ఈ మేకప్.. వేసవికి ప్రత్యేకం
మండుతున్న ఈ ఎండల్లోనూ తప్పనిసరిగా హాజరుకావాల్సిన ముఖ్యమైన వివాహాది శుభకార్యాలు, పార్టీలుంటాయి. ఈ వేడికి ముఖానికి వేసిన మేకప్ క్షణాల్లో కరిగిపోతుంటుంది. ఇలాకాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు.
మండుతున్న ఈ ఎండల్లోనూ తప్పనిసరిగా హాజరుకావాల్సిన ముఖ్యమైన వివాహాది శుభకార్యాలు, పార్టీలుంటాయి. ఈ వేడికి ముఖానికి వేసిన మేకప్ క్షణాల్లో కరిగిపోతుంటుంది. ఇలాకాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు.
పార్టీకెళ్లాల్సిన ముందు రోజు రాత్రి చెంచా తేనెలో పావుచెంచా చక్కెర వేసి కలిపి ముఖాన్ని స్క్రబ్ చేసి శుభ్రపరచాలి. ఆ తర్వాత రెండు చెంచాల కలబంద గుజ్జులో పావుచెంచా బాదంనూనె, రెండు ఈ విటమిన్ క్యాప్స్యూల్స్ కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరనిచ్చి నిద్రపోవాలి. తెల్లారాక చల్లటి నీళ్లతో కడిగితే ముఖం తేమగా, మృదువుగా మారి, మేకప్‌కు సిద్ధమవుతుంది. అప్పుడు ఐస్‌క్యూబ్‌తో ముఖాన్ని సున్నితంగా రుద్ది ఆరనివ్వాలి. ఆ తర్వాత మాయిశ్చరైజర్ రాసి ఆరనివ్వాలి. సూర్యరశ్మి ప్రభావం పడకుండా ఎస్పీఎఫ్ 30 సన్‌స్క్రీన్, ఆపై ప్రైమర్ రాయాలి. ఆ తర్వాతే మేకప్ ప్రారంభించాలి.
ఎంపిక.. వేసవిలో ఆయిల్ ఫ్రీ, వాటర్ ప్రూఫ్ మస్కారా, ఐలైనర్, లిప్‌స్టిక్ వంటివి ఎంచుకుంటే ఎండవేడికి కరగవు. అలాగే చర్మవర్ణానికి సరిపడే లేతరంగుల మాయిశ్చరైజర్, వాటర్ బేస్డ్ లైట్ వెయిట్ ఫౌండేషన్ ఈ సీజన్‌కు సరైనవి. మెరుపులమయంగా ఉండాలని షిమ్మర్ లేదా షిమ్మరీ ఉత్పత్తులను మాత్రం వినియోగించకూడదు. ఇవి చెమట పట్టినట్లుగా, జిడ్డుగా కనిపించేలా చేస్తాయి. కంటి కింద, పెదాల చివర్లలో ఇచ్చే షీర్ షేడ్స్ మాత్రం వేసవి ప్రత్యేకం. ఇవి తాజా లుక్‌నిస్తాయి. హెవీ క్రీమ్స్, పౌడర్స్ వంటివి త్వరగా కరిగిపోయి మేకప్ చెదిరినట్లు చేస్తాయి. అలాగే చర్మరంధ్రాల్లోకి ఇవన్నీ చేరి మూసుకు పోయే ప్రమాదం ఉంది. దీంతో మొటిమలు, మచ్చలు, అలర్జీలు వస్తాయి. కాబట్టి తక్కువ మేకప్ మంచిది.
కనురెప్పలను.. నలుపు కన్నా, నియాన్ వర్ణం ఐలైనర్‌తో ముఖాన్ని మరింత ఆకర్షణీయంగా చేయొచ్చు. సమ్మర్ మేకప్‌లుక్‌కు ఈ వర్ణభరితమైన గ్రాఫిక్ ఐ అదనపు అందాన్ని ఇస్తుంది. పుదీనా ఆకుపచ్చ, నీలి ఆకాశ వర్ణం నియాన్ ఐలైనర్ ముఖారవిందాన్ని తక్కువ మేకప్‌తోనే ఎక్కువ ఎలివేట్ చేయడమే కాదు, కనురెప్పల సోయగాన్ని మరింత అందంగా చేస్తుంది. మేకప్ పూర్తయ్యాక మ్యాట్ సెట్టింగ్ మిస్ట్ స్ప్రే మరవద్దు. ఇది ఏడెనిమిది గంటల పాటు మేకప్‌ను తాజాగా ఉంచి, ముఖం మెరిసేలా కనికట్టు చేస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.