖ్యమంటోంది. మరి, అదెలాగో మనమూ తెలుసుకుందాం రండి..

రెండు గంటల్లోపే..!

చాలామంది ఫీడింగ్‌ ఇచ్చే ముందు కడుగుదాంలే అన్న ఉద్దేశంతో పాపాయి తాగిన బాటిల్స్‌ను పక్కన పెట్టేస్తుంటారు. ఒకవేళ పిల్లలు తాగగా మిగిలిపోయిన పాలు ఉన్నా.. అలాగే పక్కన పెట్టేస్తుంటారు. అయితే పాల మీద బ్యాక్టీరియా, క్రిములు త్వరగా వృద్ధి చెందే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. అందుకే పాలు పట్టిన వెంటనే ఎప్పటికప్పుడు బాటిల్స్‌ని శుభ్రం చేయాలి. మిగిలిపోయిన పాలుంటే రెండు గంటల్లోపే వాటిని పడేసి.. నీట్‌గా కడిగేయడం వల్ల పిల్లల్లో ఇన్ఫెక్షన్లు రాకుండా జాగ్రత్తపడచ్చు.

కడగడానికీ ఓ పద్ధతుంది!

పిల్లలు తాగిన పాల బాటిళ్లను కడగడానికీ ఓ పద్ధతుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో..

* ముందుగా చేతుల్ని శుభ్రం చేసుకోవాలి.. ఆపై బాటిల్‌, మూత, నిపుల్‌, రింగ్స్‌.. వంటి విడి భాగాలన్నీ సెపరేట్‌ చేయాలి.

* ఒక్కో భాగాన్ని కుళాయి ధార కింద ఉంచి.. పాల అవశేషాలు తొలగిపోయే వరకూ కడగాలి.

* ఇప్పుడు ఒక పాత్రలో వేడి నీళ్లు తీసుకొని.. అందులో డిటర్జెంట్‌ వేసి.. ఈ నీటిలో బాటిల్‌ విడిభాగాల్ని కాసేపు ఉంచి.. ఆపై ఒక్కో భాగాన్ని బాటిల్‌ బ్రష్‌తో రుద్ది కడగాలి. నిపుల్‌ రంధ్రంలో నుంచి నీళ్లు పోయేలా గట్టిగా వత్తాలి. తద్వారా అది క్లీన్‌ అవుతుంది.

* ఇప్పుడు మరోసారి బాటిల్‌ విడి భాగాల్ని కుళాయి ధార కింద కడిగి.. ఆరబెట్టాలి. అయితే ఈ క్రమంలో వీటిని పొడి వస్త్రంతో తుడవడం.. వంటివి చేయకూడదు. ఎందుకంటే దీని వల్ల కూడా క్రిములు వాటిపై చేరే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాటంతటవే ఆరనివ్వాలి.

మరిగించచ్చు!

పాపాయి తాగిన బాటిల్స్‌ని వేడినీళ్లతో కడగడమే కాదు.. వేడి నీళ్లలో మరిగిస్తే మరీ మంచిదంటున్నారు నిపుణులు. అదెలాగంటే..!

* బాటిల్‌ విడి భాగాలన్నీ సెపరేట్‌ చేసి.. ఒక పాత్రలో వేసి.. అవి మునిగేలా నీళ్లు నింపాలి.

* ఇప్పుడు ఈ పాత్రను స్టౌపై ఉంచి.. అందులోని నీటిని ఐదు నిమిషాల పాటు మరిగించాలి. ఆపై పక్కన పెట్టి దానంతటదే చల్లారనివ్వాలి.

* ఈ విడిభాగాలన్నీ నీటి నుంచి వేరు చేసి.. పరిశుభ్రమైన పాత్రలో వేసి ఒక రోజంతా ఫ్రిజ్‌లో ఉంచేయాలి. తిరిగి వాడే ముందు మరోసారి క్లీన్‌ చేస్తే సరిపోతుంది.

స్టీమింగ్‌తో క్షణాల్లో..!

అన్ని పద్ధతుల కంటే స్టీమింగ్‌తో బేబీ బాటిల్స్‌ని త్వరగా శుభ్రం చేయచ్చంటున్నారు నిపుణులు. ఇందుకు బయట దొరికే ఎలక్ట్రిక్‌ స్టీమ్‌ స్టెరిలైజర్స్‌ని ఉపయోగించుకోవచ్చు. ముందుగా బాటిల్‌ విడిభాగాల్ని సబ్బు నీటితో శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టీమ్‌ స్టెరిలైజర్‌ అడుగున కొన్ని నీళ్లు పోసి.. దాని పై లేయర్‌లో ఉన్న ప్లేట్‌పై ఈ విడిభాగాల్ని అమర్చి.. స్విచ్‌ ఆన్‌ చేసి లేబుల్‌పై సూచించిన సమయం పాటు అలాగే ఉంచాలి. అయితే కొన్ని ఆటోమేటిక్‌గా ఆఫ్‌ అయ్యే స్టెరిలైజర్స్‌ కూడా ఉంటాయి. అంతే.. నీళ్లు మరిగే క్రమంలో విడుదలయ్యే ఆవిర్ల వల్ల బాటిల్‌ శుభ్రపడుతుంది.. అందులోని క్రిములు, బ్యాక్టీరియా నశించిపోతాయి. ఇప్పుడు వీటిని వేరుచేసి పరిశుభ్రమైన పాత్రలో ఉంచి.. ఇంతకుముందు చెప్పుకున్నట్లు రోజంతా ఫ్రిజ్‌లో ఉంచాలి.. వాడే ముందు మరోసారి కడిగేసుకుంటే సరిపోతుంది.

పాపాయి పాల బాటిళ్లు కడగడం కాస్త శ్రమ, సమయంతో కూడుకున్న పనే! కాబట్టి కాస్త ఓపిక వహించి వీటిని శుభ్రం చేస్తే పిల్లలు ఎలాంటి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. అలాగే అదనంగా ఒకట్రెండు ఫీడింగ్‌ బాటిల్స్‌ని వెంట ఉంచుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్