నిద్ర పట్టాలంటే..
శారీరకంగా శ్రమిస్తే నిద్ర తన్నుకొస్తుందనేది తెలిసిందే. అయినప్పటికీ కొందరికి సరిగ్గా నిద్ర పట్టకపోవచ్చు. అలాంటివాళ్లు పడుకోవడానికి రెండు గంటలు ముందు చెమటలు కక్కేలా కసరత్తులు చేస్తే బాగా నిద్ర పడుతుంది అంటున్నారు కెనడాలోని కాంకార్డియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు. ఇందుకోసం వీళ్లు రకరకాల అధ్యయనాల్ని పరిశీలించి- అందులో సరిగ్గా నిద్రకు రెండు గంటల ముందు వ్యాయామం చేసినవాళ్లలో కొందరు బాగా నిద్రపోతే, మరికొందరికి నిద్ర మధ్యలో మెలకువ వస్తున్నట్లు గుర్తించారు. ఇలా నిద్ర పట్టనివాళ్లు సైక్లింగ్ అరగంట నుంచి గంట చేస్తే ఫలితం ఉంటుందట. అయితే కొందరు ఉదయం పూట చురుగ్గా ఉంటే, మరికొందరు సాయంత్రం వేళలో ఉత్సాహంగా ఉంటారు. ఉదయాన్నే లేచేవాళ్లు సాయంత్రం వేళ చెమటలు కక్కేలా వ్యాయామం చేసినా సరిగ్గా నిద్ర పట్టకపోవచ్చు. అదే ఉదయంకన్నా రాత్రిపూట చురుగ్గా ఉండేవాళ్లకయితే సాయంత్రం వ్యాయామం చేస్తే ఫలితం ఉండొచ్చు. కాబట్టి ఎవరి జీవగడియారాన్ని బట్టి వాళ్లు వ్యాయామం చేస్తే మంచి నిద్ర పడుతుంది అంటున్నారు పరిశోధకులు.
కాఫీ, టీల్లో మంచి బ్యాక్టీరియా!
ప్రొబయోటిక్స్ ఆరోగ్యానికి చేసే మేలు తెలిసిందే. అయితే ఇంతకాలం పెరుగు లేదా పులిసిన పదార్థాలు మాత్రమే పులియబెట్టినవిగా భావించేవాళ్లం. కానీ ఇప్పుడు ఉదయాన్నే తాగే కాఫీ, టీలను కూడా ప్రొబయోటిక్‌గా మార్చేయవచ్చు అని నిరూపించారు నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌కి చెందిన ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు. కాఫీ, టీలకు సంబంధించిన ముడిపదార్థాలను గది ఉష్ణోగ్రత దగ్గర 14 రోజులపాటు నిల్వచేయడం ద్వారా వాటిల్లో పొట్టకు మేలు చేసే కోట్లాది బ్యాక్టీరియాని ప్రవేశపెట్టారు. ఎందుకంటే డెయిరీ ఉత్పత్తులు అందరికీ సరిపడవు. వాటివల్ల కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదమూ ఉంది. పైగా మొక్కల నుంచి వచ్చే కాఫీ, తేయాకుల్ని ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది తాగుతారు. కాబట్టి వాటినే ప్రొబయోటిక్స్లా మార్చేసే పద్ధతిని రూపొందించారు. సాధారణంగా కాఫీ, టీ పొడుల్ని పులియకుండానే చేస్తుంటారు. కానీ సింగపూర్ నిపుణులు ఆయా పొడుల్ని తయారుచేసే సమయంలోనే అందులోకి కొన్ని రకాల బ్యాక్టీరియా చేరేలా చేస్తున్నారు. ఇలా ప్రొబయోటిక్ పొడితో టీ లేదా కాఫీ డికాక్షన్ చేసుకుని, ఒకరోజు బయట ఉంచి మర్నాడు రిఫ్రిజిరేటర్లో ఉంచి అప్పుడు తాగితే ఎక్కువ ఫలితం ఉంటుందట. ఇది కాస్త పండ్ల రుచితో ఉంటుంది. కావాలనుకుంటే వీటిల్లో పంచదారా పాలూ కూడా వేసుకోవచ్చట.
మాటామంతీ!
సాధారణంగా పరిచయం లేని వాళ్లతో వ్యక్తిగత విషయాలను చర్చించడం పద్ధతికాదనీ దానివల్ల ఎలాంటి ఫలితం ఉండదనీ భావిస్తాం. కానీ తెలీని వ్యక్తులతోనూ తమ గురించి చెప్పుకోవడం వల్ల ఆనందంగా అనిపిస్తుందని చికాగో యూనివర్సిటీకి చెందిన నిపుణుల బృందం పేర్కొంటోంది. వీళ్లు 1800 మందిని ఎంపికచేసి మరీ పరిశీలించారట. రైళ్లల్లో, బస్సుల్లో, పార్కుల్లో పరిచయమై పలకరించినప్పుడూ వాళ్లతో తమకు సంబంధించిన విషయాలను చర్చించినప్పుడూ ఎలా ఫీలయ్యారనే విషయాన్ని ప్రశ్నించి చూశారట. మొదట్లో కాస్త సంశయంగా అనిపించిందనీ కానీ వాళ్లతో కాసేపు మాట్లాడాక ఎంతో రిలాక్స్డ్గా అనిపించిందనీ చాలామంది చెప్పారట. ముందుగా పలకరించినవాళ్లతో రెండోవాళ్లు తమ గురించి చెప్పకున్నా మెల్లగా వాళ్లూ తమ విషయాలను పంచుకున్నారట. ఆ తరవాత ఇద్దరూ మిత్రులుగా మారినట్లూ గుర్తించారు. మొత్తమ్మీద మనిషి సంఘజీవి. కాబట్టి తెలిసినవాళ్లే కాదు, అపరిచితులతో మాట్లాడినప్పుడూ ఆనందంగానే అనిపిస్తుంది అని విశ్లేషిస్తున్నారు.
బరువు తగ్గడం లేదా?
ఎన్ని వ్యాయామాలు చేస్తున్నా ఆహారం తక్కువ తీసుకుంటున్నా కొంతమంది బరువు తగ్గడం లేదూ అంటే దానికి కారణం వాళ్ల పొట్టలోని బ్యాక్టీరియానే అంటున్నారు వాషింగ్టన్‌లోని ఇన్స్టిట్యూట్ ఫర్ సిస్టమ్స్ బయాలజీకి చెందిన నిపుణులు. ఈ విషయాన్ని వీళ్లు ఐదు వేల మందిలో కూలంకషంగా పరిశీలించారట. అందులో సగంమంది నెలకి వాళ్ల బరువులో ఒక శాతం చొప్పున తగ్గుతూ వచ్చారట. మరో వర్గం మాత్రం దానికి పెద్దగా స్పందించలేదట. దాంతో వాళ్ల రక్తం, మలం శాంపుల్స్ సేకరించి జన్యు పరీక్షలు చేశారట. అందులో- వాళ్ల పొట్టలోని బ్యాక్టీరియా పెరుగుదలని బట్టి బరువు తగ్గడం, తగ్గకపోవడం అనేది ఆధారపడి ఉందని గుర్తించారు. ఎందుకంటే తీసుకున్న ఆహారం రక్తంలో కలవడానికి ఈ బ్యాక్టీరియానే మధ్యలో వడబోతగా ఉపయోగపడుతుందట. ఈ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటే తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమై రక్తంలో కలుస్తుందనీ అలా కాకుండా దీని పెరుగుదల తక్కువగా ఉంటే జీర్ణప్రక్రియ కూడా ఆలస్యమవుతుందనీ పేర్కొంటున్నారు.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
-
-
సినిమా
-
ప్రముఖులు
-
సెంటర్ స్ప్రెడ్
-
ఆధ్యాత్మికం
-
స్ఫూర్తి
-
కథ
-
జనరల్
-
సేవ
-
కొత్తగా
-
పరిశోధన
-
కదంబం
-
ఫ్యాషన్
-
రుచి
-
వెరైటీ
-
అవీ.. ఇవీ
-
టిట్ బిట్స్