వదులుకున్న వాటా వస్తుందా?

మా పెదనాన్న వ్యవసాయం చేస్తారు. నాన్న ప్రభుత్వ ఉద్యోగి. తాతయ్య ఆస్తిలో నాన్న వాటా తీసుకోలేదు. అన్నయ్య చదువుకోలేదని తన భాగం కూడా ఇచ్చేశారు.

Updated : 27 Feb 2024 14:09 IST

మా పెదనాన్న వ్యవసాయం చేస్తారు. నాన్న ప్రభుత్వ ఉద్యోగి. తాతయ్య ఆస్తిలో నాన్న వాటా తీసుకోలేదు. అన్నయ్య చదువుకోలేదని తన భాగం కూడా ఇచ్చేశారు. తాతయ్యకు ఆస్తులన్నీ వాళ్ల నాన్న నుంచే వచ్చాయి. ఇప్పుడు మా పరిస్థితి ఏమీ బాగాలేదు. అమ్మ క్యాన్సర్‌తో చనిపోయింది. తన ట్రీట్‌మెంట్‌కు చాలా ఖర్చు అయ్యింది. అక్కకు పెళ్లి చేసి అప్పులపాలయ్యాం. సొంత ఇల్లు కూడా ఈమధ్యే అమ్మేశాం. ఆస్తిలో మా నాన్న వాటా తిరిగి ఇమ్మని అడిగితే ఇవ్వడంలేదు. ఏం చేయమంటారు?

ఓ సోదరి

మీ నాన్న, పెదనాన్నలు ఆస్తిని భాగాలుగా పంచుకున్నారా? మీ తాతగారి ఆస్తిలో మీ తండ్రి తన వాటాను అన్నకు ఇచ్చినట్లు ఏదైనా కాగితం రాసుకున్నారా? ఇప్పుడు ఆ ఆస్తి ఎవరి పేరున ఉంది? మీ పెదనాన్న తన పేరు మీద పట్టా చేయించుకున్నారా? వీటన్నింటికీ సమాధానాలు దొరికితేనే మీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఎలాగంటే... ఇప్పుడు ఆస్తి మీ తాతగారి పేరు మీద ఉండి ఇంకా భాగాలు పంచుకోకపోతే మాత్రమే మీ పెదనాన్నకు, మీ నాన్నకు, ఇంకా వీరికి తోబుట్టువులు ఎవరైనా ఉంటే వారికీ అది సమానంగా వస్తుంది. మీ నాన్న ‘రెలింక్విష్‌మెంట్‌’ చేసి ఉంటే... అంటే తనకు తండ్రి ఆస్తిలో ఎటువంటి హక్కు లేదని రాసిచ్చి ఉంటే, అది ఇప్పటికీ రిజిస్టర్‌ కాకపోతే... దాన్ని తిరిగి తీసుకునే హక్కు ఉంది. తాత ఆస్తికి మీరూ హక్కుదారులే కాబట్టి మీ నాన్న తనకు భాగం వద్దని వదులుకోవడానికి లేదని... మీరు మీ నాన్నగారితో కలిసి పార్టిషన్‌ కోసం దావా వేయవచ్చు. అయితే, ఎటొచ్చి అది భాగాలు పంచుకోని ఆస్తి అయి ఉండాలి. అన్ని పంపకాలు అయిపోయి అది మీ పెదనాన్న పేరు మీదకు మారినా, ఇదంతా జరిగి 12 ఏళ్ల కంటే ఎక్కువ అయినా మీకు రావడం కష్టమే. ముందు మధ్యవర్తుల ద్వారా మాట్లాడించి చూడండి. మీ నాన్న పరిస్థితి చూసి మీ పెదనాన్న ఆ భాగం ఇవ్వడానికి ఒప్పుకోవచ్చు. లేదా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ద్వారా మధ్యవర్తిత్వపు రాజీకి ప్రయత్నించండి. ముందు ఆస్తి కాగితాలు, మార్కెట్‌ విలువ, ఈసీ మొదలైన వాటన్నింటినీ దగ్గర పెట్టుకుని లాయర్‌ని కలిస్తే మేలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్