Harnaaz Sandhu: ఆడవాళ్ల బరువు విషయంలో మీకెందుకంత ఆసక్తి?!

‘బరువు పెరిగితే బొద్దుగా ఉన్నావంటారు.. తగ్గితే పీలగా ఉన్నావని ఏడిపిస్తుంటారు.. ఇలా పైపైన జరిగే మార్పులే చూస్తారు తప్ప.. దీని వెనక ఏదైనా బలమైన కారణం ఉండచ్చేమో?!

Updated : 09 Aug 2022 18:58 IST

‘బరువు పెరిగితే బొద్దుగా ఉన్నావంటారు.. తగ్గితే పీలగా ఉన్నావని ఏడిపిస్తుంటారు.. ఇలా పైపైన జరిగే మార్పులే చూస్తారు తప్ప.. దీని వెనక ఏదైనా బలమైన కారణం ఉండచ్చేమో?! అన్న ఆలోచన ఏ ఒక్కరూ చేయరు..’ అంటోంది విశ్వ సుందరి హర్నాజ్‌ సంధు. అవతలి వాళ్లు బాధపడతారేమోనన్న కనీస ఆలోచన లేకుండా అంత సులభంగా ఎలా విమర్శిస్తారని ఈ సమాజాన్ని ప్రశ్నిస్తోంది. సుమారు 21 ఏళ్ల తర్వాత గతేడాది డిసెంబర్‌లో భారత్‌కు ‘మిస్‌ యూనివర్స్‌’ కిరీటం సాధించి పెట్టిన ఈ హరియాణా భామ.. ఆపై తక్కువ వ్యవధిలోనే బరువు పెరిగిపోయింది. దీంతో అందరూ ఆమెను విమర్శించడం ప్రారంభించారు. అయితే ఈ మాటలు తనను చాలా బాధపెట్టాయని, తాను ఉన్నట్లుండి బరువు పెరగడానికి తనకున్న ఓ ఆరోగ్య సమస్యే కారణమంటూ ఇటీవలే ఓ సందర్భంలో పంచుకుందామె.

లారాదత్తా (2000) తర్వాత సుమారు 21 ఏళ్ల భారతీయుల నిరీక్షణకు గతేడాది డిసెంబర్‌లో తెరదించింది హరియాణా బ్యూటీ హర్నాజ్‌ సంధు. ‘విశ్వ సుందరి’గా అవతరించి సరికొత్త చరిత్రను లిఖించింది. అయితే ఈ ఈవెంట్‌ తర్వాత కొన్నాళ్లు న్యూయార్క్‌లోనే గడిపిన ఆమె.. మొన్నా మధ్య స్వదేశానికి వచ్చింది. ఓ ఫ్యాషన్‌ షో పరేడ్‌లో పాల్గొంది. అప్పుడంతా ఆమెను చూసి ముక్కున వేలేసుకున్నారు. ‘హర్నాజ్‌ ఏంటి.. ఇంత లావైంది?’ అంటూ ఆశ్చర్యపోయారు. అయితే తనకున్న ఓ రకమైన ఆరోగ్య సమస్య (Celiac Disease)’ వల్లే తానింత బరువు పెరిగానంటూ అప్పట్లో ఓ సందర్భంలో చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ.

అవి గుర్తొచ్చి ఏడ్చేసేదాన్ని!

హర్నాజ్‌ తన అనారోగ్యం గురించి నోరు విప్పినా.. ఆమెపై విమర్శలు మాత్రం ఆగలేదు. కొందరు పనిగట్టుకొని మరీ సోషల్‌ మీడియా వేదికగా దీని గురించి పదే పదే స్పందించడం.. ట్రోల్‌ చేయడం మొదలుపెట్టారు. ఎక్కడున్నా వాళ్ల మాటలు గుర్తొచ్చి ఏడ్చేసేదాన్నంటూ ఇటీవలే ఓ సందర్భంలో తన అనుభవాలను పంచుకుందీ బ్యూటీ.

‘శారీరకంగా నేను కొన్ని కిలోల బరువు పెరిగా.. అయినా ప్రస్తుతం సౌకర్యవంతంగానే ఉన్నా. కానీ దీనివల్ల సమాజం నుంచి పలు విమర్శల్నీ ఎదుర్కొన్నా. వాళ్ల మాటలు వింటుంటే ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే వాళ్లకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చి తమ అభిప్రాయాల్ని ఇలా సూటిగా ఎలా పంచుకోగలుగుతారని! చాలాసార్లు వాళ్ల మాటలు గుర్తొచ్చి ఏడ్చేసేదాన్ని. కొన్నిసార్లైతే స్టేజీ పైకి ఎక్కగానే అవన్నీ నా మదిలో మెదిలేవి.. అప్పుడు నా భావోద్వేగాల్ని అదుపు చేసుకోలేకపోయేదాన్ని. ఎంతసేపూ నేను బరువు పెరిగాననే తప్ప.. దాని వెనకున్న బలమైన కారణమేంటని ఎవరూ ఆలోచించలేకపోయారు. అవును.. నాకు Celiac Disease సమస్య ఉంది. అంటే.. నాకు గ్లూటెన్‌ ఉన్న ఆహార పదార్థాలు తింటే పడదు. దీనివల్లే గోధుమలు, బార్లీ, రై (గోధుమ జాతికి చెందిన ధాన్యం).. వంటి పదార్థాల్ని దూరం పెట్టా.

ఆ నెలరోజుల్లో..!

నిజానికి నాకు ఈ సమస్య ఉందని అందాల పోటీల కోసం న్యూయార్క్‌ వెళ్లాకే తెలిసింది. దీంతో పాటు సోయా, కోడిగుడ్లు, కొబ్బరి.. వంటి పదార్థాలు కూడా నాకు పడేవి కావు. అయినా ఈ ప్రతికూలతలన్నీ పక్కన పెట్టి పోటీల పైనే దృష్టి పెట్టా. వ్యాయామాలు, ఇతర యాక్టివిటీలు సాధన చేస్తూ బరువు అదుపు చేసుకున్నా. ఇక కిరీటం గెలిచాక సుమారు నెల పాటు విశ్రాంతి తీసుకోవడానికే మొగ్గు చూపాను. ఈ క్రమంలో వర్కవుట్స్‌ని పూర్తిగా పక్కన పెట్టాను. నచ్చిన ఆహారం తినడం, కుటుంబంతో సమయం గడపడం.. వీటికే ప్రాధాన్యమిచ్చా. అయితే ఇది పరోక్షంగా నా శరీరంపై ప్రభావం చూపుతుందని అప్పుడు నేను గ్రహించలేకపోయా. ఏదైతేనేం.. ఇప్పుడు నేను ఎలాంటి విమర్శల్నీ పట్టించుకోవట్లేదు. నన్ను నేను ప్రేమించుకోవడం, మార్పుల్ని అంగీకరించడం మొదలుపెట్టా. మనలో ఎవరూ పర్‌ఫెక్ట్‌ కాదు.. ఈ విషయం గుర్తెరిగి, మనలోని లోపాల్ని ప్రత్యేకతలుగా భావించినప్పుడే మనం అనుకున్నది సాధించగలుగుతాం..’ అంటూ తన మాటలతో ఎంతోమందిలో స్ఫూర్తి నింపింది హర్నాజ్‌.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని