ఈ వారసత్వ పత్రం అక్కడ చెల్లుతుందా?

మా నాన్న ఎటువంటి వీలునామా రాయకుండా 2021లో హఠాత్తుగా మరణించారు. ఆయన పేరున హైదరాబాద్‌లో ఓ ఫ్లాట్‌ ఉంది. మేము ప్రస్తుతం అందులోనే ఉంటున్నాం.

Updated : 12 Sep 2023 12:08 IST

మా నాన్న ఎటువంటి వీలునామా రాయకుండా 2021లో హఠాత్తుగా మరణించారు. ఆయన పేరున హైదరాబాద్‌లో ఓ ఫ్లాట్‌ ఉంది. మేము ప్రస్తుతం అందులోనే ఉంటున్నాం. ఇక్కడి సిటీ సివిల్‌ కోర్టు ద్వారా లీగల్‌ హైర్‌ సర్టిఫికెట్‌ తీసుకున్నాం. అయితే, ఆయన స్వార్జితంతో కట్టుకున్న మరో ఇల్లు ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. ఇప్పుడు మేం ఇక్కడ తీసుకున్న వారసత్వ ధ్రువీకరణ పత్రం ఏపీలోని ఇంటిని రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడానికి ఉపయోగపడుతుందా?

-ఓ సోదరి

మీ సమస్యకు పరిష్కారాన్ని భారతీయ వారసత్వ చట్టంలో పొందుపరిచారు. ఏ వ్యక్తైనా వీలునామా రాయకుండా చనిపోతే ఆ స్థితిని ‘డైడ్‌ ఇంటెస్టేట్‌’ అంటారు. ఇలా మరణించిన వ్యక్తి ఆస్తి వారి పిల్లలకు ఆటోమేటిక్‌గా వచ్చేస్తుందనుకుంటారు చాలామంది. కానీ, రెవెన్యూ రికార్డుల్లో మ్యూటేషన్‌ జరగాలంటే(పేరు మార్చుకోవాలంటే)  ముందు తమని తాము వారసులుగా నిరూపించుకోవాలి. ఇందుకోసం కోర్టు నుంచి వారసత్వ ధ్రువీకరణ పత్రం తెచ్చుకోవాలి. పై యాక్ట్‌లోని సెక్షన్‌ 371 కింద సంబంధిత జిల్లా కోర్టులో అంటే, ఆ వ్యక్తి నివసించిన లేదా వారి ఆస్తి ఉన్న చోట దీనికోసం దరఖాస్తు చేసుకోవాలి. దాన్ని పరిశీలించిన కోర్టు చట్టబద్ధ వారసులుగా గుర్తిస్తే అది ఎక్కడైనా చెల్లుతుంది. వాళ్ల ఆస్తుల వివరాలతో కోర్టుకి సంబంధం లేదు. బ్యాంకు డిపాజిట్లూ, ఆర్‌డీ, ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ల వంటి అన్నింటికీ వారసత్వ ధ్రువీకరణ పత్రం పనికొస్తుంది. అయితే, కోర్టు ఇచ్చిన ఆ పత్రాన్ని లాయర్‌కి చూపించి నిర్ధరించుకుని అప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని మీ ఇంటిని మీ పేరు మీదకు మార్పు చేయమని అడగండి. అలాకాకుండా మీరు కేవలం కుటుంబ సభ్యురాలిగా సర్టిఫికెట్‌ తీసుకుంటే అది ఫ్యామిలీ పెన్షన్‌ తీసుకునేందుకూ, ఎలక్ట్రిసిటీ, కమర్షియల్‌ టెలిఫోన్‌, బ్యాంకు ఖాతాల ట్రాన్స్‌ఫర్‌కు పనికొస్తుంది. ఇక,  లీగల్‌ హైర్‌ సర్టిఫికెట్‌ స్థిర, చరాస్తుల బదిలీకి అవసరం. ముందు మీరో న్యాయవాదితో మాట్లాడి త్వరితగతిన నిర్ణయాలు తీసుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్