Deloitte Survey: అలాంటప్పుడు ఉద్యోగం మానకుండా ఉండాలంటే…

రాగిణికి ఆఫీస్‌లో మధ్యాహ్నం భోజనం చేయడానికి కూడా సమయం దొరకదు. ఇక వాళ్ల బాస్‌ సెలవులో ఉన్నప్పుడు అదనపు పని భారం ఆమెపై పడుతోంది. దీంతో ఓపిక నశించి ఒక్కోసారి విపరీతమైన ఒత్తిడి, కోపానికి......

Updated : 28 Apr 2022 19:02 IST

రాగిణికి ఆఫీస్‌లో మధ్యాహ్నం భోజనం చేయడానికి కూడా సమయం దొరకదు. ఇక వాళ్ల బాస్‌ సెలవులో ఉన్నప్పుడు అదనపు పని భారం ఆమెపై పడుతోంది. దీంతో ఓపిక నశించి ఒక్కోసారి విపరీతమైన ఒత్తిడి, కోపానికి లోనవుతుంటుంది.

మాలిని ఓ కంపెనీలో టీమ్‌ లీడర్‌. ఇటు తన పనిని, అటు తన బృందాన్ని మేనేజ్‌ చేసే క్రమంలో విపరీతమైన ఒత్తిడికి లోనవుతుంటుంది. ఒక్కోసారి దీన్ని అదుపు చేసుకోలేక సహోద్యోగులపై విరుచుకుపడుతుంటుంది.

ఇలా ఒకరిద్దరు కాదు.. సుమారు 56 శాతం మంది మహిళలు పని ప్రదేశంలో విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నట్లు తాజా డెలాయిట్‌ సర్వే పేర్కొంది. దీనికి తోడు అనుకూలమైన పనివేళలు లేకపోవడం, వృత్తి జీవితం ఆశాజనకంగా లేకపోవడం వల్ల ఉద్యోగినులు రాజీనామా బాట పట్టనున్నట్లు, తద్వారా రానున్న రెండేళ్లలో మరో ‘గ్రేట్‌ రెజిగ్నేషన్‌’ తప్పకపోవచ్చని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో.. అటు ఆరోగ్యం, ఇటు కెరీర్‌పై ప్రతికూల ప్రభావం చూపే ‘వర్క్‌ప్లేస్‌ బర్నవుట్‌’ను ఎలా ఎదుర్కోవాలి? వృత్తి జీవితాన్ని ఆశాజనకంగా ఎలా మార్చుకోవాలి? తెలుసుకుందాం రండి..

పనిలో సంతోషం, సంతృప్తి ఉన్నప్పుడే దాన్ని మనం ఆస్వాదించగలుగుతాం.. అదే రోజూ విపరీతమైన ఒత్తిడితో పని ప్రదేశంలోకి అడుగుపెడితే కెరీర్‌లో ఒక రకమైన నిర్లిప్తత, నిరాసక్తత ఆవహిస్తాయి. సుమారు 56 శాతం మంది ఉద్యోగినులు ఇలాంటి ఒత్తిడితోనే (వర్క్‌ప్లేస్‌ బర్నవుట్‌) సతమతమవుతున్నట్లు తాజాగా నిర్వహించిన డెలాయిట్‌ సర్వే పేర్కొంది. ‘Women@Work 2022 : A Global Outlook’ పేరుతో నవంబర్‌-2021 నుంచి ఫిబ్రవరి-2022 వరకు నిర్వహించిన ఈ సర్వేలో పది దేశాల నుంచి 5 వేల మంది మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. ఇందులో భారత్‌ నుంచి 500 మంది ఉన్నారు.

నివేదిక ఏం చెబుతోంది..?

* క్రితం ఏడాదితో పోల్చితే.. సుమారు 56 శాతం మంది ఉద్యోగినులు పని ప్రదేశంలో విపరీతమైన పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారట! దీంతో ఇప్పటికే తీవ్రంగా విసుగెత్తిపోయామని వారు చెబుతున్నారు.

* ఈ ఒత్తిడితోనే దాదాపు 40 శాతం మంది ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేసి కొత్త ఉద్యోగ వేటలో పడ్డట్లు తెలిపారు.

* సర్వేలో పాల్గొన్న సగానికి పైగా మహిళలు రాబోయే రెండేళ్లలో తమ ఉద్యోగానికి రాజీనామా ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. వీరిలో కేవలం 9 శాతం మంది ఐదేళ్ల పాటు ప్రస్తుత సంస్థలోనే కొనసాగనున్నట్లు వెల్లడించారు.

* హైబ్రిడ్‌ పని వాతావరణంలో పనిచేస్తున్నప్పటికీ తమను ముఖ్యమైన సమావేశాలకు దూరంగా ఉంచుతున్నారని దాదాపు 60 శాతం మంది మహిళలు పేర్కొన్నారు.

* ఇక సమావేశాల్లో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో అంతరాయం కలిగించడం, పురుషాధిపత్యం ఉన్న కార్యకలాపాల్లోకి మహిళా ఉద్యోగుల్ని ఆహ్వానించకపోవడం, సాధారణ చర్చలకు దూరంగా ఉంచడం.. వంటివి భారత్‌లో పనిచేస్తోన్న ఉద్యోగినులకు ప్రతిబంధకాలుగా మారుతున్నాయని సర్వే తేల్చింది. ఇలాంటి ఫిర్యాదులు 24 శాతం వరకే యాజమాన్యాల దృష్టికి వెళ్లాయని  తెలిపింది.

* 87 శాతం మంది మానసిక ఆరోగ్యానికి సంబంధించిన మద్దతును యాజమాన్యం నుంచి పొందామని, పని ప్రదేశంలో మానసిక ఆరోగ్యం గురించి సౌకర్యవంతంగా మాట్లాడగలిగామని పేర్కొన్నారు.

* లింగ సమానత్వం కోసం పాటుపడుతోన్న మహిళా ఉద్యోగుల్లో ఎక్కువ శాతం సానుకూల అనుభవాలను పొందినట్లు, కేవలం 3 శాతం మంది విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు నివేదిక తెలిపింది.


ఒక్కొక్కరిలో ఒక్కోలా..!

సర్వే ముఖ్యాంశాల్ని బట్టి చూస్తే ఎక్కువమంది ఉద్యోగినులు పని ప్రదేశంలో విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు స్పష్టమవుతోంది. అయితే ఈ దీర్ఘకాలిక ఒత్తిడికి గల కారణాలు ఉద్యోగులందరిలో ఒకేలా ఉండచ్చు.. ఉండకపోవచ్చంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో..

* ఆఫీస్‌ పని అన్నివేళలా మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు.. అలాగే రోజురోజుకీ పనులు, బాధ్యతలు పెరుగుతుంటాయి. ఈ క్రమంలో రోజువారీ పనులు పూర్తి చేయడానికి తగిన ప్రణాళిక వేసుకోలేకపోవడం, సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గిపోయినప్పుడు పని భారమవుతుంది. ఇది క్రమంగా దీర్ఘకాలిక ఒత్తిడికి దారి తీస్తుంది.

* మీరు నిర్దేశించుకున్న లక్ష్యం/పనిని పూర్తి చేస్తామో లేదో అన్న సందిగ్ధం నెలకొన్నప్పుడు పనిపై ఏకాగ్రత క్రమంగా సన్నగిల్లుతుంది. వర్క్‌ప్లేస్‌ బర్నవుట్‌కి ఇదీ ఓ కారణమే!

* ఉద్యోగుల మధ్య, ఉద్యోగులు-పై అధికారుల మధ్య పని విషయంలో పరస్పర అవగాహన ఉన్నప్పుడు ఎలాంటి ఆటంకం లేకుండా పనులు పూర్తవుతాయి. అదే తమ నుంచి తమ బాస్‌/పైఅధికారులు ఎలాంటి పనితనాన్ని ఆశిస్తున్నారో సంపూర్ణ అవగాహన కొరవడినప్పుడు మాత్రం పనిప్రదేశంలో దీర్ఘకాలిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సిందేనట!

* పనిలో పోటీతత్వం మంచిదే కానీ.. ఈ క్రమంలో సహోద్యోగుల మధ్య తలెత్తే ఈర్ష్యాద్వేషాలు పని వాతావరణాన్నే దెబ్బతీస్తాయి.. దీంతో ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకోవడం, మన గురించి బాస్‌కు నెగెటివ్‌గా చెప్పడం.. వంటివి జరుగుతాయి. ఇలాంటివి భరించలేక ఒక్కోసారి విపరీతమైన ఒత్తిడికి లోనై ఆ కోపాన్ని ఇతరులపై చూపించే ప్రమాదం ఉంది.

* ఇటు ఇంటి పనిని, అటు ఆఫీస్‌ పనుల్ని సమన్వయం చేసుకోలేక చాలామంది మహిళలు ఒత్తిడికి గురవుతుంటారు. తమ శక్తినంతా ఈ పనులకే వెచ్చించి తమకంటూ ప్రత్యేకంగా సమయం కేటాయించుకోవడమే మర్చిపోతుంటారు. ఇదీ పని ప్రదేశంలో దీర్ఘకాలిక ఒత్తిడికి దారి తీస్తుందట!

* అదనపు పని భారం కూడా వర్క్‌ప్లేస్‌ బర్నవుట్‌కు కారణమవుతుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో అత్యుత్సాహంతో తలకు మించిన పని భారాన్ని నెత్తిన వేసుకోవడం, అన్ని పనులు నేనే చేస్తానన్న అతివిశ్వాసం శారీరకంగా, మానసికంగా ఒత్తిడిని పెంచుతాయి. తద్వారా పనిలో నాణ్యత సైతం తగ్గిపోతుంది.


ఎలాంటి సమస్యలొస్తాయంటే..!

మనలో చాలామంది ఒత్తిడి, ఆందోళనల్ని చాలా తేలిగ్గా తీసుకుంటుంటారు. నిజానికి ఇవి శారీరకంగా, మానసికంగానే కాదు.. కెరీర్‌ పైనా నెగెటివ్‌ ప్రభావం చూపుతాయంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో..

* అధిక ఒత్తిడి కారణంగా విపరీతమైన అలసట, బీపీ, శ్వాస సంబంధిత సమస్యలు, గుండె సమస్యలు, టైప్‌-2 మధుమేహం.. వంటి అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉంటుంది. ఇంకొంతమందిలో అయితే ఇది ప్రాణాంతకం కూడా కావచ్చు.

* ఒత్తిడి మితిమీరితే డిప్రెషన్‌, కోపం, యాంగ్జైటీ, మనపై మనకే అసహ్యం కలగడం.. వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒక్కోసారి వీటి నుంచి బయటపడడానికి మందులు వాడడం, ఆస్పత్రిలో చేరాల్సిన అవసరమూ ఏర్పడచ్చు.

* ఈ మానసిక సమస్య మనల్ని ఒంటరిగా ఉండేందుకు ప్రేరేపిస్తుంది. నెరవేర్చాల్సిన బాధ్యతల నుంచి దూరం జరగడం, డబ్బు ఖర్చు పెట్టే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం.. వంటి దురలవాట్లను క్రమంగా దగ్గర చేస్తుంది.

* ఇక ఇలాంటి ఒత్తిడితో సరిగ్గా పనిచేయలేం.. ఒకవేళ చేసినా ఆ పనిలో అస్సలు సంతృప్తి ఉండదు. ఎప్పుడెప్పుడు ఆ కంపెనీలో నుంచి బయటపడదామా? సహోద్యోగుల నుంచి దూరమవుదామా? అన్న ఆలోచనలోనే ఉండిపోతారు. ఒక రకంగా ఇది మన కెరీర్‌ని దెబ్బతీసినట్లే!


ఇలా బయటపడచ్చు!

పని ప్రదేశంలో ఎదురయ్యే ఇలాంటి దీర్ఘకాలిక ఒత్తిడి నుంచి బయటపడాలంటే ఉద్యోగులు కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించాలంటున్నారు నిపుణులు.

* కెరీర్‌లో దూసుకుపోవాలంటే మనలోని నైపుణ్యాలు, సామర్థ్యమే మనకు బలం. అందుకే వాటిపై నమ్మకముంచాలి. ఈ క్రమంలో మనలో ఆత్మవిశ్వాసం పెరిగి ఒత్తిడి దరి చేరకుండా జాగ్రత్తపడచ్చు.

* మీరు చేస్తోన్న ఉద్యోగంలో మీకు సంతృప్తి ఉందా? లేదా? అన్న విషయం గ్రహించడమూ ముఖ్యమే! ఒకవేళ మీ లక్ష్యం అది కాదు అనుకుంటే.. మీ అంతిమ లక్ష్యమేదో దానిపై దృష్టి సారించాలి.. ఈ దిశగా ఎలాంటి సవాళ్లైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి.

* ఎంత బిజీగా ఉన్నా ఎవరికి వారు కాస్త సమయం కేటాయించుకోవాలి. అప్పుడే ఎలాంటి ఒత్తిడినైనా అధిగమించి నాణ్యమైన ఉత్పాదకతను సంస్థకు అందించచ్చు.

* కొంతమంది దినదిన గండంగా వర్క్‌లోకి వెళ్తుంటారు. బాస్‌ ఎప్పుడు ఏ పని చెబుతారో, దాన్ని నేను చేయగలుగుతానో లేదోనని భయపడుతుంటారు. అలాంటి వారికి క్షణక్షణం నరకమే అని చెప్పచ్చు. మరి, ఈ పరిస్థితిని అధిగమించాలంటే పనిని బట్టి ఎవరికి వారు తమలోని నైపుణ్యాల్ని మెరుగుపరచుకోవాల్సి ఉంటుంది.

* పని ప్రదేశంలో ఒత్తిడిని అధిగమించాలంటే మనం తీసుకునే ఆహారమూ కీలకమే! ఈ క్రమంలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే అవిసె గింజలు, వాల్‌నట్స్‌, చేపలు.. వంటివి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆమ్లాలు సహజసిద్ధంగా ఒత్తిడిని తగ్గించడంలో సహకరిస్తాయి.. తద్వారా మనసూ ప్రశాంతంగా ఉంటుంది. పనిపై మరింత ఏకాగ్రత పెట్టగలుగుతాం.

* రాత్రి పడుకునే ముందు కాఫీ తాగకపోవడం, స్మార్ట్‌ ఫోన్లకు దూరంగా ఉండడం, రిలాక్సవడం.. వంటి చిన్న చిన్న చిట్కాలు మనల్ని సుఖ నిద్రకు ప్రేరేపించి ఒత్తిడిని దూరం చేస్తాయని ‘నేషనల్‌ స్లీప్‌ ఫౌండేషన్‌’ చెబుతోంది. తద్వారా మరునాడు ఉదయం ఉత్సాహంగా పనిని మొదలుపెట్టచ్చంటోంది.

* రోజువారీ మనం చేసే వ్యాయామాలు కూడా ఒత్తిడి, ఆందోళనల నుంచి మనల్ని దూరంగా ఉంచుతాయి. కాబట్టి కసరత్తులు చేసే సమయం లేకపోయినా ఉదయాన్నే కాసేపు ఆరుబయట అలా నడిచినా చాలంటున్నారు నిపుణులు.


సంస్థలూ చొరవ చూపాలి!

పని ప్రదేశంలో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించడానికి ఉద్యోగులు తమ జీవనశైలిలో పలు మార్పులు చేర్పులు చేసుకోవడంతో పాటు సంస్థలూ ఈ విషయంలో చొరవ చూపాలని చెబుతున్నారు నిపుణులు. ఇందులో భాగంగా..

* ఉద్యోగులు తమలోని ఒత్తిడిని స్వయంగా గుర్తించేందుకు వీలుగా ఈ అంశంపై అవగాహన కార్యక్రమాలు, నిపుణులతో ప్రత్యేక సెషన్స్‌ ఏర్పాటు చేసి వారికి వివరించాలి.

* ఆయా సంస్థల్లో ఉండే నాయకత్వ పద్ధతులు, నియమనిబంధనల గురించి వారికి ముందే వివరించి.. ఈ దిశగా వారిని ప్రిపేర్‌ చేస్తే ముందు ముందు వారు ఒత్తిడిని ఎదుర్కోకుండా, దాని ప్రభావం పనిపై పడకుండా చూడచ్చు.

* ఉద్యోగుల మధ్య సత్సంబంధాలు నెలకొనేందుకు, స్నేహపూర్వక పని వాతావరణాన్ని సృష్టించేందుకు నెలకోసారి లేదంటే రెండుసార్లు వారికి పని నుంచి కాస్త విరామమిచ్చి.. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలి. తద్వారా వారు మరింత ఉత్సాహంగా పని చేయగలుగుతారు.. అలాగే ఎల్లవేళలా సంస్థ తమ వెంటే ఉందన్న భరోసా వారికి ఉంటుంది.

ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ ఒత్తిడిని ఎదుర్కోలేకపోయినా.. ఈ సమస్య మరింత ఎక్కువవుతోన్నా వెంటనే మానసిక నిపుణులను సంప్రదించి తగిన సహాయం తీసుకోవచ్చు.. కౌన్సెలింగ్‌కు వెళ్లచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్