ఇలా ఉంటూ ఆ బాధను తట్టుకోలేకపోతున్నా..!

సహాయం చేయడం కోసం ఇంట్లోనే ఉండిపోయా. ఇప్పుడు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే వర్కౌట్‌ కావడం లేదు. మా ఇంట్లో వాళ్లు, అక్కలు నాకు జాబ్‌ లేదని జాలి పడుతున్నారు. నాకు కావాల్సినవి కొనిస్తున్నారు. కానీ, అది నాకు నచ్చడం లేదు. ఇలా ఖాళీగా ఉండడం...

Published : 18 Sep 2022 15:02 IST

హాయ్‌ మేడమ్‌.. నేను పీజీ పూర్తి చేశాను. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నాను. ఉద్యోగం చేద్దామనుకునే సమయానికి మా అక్కకి డెలివరీ టైం వచ్చింది. అమ్మకి ఆరోగ్యం బాలేకపోవడంతో అక్కకు సహాయం చేయడం కోసం ఇంట్లోనే ఉండిపోయా. ఇప్పుడు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే వర్కౌట్‌ కావడం లేదు. మా ఇంట్లో వాళ్లు, అక్కలు నాకు జాబ్‌ లేదని జాలి పడుతున్నారు. నాకు కావాల్సినవి కొనిస్తున్నారు. కానీ, అది నాకు నచ్చడం లేదు. ఇలా ఖాళీగా ఉండడం వల్ల డిప్రెషన్‌కి లోనవుతున్నా.. ఏమాత్రం సంతోషంగా ఉండలేకపోతున్నాను. దీనికి తోడు మీ అక్కలిద్దరూ గవర్నమెంట్‌ జాబ్‌ చేస్తున్నారు.. నువ్వు ఏమీ చేయడం లేదని బంధువులు హేళన చేస్తున్నారు. ఆ బాధను అసలు తట్టుకోలేకపోతున్నా. ఒక్కోసారి చనిపోవాలనిపిస్తోంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పగలరు. - ఓ సోదరి

జ. మీ అమ్మగారికి ఆరోగ్యం బాలేకపోవడంతో మీ అక్కకి చేయవలసిన సహాయం చేసి కుటుంబానికి అండగా నిలబడ్డారు. అయితే ఆ సమయంలోనే ‘జీవితంలో చాలా కోల్పాయాను’ అన్న బాధ మిమ్మల్ని ఇబ్బంది పెడుతోందని అర్థమవుతోంది. అలాగే ఉద్యోగం లేదన్న మీ బాధను చూసి మీ అక్కలు కూడా మీపై జాలిని చూపిస్తున్నారు.

అయితే కేవలం కొద్ది రోజుల సమయం కోల్పోయినంత మాత్రాన జీవితంలో అన్ని అవకాశాలు కోల్పోయే పరిస్థితి ఉండదు. ప్రస్తుతమున్న ఖాళీ సమయంలో ఓ పక్క ఉద్యోగం వెతుక్కుంటూనే ఇంకా ఏం చేయచ్చనేది ఆలోచించండి. ఏమీ చేయకుండా ఉండడం వల్ల కుంగుబాటుకి లోనయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి, మీ మనుసుని మీకిష్టమైన పనుల వైపు మళ్లించే ప్రయత్నం చేయండి. ఉదాహరణకు మీకు ఇష్టమైన సబ్జెక్టుపై మీకున్న అవగాహనను మెరుగుపరచుకునే ప్రయత్నం చేయండి. దీనికోసం ఆన్‌లైన్‌ కోర్సులు, దూరవిద్యా విధానాలను ఉపయోగించుకోవచ్చు. అలాగే అనుభవం కోసం ఇంటర్న్‌షిప్‌లు, పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేయచ్చా? అనేది కూడా ఆలోచించుకోండి.

ఇకపోతే మీరు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నానని చెప్పారు. అయితే మీరు ఎలాంటి ఉద్యోగాల కోసం వెతుకుతున్నారు? మీకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలనూ అన్వేషిస్తున్నారా, లేకపోతే ఏవో కొన్నిటిని మాత్రమే ఎంపిక చేసుకొని అవి దొరకడం లేదని బాధపడుతున్నారా? వంటి విషయాలను పరిశీలించుకోండి. అలాగే మీ సహజమైన ఆలోచనా విధానం నుంచి కొంచెం పక్కకు మళ్లి కొత్తగా ఆలోచించే ప్రయత్నం చేయండి. దీనివల్ల సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే చక్కటి ఫలితాలు రావాల్సిన సమయంలో వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి నిరుత్సాహపడకుండా ప్రతి విషయాన్నీ సానుకూల దృక్పథంతో ఆలోచించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని