స్థలం కాగితాలు.. ఇవ్వమంటున్నారు!

మావారు ఉండగా ఇంటి స్థలం కొనుక్కొన్నాం. తర్వాత ఆయన అనారోగ్యంతో చనిపోయారు. మా అత్తింటి వారు ఆ స్థలం కాగితాల్ని తీసుకు వెళ్లిపోయారు. ఇది జరిగి 15 ఏళ్లు అవుతుంది. నేనో చిన్న ప్రైవేట్‌ ఉద్యోగం చేసుకుంటున్నా. నా ఆరోగ్యం బాలేదు...

Updated : 21 Jun 2022 04:57 IST

మావారు ఉండగా ఇంటి స్థలం కొనుక్కొన్నాం. తర్వాత ఆయన అనారోగ్యంతో చనిపోయారు. మా అత్తింటి వారు ఆ స్థలం కాగితాల్ని తీసుకు వెళ్లిపోయారు. ఇది జరిగి 15 ఏళ్లు అవుతుంది. నేనో చిన్న ప్రైవేట్‌ ఉద్యోగం చేసుకుంటున్నా. నా ఆరోగ్యం బాలేదు. పిల్లల చదువులకి భారంగా ఉంది. ఇంటి అద్దె కట్టుకోవాలి. పాపకి కూడా ఆరోగ్యం బాలేదు. హాస్పిటల్లో చూపించాలి. నా స్థలం అమ్ముకుంటాను కాగితాలు ఇవ్వమంటే ఇవ్వడం లేదు. నేను వాళ్లపైన కేసులు పెట్టదల్చుకోలేదు. ఇంకేదైనా మార్గంలో కాగితాలు పొందే వీలుందా?

- ఓ సోదరి

స్థలం మీ భర్త కొన్నదే కాబట్టి అది మీ భర్త స్వార్జితమే అవుతుంది. మీవారు వీలునామా రాయకుండా చనిపోతే సెక్షన్‌ 8 హిందూ వారసత్వ చట్టం ప్రకారం క్లాస్‌1 వారసులకు చెందుతుంది. అంటే కొడుకు, కూతురు, భార్య, తల్లి ఆ తర్వాత పిల్లలకు పెళ్లయ్యాక చనిపోతే వాళ్లకూ పిల్లలు ఉంటే వాళ్లూ వస్తారు. కాబట్టి మీ పిల్లలతోపాటు మీకూ ఒక భాగం మీ భర్త తల్లికీ ఒక భాగం వస్తుంది. మీరు కేసులు పెట్టదలచుకోలేదు అంటున్నారు. కాబట్టి, మధ్యవర్తుల ద్వారా పరిష్కారానికి ప్రయత్నించండి. స్థలం ఎవరి పేరు మీద కొన్నారో మీకు తెలుసా? ఒకవేళ మీ ఇద్దరి పేరిటా ఉమ్మడిగా కొంటే మీవారి తర్వాత అది మీకు పూర్తిగా సంక్రమిస్తుంది. మీకు ఆ స్థలం సర్వే నంబరు, హద్దులు, కొన్న సంవత్సరం వంటివి తెలిస్తే సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులో పేపర్లు పోయాయని చెప్పి డూప్లికేటు వాటి కోసం దరఖాస్తు చేయండి. ఇవేమీ తెలియకపోతే రికార్డుల ద్వారా కూడా తెలుసుకోవచ్చు. మీ భర్త పేరు మీద ఉంటే వాళ్లు కూడా దాన్ని అమ్ముకోలేరు. ముందుగా మీరు ఏదైనా కౌన్సెలింగ్‌ సెంటర్‌ లేదా మీరుండే చోట లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ వారి వద్ద విషయం చెప్పి మీ అత్తగారి వాళ్లని పిలిపించే ప్రయత్నం చేయండి. లేదా గృహహింస చట్టాన్ని ఆశ్రయించక తప్పదు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్