Updated : 13/10/2021 15:55 IST

దాండియాతో నృత్యాభిషేకం!

అమ్మలగన్న అమ్మ.. ఆ జగన్మాతను ప్రసన్నం చేసుకోవాలంటే కేవలం పూజాపునస్కారాలనే కాదు.. వీనులవిందైన సంగీతం, పారవశ్యంతో చేసే నృత్యాలను కూడా సాధనాలుగా వినియోగిస్తారు భక్తులు. అందుకే దుర్గా నవరాత్రులంటే ఆటపాటలతో ప్రతి వీధి హోరెత్తిపోతుంది. కనకదుర్గ కటాక్షానికి తపించే భక్తుల మేళతాళాలు, దాండియా నృత్యాలతో పుడమి పులకించిపోతుంది. తొమ్మిది రోజులపాటు అమ్మకు నృత్యాభిషేకం చేస్తూ ఆనందంగా గడిపే కళ దాండియా. ఎక్కడో పశ్చిమ భారతంలో పుట్టిన ఈ నృత్యం, నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యం సంపాదించుకుంది. అందుకే దుర్గా నవరాత్రుల సందర్భంగా దాండియా గురించి మరిన్ని వివరాలు మీకోసం..

యుద్ధమే నృత్యంగా..

నవరాత్రుల్లో ఆటపాటలతో దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు అత్యంత పరవశంతో చేసే నృత్యమే 'దాండియా రాస్'. మొదట నెమ్మదిగా ప్రారంభమై, మెల్లమెల్లగా వూపందుకునే దాండియా అసలెలా మొదలైందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. పురాణాల ప్రకారం.. దుర్గాదేవికి, మహిషాసురుడనే రాక్షసుడికి మధ్య జరిగిన భీకర యుద్ధ రూపమే ఇప్పటి దాండియా రాస్. ఈ ఆటలో ఉపయోగించే చేతి కర్రలను యుద్ధంలో జగన్మాత ఉపయోగించిన త్రిశూలంగా భావించి, 'లోకంలో పాపవినాశం తప్పనిసరి' అనే భావన వచ్చేలా నృత్యం చేస్తారు. అందుకే దీన్ని 'ఖడ్గనృత్యం' అని కూడా పిలుస్తారు. దీంతోపాటు మరో కథ కూడా ప్రచారంలో ఉంది. ద్వారకానగరిలో శ్రీకృష్ణుడు మురళీధరుడై.. రాధ, గోపికలతో చేసిన నృత్యాన్నే రాసలీలగా వర్ణించారు. అదే నృత్యాన్ని నవరాత్రుల్లో ప్రదర్శించే సంప్రదాయం తరతరాలుగా వస్తోంది. శ్రీకృష్ణుడి జీవితగాథలతో ముడిపడి ఉన్న గుజరాత్ రాష్ట్రంలో పుట్టిన దాండియా.. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.

సాయం సంధ్యా వేళలో..

నవరాత్రుల్లో అమ్మవారికి సాయంత్రం వేళ ఇచ్చే హారతి ఎంతో ముఖ్యమైనది. సకల దోషాలను అగ్నిలో ఆహుతి చేయమంటూ.. లోక కళ్యాణం కోసం పాటించే సంప్రదాయం ఇది. 'నీ చల్లని చేతిని మా తలపై ఉంచమ్మా' అని ముల్లోకాల్లో కొలువై ఉన్న ఆ జగన్మాతను కోరుకుంటూ, దుర్గామాతను మేలుకొల్పేందుకు చేసే ప్రయత్నంగా హారతికి ముందు గర్బా నృత్యాన్ని ప్రదర్శిస్తారు. ఆ తర్వాత వినసొంపైన సంగీత ధ్వనుల మధ్య అమ్మవారికి హారతిచ్చి, ఆ సందర్భాన్ని అలాగే అందలానికెక్కించేందుకు రంగురంగుల కర్రలతో, అమితమైన భక్తి భావంతో దాండియా నృత్యాన్ని ప్రారంభిస్తారు. డోలు, డప్పు, కంజరి, హార్మోనియం వంటి సంగీత వాయిద్యాలకు చేతికర్రల శబ్దం తోడైతే వచ్చే వినసొంపైన ధ్వనితో పాటు నృత్యకారులు లయబద్ధంగా శరీరాన్ని, చేతులను కదిలిస్తూ చేసే నృత్యం ఆకర్షణీయంగా ఉంటుంది. ఆ కర్రల శబ్దానికి ముల్లోకాలను పరవశింపజేసే శక్తి ఉందంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా నవరాత్రులు పూర్తయ్యేంతవరకు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చే జగజ్జనని భక్తులు చేసే ఈ దాండియా నృత్యాలకు ఎంతో సంతోషిస్తుందట.

లయబద్ధంగా..

దాండియారాస్‌లో భాగంగా సంగీతానికి తగ్గట్టు శరీరాన్ని లయబద్ధంగా కదిలించడమే కాదు.. చేతి కర్రలను చుట్టూ విభిన్న శైలుల్లో ధ్వని చేయడం కూడా సంప్రదాయమే. గుజరాత్‌లోని సౌరాష్ట్ర వంటి ప్రాంతాలతో పాటు రాజస్థాన్‌లో సైతం ఇలాంటి ప్రదర్శనలు నవరాత్రుల్లో ఇప్పటికీ కనిపిస్తూ ఉంటాయి. ఇందులో భాగంగా దాండియా కర్రలను ఎదురుగా వచ్చే వ్యక్తి చేతి కర్రలకు జతచేస్తూ శబ్దం చేస్తుంటారు. నృత్యం చేసేటప్పుడు కొన్ని రకాల ఆకృతుల్లో బృందంగా ఏర్పడి కూడా దాండియా ఆడవచ్చు. వీటిలో ముఖ్యమైనవి లెహ్రీ(అలాకృతి), త్రికోణీయ(త్రిభుజాకృతి), పద్మాకృతి, సీతాకోక చిలుకాకృతి.

కన్నుల పండువగా..

దాండియా నృత్యం చూసేందుకు ఎం అద్భుతంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. దానికి కారణం దాండియా చేసే వారి శరీర కదలికలు, చేతికర్రల సవ్వడి, నృత్యకారుల ముఖంలో వెల్లివిరిసే ఆనందం, వాయిద్యాల వినసొంపైన సంగీతం.. అయితే వీటన్నింటికీ మించిన కారణం మరొకటి ఉంది. అదే దాండియా అలంకరణ. రంగురంగుల దుస్తులు, అద్దాల రవికల మెరుపులు, బరువైన ఆభరణాలు, లక్క గాజుల సవ్వళ్లు.. ఇవీ దాండియాకు అసలుసిసలైన అందాన్ని తెచ్చిపెడతాయి. గుజరాత్ సంప్రదాయ దుస్తుల్లో ఆడే దాండియా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. పూర్వం దాండియా కర్రలను కేవలం వెదురుతోనే తయారుచేసేవారు. కానీ రానురాను ప్లాస్టిక్, చెక్కతో తయారైనవి కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటికి చివర్లో చిన్న మువ్వలను జతచేయడం ఇప్పుడు కొత్త ట్రెండ్. దీని ద్వారా ఆడుతున్నప్పుడు అవి వింత సవ్వడిని సృష్టిస్తాయి. మహిళలైతే బీడ్స్, రంగురంగుల అద్దాలతో రూపొందించిన ఛనియాఛోలీ, గాగ్రా ధరిస్తారు. ఆభరణాల్లో భాగంగా పట్టీలు, మెడలో హారాలు, రంగురంగుల గాజులు, జూకాలు, నడుముకు కమర్‌బంద్ వంటి వెండి ఆభరణాలు పెట్టుకుంటారు. అదే పురుషులైతే సల్వార్ కమీజ్ లేదా కఫ్నీ పైజమాపై తలపాగా ధరిస్తారు. ఇక దాండియా కర్రలను సైతం వస్త్రధారణకు ఏమాత్రం తీసిపోకుండా రంగురంగుల కాగితాలు చుట్టి అలంకరిస్తారు.

దాండియా లాంటివే..

ఇక నవరాత్రుల్లో దుర్గాదేవిని ప్రసన్నం చేసుకునేందుకు చేసే నృత్యాలను వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. గుజరాత్‌లో కేవలం పురుషులు మాత్రమే చేసే నృత్యాన్ని 'గర్బీ' అంటారు. జొన్న బుట్టలు లేదా కాగడాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ నవరాత్రుల్లో అమ్మవారిని కొలిచే సంప్రదాయం ఇది. అలాగే నవరాత్రుల్లో పశ్చిమ భారతదేశంలో కేవలం మహిళలు మాత్రమే ప్రదర్శించే నృత్యం 'తిప్పని'. పొడవైన కర్రలతో భూమిని చదును చేస్తూ వారి వృత్తిని ప్రతిబింబించేలా కొన్ని రకాల తెగలవారు చేసే నృత్యం ఇది. తమిళనాడులో 'పిన్నల్ కొలాట్టం' అనే నృత్యంతో దుర్గాదేవిని పూజిస్తారు. ఒక చేతిలో కర్ర, మరో చేతిలో తాడును చుట్టుకొని వలయాకారంలో చేసే నృత్యం ఇది. ఇక రాజస్థాన్‌లో చేసే ఘూమర్, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల్లో చేసే దాంగ్‌లీలా నృత్యాలు నవరాత్రుల్లో అత్యంత ప్రసిద్ధి చెందినవి.


Advertisement

మరిన్ని