జుట్టు ఒత్తుగా.. ఇలా..!

అమ్మాయిల అందంలో ముఖ్య పాత్ర పోషించే అంశాల్లో కేశ సంపద కూడా ఒకటి. అయితే మారుతున్న జీవనశైలి కారణంగా చాలామంది అమ్మాయిల్లో జుట్టు వూడిపోవడం, రాలిపోవడం, పలచబడటం, చివర్లు చిట్లడం.. వంటి సమస్యలు ఎదురవుతున్నాయి.

Published : 22 Mar 2024 11:50 IST

అమ్మాయిల అందంలో ముఖ్య పాత్ర పోషించే అంశాల్లో కేశ సంపద కూడా ఒకటి. అయితే మారుతున్న జీవనశైలి కారణంగా చాలామంది అమ్మాయిల్లో జుట్టు వూడిపోవడం, రాలిపోవడం, పలచబడటం, చివర్లు చిట్లడం.. వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా జుట్టు పలచబడినట్లు కనిపిస్తే ఆత్మవిశ్వాసం దెబ్బతిని నలుగురిలోకి వెళ్లడానికి కూడా వెనుకాడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో జుట్టు పలచబడినప్పుడు ఎలాంటి చిట్కాలు పాటించాలి? మళ్లీ ఒత్త్తెన కేశసంపద సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలి..? తెలుసుకుందాం రండి..

గుడ్డులోని తెల్లసొనతో..

కోడిగుడ్డులోని తెల్లసొన తీసుకొని బాగా గిలక్కొట్టాలి. దానిని కుదుళ్లకు చేరేలా పట్టించి 20 నుంచి 30 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీరు, గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. ఈవిధంగా వారానికోసారి క్రమం తప్పకుండా చేయడం వల్ల ఒత్త్తెన కేశాలు సొంతం చేసుకోవచ్చు.

కావాలనుకుంటే తెల్లసొన గిలక్కొట్టిన తర్వాత అందులో జుట్టుకు పెట్టుకొనే నూనె, కొద్దిగా నీరు కూడా జత చేసుకోవచ్చు. ఈ మిశ్రమం కుదుళ్లకు చేరేలా మృదువుగా మర్దన చేయాలి. అప్పుడే మంచి ఫలితం కనిపిస్తుంది.

మెంతులతో..

జుట్టు పరిమాణానికి అనుగుణంగా సరిపడినన్ని మెంతులు తీసుకొని నీటిలో 10 గంటల పాటు నానబెట్టాలి. తర్వాత వాటిని మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని కేశాలకు అప్త్లె చేసుకొని 30 నుంచి 40 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీరు, షాంపూ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. కావాలనుకుంటే మెంతుల మిశ్రమంలో కాస్త కొబ్బరిపాలు కూడా కలిపి కేశాలకు పెట్టుకోవచ్చు.

ఉసిరి, శీకాకాయలతో..

తలస్నానానికి రసాయనాలు ఉండే షాంపూలకు బదులుగా సహజసిద్ధంగా తయారుచేసిన ఉసిరి, శీకాకాయ పొడులను ఉపయోగించడం ద్వారా కూడా పలచబడిన కేశాలను తిరిగి ఒత్తుగా మార్చుకోవచ్చు. ఇవి కురుల ఎదుగుదలకు అవసరమయ్యే పోషణ అందించడంతో పాటు కుదుళ్లను దృఢంగా మార్చుతాయి. ఫలితంగా ఆరోగ్యవంతమైన కేశాలను తిరిగి పొందవచ్చు.

ఉల్లిరసంతో..

ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ కేశాల ఎదుగుదలను బాగా ప్రేరేపిస్తుంది. కాబట్టి ఒత్త్తెన కేశసంపద పొందాలనుకునే వారు వీటిని కూడా తమ చిట్కాల జాబితాలో చేర్చుకోవచ్చు. ఉల్లిరసం తీసుకొని కుదుళ్ల వద్ద మృదువుగా మర్దన చేయాలి.

కలబందతో..

కలబంద గుజ్జును కేశాలకు, కుదుళ్లకు చేరేలా అప్త్లె చేసుకోవాలి. తర్వాత 30 నుంచి 40 నిమిషాలు ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికోసారి క్రమం తప్పకుండా చేయడం వల్ల మంచి ఫలితం పొందచ్చు.

ఆముదంతో..

ఆముదం, కొబ్బరినూనె సమపాళ్లలో తీసుకొని కాస్త వేడి చేయాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు చేరేలా చేతివేళ్లతో మృదువుగా, గుండ్రంగా మర్దన చేసుకోవాలి. మొత్తం కేశాలకు, కుదుళ్లకు నూనె సమానంగా పరుచుకునేలా జాగ్రత్తపడాలి. తర్వాత గోరువెచ్చని నీటిలో ముంచి తీసిన టవల్‌ని తలకి చుట్టుకొని గంట పాటు అలాగే ఉండాలి. తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూ ఉపయోగించి తలస్నానం చేయాలి. ఈవిధంగా వారానికోసారి క్రమం తప్పకుండా చేయడం వల్ల ఒత్త్తెన కురులు సొంతం చేసుకోవడమే కాదు.. అవి ఆరోగ్యంగా, మెరుస్తూ కూడా ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్