మన జీవితానికి మనమే కథానాయిక..
మహిళగా కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడమే ఓ గొప్ప నైపుణ్యం. ఎవరికేం కావాలో ఇట్టే తెలుసుకోగలం. ఎప్పడు, ఎవరి ప్రాధాన్యతలేంటో గుర్తించగలం. అందరినీ ఒక తాటిపై నడిపించే శక్తిమంతులం.
గంగాప్రియ చక్రవర్తి, ఎండీ, ఫోర్డ్ బిజినెస్ సొల్యూషన్స్, ఇండియా
మహిళగా కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడమే ఓ గొప్ప నైపుణ్యం. ఎవరికేం కావాలో ఇట్టే తెలుసుకోగలం. ఎప్పడు, ఎవరి ప్రాధాన్యతలేంటో గుర్తించగలం. అందరినీ ఒక తాటిపై నడిపించే శక్తిమంతులం. పరిమితమైన వనరులతోనే పని పూర్తిచేస్తూ.. యుక్తిగా అడుగేయగలం. సమయానికి తగ్గట్లు సహనం వహించడంలో ముందుంటాం. మా సంస్థలో మహిళలకు బాధ్యతలు అప్పగిస్తే ప్రతి ఒక్కరూ పూర్తి స్థాయి నైపుణ్యాలను ప్రదర్శించి అద్భుత ఫలితాలను చూపిస్తారు. అయితే ఇంటితోపాటు ఉద్యోగినిగా బాధ్యతలు నిర్వర్తించడంలో మహిళలపై కొంత ఒత్తిడి పెరుగుతోంది. దీంతో కొందరిలో స్వీయనమ్మకం తగ్గి అదనపు బాధ్యతలను తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. కుటుంబం, పిల్లలకు అధిక ప్రాధాన్యమిచ్చి, కెరియర్‌కు ద్వితీయ స్థానాన్ని కేటాయిస్తున్నారు. మరికొందరైతే పని చేసే చోట తమ సామర్థ్యాలను ప్రదర్శించే అవకాశాలున్నా చొరవ చూపడానికి సంకోచిస్తున్నారు. కొందరు ప్రచారం అవసరం లేదు, చేసే పనే.. మా గురించి చెబుతుందంటారు. అవకాశాలు అవే వెతుక్కొంటూ వస్తాయని అపోహ పడతారు. ఈ రకమైన ఆలోచనల్లో మార్పు రావాలి. అవసరమైనప్పుడు మన ప్రతిభ గురించి అందరికీ తెలిసేలా చేయడానికి ప్రయత్నించాలి. లేదంటే మనం వేసే ఆ వెనకడుగుతో వందలమంది మనల్ని దాటి ముందుకెళ్లి పోతారు. దాంతో మన అవకాశాలను మనమే చేజార్చుకుంటున్నట్లు అవుతుంది. నేనొక కన్సల్టింగ్ సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఓ ముఖ్యమైన బాధ్యతలో నన్ను పరిగణనలోకి తీసుకోలేదు. నన్ను కనీసం సంప్రదించలేదు. ఇది తెలిసిన వెంటనే పై అధికారిని కలిసి, ఆ బాధ్యతలను స్వీకరించగలనని చెప్పా. ‘మీకు ఆసక్తి లేదేమో అనుకున్నాం’ అన్నారాయన. కానీ నా అంతట నేను ముందుకు రావడంతో నాకప్పగించారు. ఆ పనిని విజయవంతంగా పూర్తి చేసి నిరూపించుకున్నా. అవకాశాలెప్పుడూ వెతుక్కొంటూ రావు. మనమే చేజిక్కించుకోవాలి. లేదంటే బాధ్యత తీసుకోవడానికి మనకు ఆసక్తి లేదనుకునే ప్రమాదం ఉంటుంది. మన జీవితానికి మనమే కథానాయిక అవ్వాలి. అలాగే ఉద్యోగ బాధ్యతల్లో మన స్థానాన్ని మనం దక్కించుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.