కాకరతో.. జుట్టు సమస్యలూ దూరం..!

కాకర వల్ల కేవలం ఆరోగ్యానికే కాదు.. మన కురుల అందానికీ ఎంతో మేలు జరుగుతుంది. కాకర రసం తరచూ పట్టించడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుముఖం పడుతుంది. అలాగే కుదుళ్లు దృఢంగా, కురులు ఒత్తుగా తయారవుతాయి....

Published : 26 Jul 2023 13:25 IST

కాకరతో చేసిన వంటకాలు తినాలంటే 'అబ్బా.. చేదు' అనుకోకుండా ఉండలేం. అయితే కాకరకాయ వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయన్న విషయం తెలిసిందే. కాకర వల్ల కేవలం ఆరోగ్యానికే కాదు.. మన కురుల అందానికీ ఎంతో మేలు జరుగుతుంది. కాకర రసం తరచూ పట్టించడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుముఖం పడుతుంది. అలాగే కుదుళ్లు దృఢంగా, కురులు ఒత్తుగా తయారవుతాయి. అలాగే దీనిలో ఉన్న యాంటీమైక్రోబియల్ గుణాల వల్ల చుండ్రు, తలలో వచ్చే ఇతర ఇన్ఫెక్షన్లు దరి చేరకుండా ఉంటాయి. ఈ ప్రయోజనాలను పొందాలంటే ఏం చేయాలో తెలుసుకుందామా..

జుట్టు రాలే సమస్యకు..
ఈ రోజుల్లో ఎంతోమంది ఎదుర్కొనే సమస్య జుట్టు రాలిపోవడం. ఈ క్రమంలో కాకర రసాన్ని ఉపయోగిస్తే ఈ సమస్య నుంచి బయటపడచ్చు. దీనికోసం అరకప్పు కాకర రసాన్ని తీసుకొని దానిలో చెంచా కొబ్బరి నూనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు మొత్తానికి పట్టించాలి. మాడుకు కూడా రాసి ఐదు నుంచి పది నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. ఆ తర్వాత ముప్ఫై నుంచి నలభై నిమిషాల పాటు ఆరనివ్వాలి. అనంతరం గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఈ మిశ్రమాన్ని వారంలో రెండుసార్లు అప్త్లె చేసుకోవడం ద్వారా జుట్టు రాలే సమస్య అదుపులోకి వస్తుంది.

చివర్లు చిట్లితే..
మనం ఉపయోగించే హెయిర్‌కేర్ ఉత్పత్తుల్లోని రసాయనాలు, బయట కాలుష్యం ప్రభావం కారణంగా జుట్టు చివర్లు చిట్లడం సాధారణ సమస్యగా మారిపోయింది. దీనిపై మనం తలస్నానం చేసే విధానం కూడా ప్రభావం చూపుతుంది. దీన్ని నివారించడానికి సరిపడినంత కాకరకాయ రసాన్ని తీసుకొని కురులకు పట్టించాలి. 40 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చొప్పున చేస్తే.. మూడు వారాల్లో మంచి ఫలితం కనిపిస్తుంది.

చుండ్రు తగ్గించడానికి..
కురుల విషయంలో తగినంత శ్రద్ధ వహించకపోవడం, పోషకాహారం తీసుకోకపోవడం, కాలుష్యం తదితర కారణాల వల్ల చుండ్రు సమస్య ఎదురవుతుంది. దీనికోసం కొద్దిగా జీలకర్ర తీసుకొని మెత్తటి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. దీన్ని కాకర రసంలో కలిపి దాన్ని మాడుకు అప్త్లె చేసుకోవాలి. కొంతసేపు ఆరనిచ్చి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు నుంచి మూడుసార్లు చేయడం ద్వారా చుండ్రు సమస్య నుంచి విముక్తి కలుగుతుంది.

తెల్లజుట్టు సమస్యకు..
వివిధ కారణాల వల్ల కొంతమందిలో కుదుళ్ల వద్ద మెలనిన్ ఉత్పత్తి ఆగిపోతుంది. ఫలితంగా చిన్నవయసులోనే జుట్టు తెల్లగా మారిపోతుంది. ఇలాంటి వారు తెల్ల వెంట్రుకలు కనపడకుండా చేయడానికి హెయిర్‌డైని వేసుకుంటూ ఉంటారు. వీటిలోని రసాయనాల వల్ల జుట్టు పాడయ్యే అవకాశం ఉంటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే కాకరను ఉపయోగించడం మంచిది. దీనికోసం సరిపడినంత కాకర రసాన్ని తీసుకొని దాన్ని వెంట్రుకల కుదుళ్ల నుంచి చివరి దాకా పట్టించి గంట పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా కొన్ని రోజుల పాటు చేయడం వల్ల తెల్లజుట్టు తగ్గుముఖం పడుతుంది.

పొడిబారిన జుట్టుకు..
కాకర రసం, పెరుగు అరకప్పు చొప్పున తీసుకోవాలి. వీటికి రెండు చెంచాల నిమ్మరసం జత చేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో కొంత భాగాన్ని మాడుకు పట్టించి కాసేపు మునివేళ్లతో మృదువుగా మర్దన చేయాలి. మిగిలిన భాగాన్ని వెంట్రుకలకు మొత్తం పట్టించి ముప్పై నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్