నిన్న ఆకాంక్ష.. నేడు శివానీ..!

‘ఆడవాళ్లు ఆ పనులు చేయలేరు... వారికంతటి ధైర్యం, శక్తి సామర్థ్యాలు ఉండవు’... బొగ్గు గనులు, మైనింగ్‌ తవ్వకాల్లో మహిళల ప్రాతినిథ్యంపై చాలామంది అభిప్రాయాలివి. అయితే ఇప్పుడు అదంతా గతం. శారీరక శ్రమతో కూడిన ఇలాంటి పనుల్లో పాలుపంచుకోవడానికి ‘మేము సైతం’ అంటూ ముందుకొస్తున్నారు మహిళలు.

Published : 12 Sep 2021 12:32 IST

(Photo: Twitter)

‘ఆడవాళ్లు ఆ పనులు చేయలేరు... వారికంతటి ధైర్యం, శక్తి సామర్థ్యాలు ఉండవు’... బొగ్గు గనులు, మైనింగ్‌ తవ్వకాల్లో మహిళల ప్రాతినిథ్యంపై చాలామంది అభిప్రాయాలివి. అయితే ఇప్పుడు అదంతా గతం. శారీరక శ్రమతో కూడిన ఇలాంటి పనుల్లో పాలుపంచుకోవడానికి ‘మేము సైతం’ అంటూ ముందుకొస్తున్నారు మహిళలు.

మొదటి మహిళగా..!

ఇటీవల ఝార్ఖండ్‌కు చెందిన ఆకాంక్ష కుమారి కోల్‌ ఇండియాలో అండర్‌ మైనింగ్‌ ఇంజినీర్‌గా బాధ్యతలు స్వీకరించి...ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. తాజాగా రాజస్థాన్‌కు చెందిన శివానీ మీనా కూడా ఆమె అడుగుజాడల్లో నడిచింది. జోధ్‌పూర్ ఐఐటీలో ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన ఈ అమ్మాయి తాజాగా కోల్‌ ఇండియాలో క్వారీ ఇంజినీర్‌గా ఎంపికైంది. తద్వారా నాలుగున్నర దశాబ్దాల సీఐఎల్‌ ప్రస్థానంలో ఓపెన్‌ కాస్ట్‌ మైన్స్ (Excavation)లో విధులు నిర్వర్తించనున్న మొదటి భారతీయ మహిళా ఇంజినీర్‌గా శివానీ చరిత్ర సృష్టించింది.

ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో భాగంగా!

ఝార్ఖండ్‌ రాష్ట్రంలోని ప్రముఖ పర్యటక ప్రాంతాల్లో రాజ్రప్ప కూడా ఒకటి. ‘స్వచ్ఛతా మిషన్‌’లో భాగంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా ప్రశంసించింది. ప్రస్తుతం ఇక్కడే ఉన్న సీసీఎల్‌(సెంట్రల్‌ కోల్‌ ఫీల్డ్స్‌ లిమిటెడ్‌) ఓపెన్‌ కాస్ట్‌ గనిలోనే ఇంజినీర్‌గా విధులు నిర్వర్తించనుంది శివానీ. సీఐఎల్‌ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టుల్లో ఇది కూడా ఒకటి. ఇందులో భాగంగా అక్కడి హెవీ ఎర్త్‌ మూవింగ్‌ మెషినరీ (HEMM) నిర్వహణ, మరమ్మతులను చూసుకోనుంది శివానీ.

అమ్మానాన్నల చలవే!

రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు చెందిన శివానీ చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండేది. జోధ్‌పూర్‌ ఐఐటీ నుంచి ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన తర్వాత ఆమెకు పలు ఉద్యోగావకాశాలు వచ్చాయి. అయితే వాటన్నింటినీ కాదనుకుని కోల్‌ ఇండియాలో చేరింది.

‘సీఐఎల్ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థలో ఇంజినీర్‌గా చేరినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నేను ఇక్కడకు వచ్చానంటే అది అమ్మానాన్నల చలవే. వారి ప్రోత్సాహం, సహకారమే నన్ను ముందుకు నడిపిస్తున్నాయి. ఇక నా శక్తి సామర్థ్యాలపై నమ్మకముంచి నన్ను ఎంపిక చేసిన కోల్‌ ఇండియా యాజమాన్యానికి కృతజ్ఞతలు. సంస్థను అభివృద్ధి చేసేందుకు నా శాయశక్తులా ప్రయత్నిస్తాను’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది శివానీ.

‘నారీశక్తి’కి ఇది నిదర్శనం!

‘మొన్నటివరకు భూగర్భ గనుల్లో విధులంటే మగవారే గుర్తొచ్చేవారు. అయితే ఆకాంక్ష, మీనా ఆ అభిప్రాయాలను తుడిచిపెట్టేశారు. వీరిని చూసి మరికొందరు అమ్మాయిలు ఇలాంటి విధులు నిర్వర్తించేందుకు ముందుకొస్తారు. అప్పుడే మహిళా సాధికారత, లింగ సమానత్వం అనే పదాలకు సరైన సార్థకత లభిస్తుంది. ఇక మా సంస్థలోని మహిళా ఉద్యోగులు ఎంతో అంకితభావంతో పనిచేస్తున్నారు. తమ శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటూ ఉన్నత పదవులను కూడా అలంకరిస్తున్నారు. శివానీ కూడా ఇదే దారిలో నడవాలని కోరుకుంటున్నా’ అని సీసీఎల్ సీఎండీ శివానీకి అభినందనలు తెలిపారు. ఇక కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఈ మహిళా ఇంజినీర్‌పై ప్రశంసలు కురిపించారు. ‘శివానీ ఎంపిక నారీశక్తికి నిదర్శనమంటూ’ సోషల్‌ మీడియాలో ట్వీట్లు పెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్