ఈ చిట్కాలతో నేను కొవిడ్‌ను జయించా!

మన దేశంలో కరోనాకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది.. ఈ క్రమంలో నిత్యం వేలాది మంది వైరస్‌ బారిన పడుతున్నారు. వీరిలో ఎక్కువ శాతం మంది తక్కువ లక్షణాలతో హోమ్‌ ఐసొలేషన్‌లో చికిత్స తీసుకుంటూనే కోలుకుంటున్నారు. కొంతమంది సెలబ్రిటీలైతే తాము వైరస్‌ను జయించే క్రమంలో పాటించిన చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ ఇతరుల్లో ధైర్యం నింపుతున్నారు. ఆ లిస్టులో ప్రముఖ సెలబ్రిటీ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌, పిలాటిస్‌ నిపుణురాలు

Published : 22 Jun 2021 19:23 IST

మన దేశంలో కరోనాకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది.. ఈ క్రమంలో నిత్యం వేలాది మంది వైరస్‌ బారిన పడుతున్నారు. వీరిలో ఎక్కువ శాతం మంది తక్కువ లక్షణాలతో హోమ్‌ ఐసొలేషన్‌లో చికిత్స తీసుకుంటూనే కోలుకుంటున్నారు. కొంతమంది సెలబ్రిటీలైతే తాము వైరస్‌ను జయించే క్రమంలో పాటించిన చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ ఇతరుల్లో ధైర్యం నింపుతున్నారు. ఆ లిస్టులో ప్రముఖ సెలబ్రిటీ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌, పిలాటిస్‌ నిపుణురాలు యాస్మిన్‌ కరాచీవాలా కూడా ఉన్నారు. కొవిడ్‌ను ఎదుర్కొనే క్రమంలో తాను పాటించిన చిట్కాలు, కోలుకున్నాక చేసిన వ్యాయామాల గురించి ఇటీవలే ఇన్‌స్టాలో వరుస పోస్టులు పెట్టారామె. దీంతో ‘మీకు కొవిడ్‌ ఎప్పుడు సోకింది?’ అంటూ ఆమె ఫాలోవర్లు ఆశ్చర్యపోతున్నారు. ఏదేమైనా ‘మీ చిట్కాలు ఎంతోమందికి మేలు చేస్తాయం’టూ ఆమెకు ధన్యవాదాలు చెబుతున్నారు. మరి, ఇంతకీ యాస్మిన్‌ పంచుకున్న ఆ కొవిడ్‌ టిప్స్‌ ఏంటో మనమూ తెలుసుకుందాం రండి..

కరోనా నుంచి కోలుకునే క్రమంలో మనం తీసుకునే పోషకాహారం, చేసే వ్యాయామాలు ఎంతో మేలు చేస్తాయని నిపుణులు పదే పదే చెబుతున్న సంగతి తెలిసిందే! యాస్మిన్‌ కూడా అదే మాట చెబుతున్నారు. కరోనా సోకిన తర్వాత హోమ్‌ ఐసొలేషన్‌లో ఉంటూ తాను పాటించిన కొన్ని చిట్కాలు, వైరస్‌ నుంచి బయటపడ్డాక తాను చేసిన కొన్ని శ్వాస సంబంధిత వ్యాయామాల గురించి వివరిస్తూ ఇటీవలే ఇన్‌స్టాలో వరుస పోస్టులు పెట్టారామె. అయితే తనకు కొవిడ్‌ ఎప్పుడు సోకిందన్న విషయం మాత్రం వెల్లడించలేదామె.

ఆవిరి పట్టాను!

‘నాకు వైరస్‌ తాలూకు లక్షణాలు చాలా స్వల్పంగానే కనిపించాయి. కాబట్టి హోమ్‌ ఐసొలేషన్‌లోనే గడిపాను. ఈ క్రమంలో నేను తీసుకున్న జాగ్రత్తలు, వైరస్‌ నుంచి బయటపడ్డాక చేసిన వ్యాయామాల గురించి మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నా. ఇవి నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ముఖ్యంగా నేను చేసిన వ్యాయామాలు నా ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మరింతగా పెంచాయి. కొవిడ్‌ నుంచి కోలుకునే క్రమంలో..

* రోజుకు రెండు మూడు సార్లు ఆవిరి పట్టాను.

* రోజూ 1000mg విటమిన్‌ ‘సి’ సప్లిమెంట్‌ వేసుకున్నా.

* క్రమం తప్పకుండా రోజూ ఒక జింక్‌ సప్లిమెంట్‌ మాత్ర తీసుకున్నా.

* రోజుకు రెండుసార్లు ఆక్సిజన్‌ స్థాయులు పరీక్షించుకునేదాన్ని. మీలో ఎవరికైనా ఆక్సిజన్‌ స్థాయులు తక్కువగా ఉన్నట్లయితే వారు ప్రోనింగ్‌ పద్ధతిని అనుసరించి ఈ స్థాయులు పెంచుకోవచ్చు.

* ఇంటి నుంచే డాక్టర్‌ని సంప్రదించేదాన్ని. ఎవరైనా సరే(హోమ్‌ ఐసొలేషన్‌లో ఉన్న వారు సొంత వైద్యం కాకుండా డాక్టర్‌ సూచించిన మందులే వాడాలి.)

ఈ వ్యాయామాలు మేలు చేస్తాయ్‌!

ఇక కరోనా నుంచి బయటపడ్డాక కొన్ని శ్వాస సంబంధిత వ్యాయామాలు చేశాను. ఈ క్రమంలో తక్కువ తీవ్రత ఉన్న వర్కవుట్స్‌ ఎంచుకున్నా.. అది కూడా నా శరీరానికి సౌకర్యవంతంగా ఉన్నంత వరకే ఎక్సర్‌సైజెస్‌ చేశా. ఎవరైనా సరే.. ఇలా కొవిడ్‌ నుంచి కోలుకున్నాక తమ శరీరం మాట వింటూ సౌకర్యవంతంగా ఉండడానికే ప్రయత్నించడం ఉత్తమం.


బెల్లీ బ్రీతింగ్‌ (5-10 సార్లు)

ముందుగా నిటారుగా కూర్చొని రెండు చేతుల్ని పొట్టకు ఆనించాలి. ఆపై నెమ్మదిగా గాలి పీల్చుతూ (గాలి పొట్టలోకి వెళ్లేలా).. బయటికి వదులుతూ ఉండాలి. ఈ క్రమంలో పొట్ట వ్యాకోచం చెందడం, సంకోచించడం మనం గమనించచ్చు. ఇలా ఐదు నుంచి పది సార్లు రిపీట్‌ చేయాల్సి ఉంటుంది.


లాటరల్‌ లంగ్‌ బ్రీతింగ్‌ (5-10 సార్లు)

నిటారుగా కూర్చొని రెండు చేతులను మడిచి మణికట్టు భాగాలను చంకల కింద ఛాతీకి సమాంతరంగా ఉంచాలి. ఇప్పుడు ఊపిరితిత్తుల్లోకి వెళ్లేలా నెమ్మదిగా గాలి పీల్చుతూ (పొట్టలోకి వెళ్లకుండా).. ఆపై నెమ్మదిగా బయటికి వదలాలి.. ఈ క్రమంలో పొట్ట, ఊపిరితిత్తుల మధ్య భాగంలో బోలుగా అనిపించడం మనం గమనించచ్చు. అలాగే ఈ ప్రక్రియ చేసేటప్పుడు భుజాలు కాస్త పైకి, కిందికి కదలడం చూడచ్చు. ఇలా 5 నుంచి 10 సార్లు చేయాలి.


సైడ్‌ బెండ్‌ (5 సార్లు)

నిటారుగా కూర్చొని ఎడమ చేతిని కాస్త దూరంగా పక్కకు జరిపి.. కుడి చేతిని తలపై నుంచి వంచుతూ ఎడమ చేతికి సమాంతరంగా తీసుకురావాలి. ఈ క్రమంలో ఛాతీ భాగం కూడా ఎడమవైపు వంగడం గమనించచ్చు. ఈ పొజిషన్‌లో నెమ్మదిగా గాలి పీల్చుతూ.. ఆపై వదులుతూ ఉండాలి. ఇలా ఐదు సార్లు చేయాలి. ఆపై కుడివైపుకు వంచుతూ మరో ఐదుసార్లు రిపీట్‌ చేయాల్సి ఉంటుంది.


క్యాట్‌ కౌ

ముందుగా మోకాళ్లు, మోచేతులపై కూర్చొని.. నెమ్మదిగా గాలి పీల్చుతూ తలను కిందికి, వెన్నెముకను పైకి లేపుతూ క్యాట్‌ కౌ పొజిషన్‌లోకి రావాలి. ఆపై పీల్చిన గాలిని వదులుతూ తలను పైకెత్తుతూ, వెన్నెముక భాగాన్ని కిందికి వంచాలి. ఇలా ఐదు సార్లు చేయాలి.


ట్విస్ట్‌ అండ్‌ హోల్డ్‌

నిటారుగా కూర్చొని ఎడమవైపు తిరుగుతూ కుడి చేతిని ఎడమ మోకాలిపై, ఎడమ చేతిని వెనకవైపు ఉంచాలి. ఈ పొజిషన్‌లో నాలుగైదు సార్లు గాలి పీల్చుతూ, వదులుతూ ఉండాలి. ఇప్పుడు కుడివైపు తిరిగి ఇలాగే నాలుగైదు సార్లు శ్వాస పీల్చుతూ వదులుతూ వ్యాయామం చేయాలి.


మినీ స్వాన్‌

ప్రోనింగ్‌ పొజిషన్‌లో బోర్లా పడుకోవాలి. రెండు అరచేతుల్ని రెండువైపులా నేలపై ఉంచాలి. మోచేతులపై ఒత్తిడి పెడుతూ తలను, మోకాళ్లపై ఒత్తిడి పెడుతూ ఛాతీని కాస్త పైకి లేపి.. తిరిగి యథాస్థానానికి రావాలి. ఇలా 5-8 సార్లు చేయాలి.


హిప్‌ ఫ్లెక్సోర్‌ స్ట్రెచ్‌

లాంజ్‌ పొజిషన్‌లో కూర్చొని.. కుడి చేతిని నడుంపై ఉంచి కాస్త ముందుకు ప్రెస్‌ చేయాలి. ఎడమ చేతిని ఎడమ మోకాలిపై ఉంచి నిటారుగా కూర్చోవాలి. ఈ పొజిషన్‌లో ఐదుసార్లు గాలి పీల్చుతూ వదులుతూ వ్యాయామం చేయాలి. మరోవైపు కూడా ఇదే విధంగా కూర్చొని వర్కవుట్‌ రిపీట్‌ చేయాలి.


బటర్‌ఫ్లై స్ట్రెచ్‌

రెండు మోకాళ్లను మడుస్తూ రెండు అరికాళ్లను ఒక దగ్గర చేర్చి నిటారుగా కూర్చోవాలి. రెండు చేతులతో పాదాలను పట్టుకోవాలి. ఆపై మోకాళ్లను పైకి కిందికి అంటూ వ్యాయామం చేయాల్సి ఉంటుంది. ఇది చూడ్డానికి బటర్‌ఫ్లై ఎగిరినట్లుగా కనిపిస్తుంది. ఇలా 10-20 సార్లు చేయాలి.
అయితే మీకు లక్షణాలు కాస్త తీవ్రంగా కనిపించినా, కొవిడ్‌ నుంచి ఇంకా కోలుకోకపోయినా.. వ్యాయామాలు చేసే విషయంలో మీ డాక్టర్‌ సలహా తీసుకోవడం తప్పనిసరి. అలాగే కొవిడ్‌ చికిత్స అందరికీ ఒకలా ఉండకపోవచ్చు.. కాబట్టి మీ ఆరోగ్య స్థితిని డాక్టర్‌కు వివరించి వారు సూచించే సలహాలను పాటించడం, మందులను వాడడం ఉత్తమం.
స్టే సేఫ్‌ బీ స్ట్రాంగ్‌!


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్