5 వేల పెట్టుబడి.. 15 కోట్ల టర్నోవర్!

ఒక్కొక్కరికీ ఒక్కో ఫ్యాషన్‌ నప్పుతుంది.. నచ్చుతుంది. కొంతమంది సంప్రదాయ దుస్తులు ఇష్టపడితే.. మరికొందరు మోడ్రన్‌ దుస్తులు వేసుకోవాలనుకుంటారు. ఇంకొందరు అందరిలోనూ తమ దుస్తులు ప్రత్యేకంగా ఉండాలనుకుంటారు. ఇలా ప్రతి ఒక్కరి ఫ్యాషన్‌ అవసరాల్ని తాము తీర్చుతామంటోంది రాజస్థాన్‌ బిల్వారాకు చెందిన పూజా ఛౌదరి. తన తండ్రి కోరిక మేరకు సివిల్స్‌....

Published : 21 Mar 2022 18:08 IST

(Photo: LinkedIn)

ఒక్కొక్కరికీ ఒక్కో ఫ్యాషన్‌ నప్పుతుంది.. నచ్చుతుంది. కొంతమంది సంప్రదాయ దుస్తులు ఇష్టపడితే.. మరికొందరు మోడ్రన్‌ దుస్తులు వేసుకోవాలనుకుంటారు. ఇంకొందరు అందరిలోనూ తమ దుస్తులు ప్రత్యేకంగా ఉండాలనుకుంటారు. ఇలా ప్రతి ఒక్కరి ఫ్యాషన్‌ అవసరాల్ని తాము తీర్చుతామంటోంది రాజస్థాన్‌ బిల్వారాకు చెందిన పూజా ఛౌదరి. తన తండ్రి కోరిక మేరకు సివిల్స్‌ చదవడానికి సిద్ధమైన ఆమె.. తన అంతిమ లక్ష్యం అది కాదని తెలుసుకుంది. ఫ్యాషన్‌పై మక్కువతో సొంత లేబుల్‌ని ప్రారంభించి.. రంగుల దగ్గర్నుంచి డిజైన్ల దాకా ఈ కాలపు అమ్మాయిల కోరిక మేరకు దుస్తులు రూపొందిస్తోంది. ఏడాదికి సుమారు రూ.15 కోట్ల టర్నోవర్కు చేరుకుంది. మనసు మాట వింటే, వెనకడుగు వేయకుండా కష్టపడితే.. ఎంతటి కఠిన లక్ష్యాన్నైనా చేరుకోవచ్చంటోన్న ఈ యువ ఫ్యాషనర్‌ సక్సెస్‌ఫుల్‌ జర్నీ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం!

రాజస్థాన్‌లోని బిల్వారాలో పుట్టి పెరిగింది పూజా ఛౌదరి. లక్ష్మణ్‌ఘర్‌ పట్టణంలోని ఓ కాలేజీలో బీబీఏ పూర్తి చేసిన ఆమె.. పైచదువుల కోసం ఫ్రాన్స్‌ వెళ్లింది. అక్కడే ఎంబీఏ ఫైనాన్స్‌ చదివింది. ఆ తర్వాత ఇండియాకు తిరిగొచ్చి తన తండ్రి వ్యాపారంలో చేదోడువాదోడుగా ఉండడం ప్రారంభించింది.

సివిల్స్‌కి సన్నద్ధమవ్వమంటే..!

అయితే పూజను సివిల్‌ సర్వీసెస్‌ అధికారిగా చూడాలనేది ఆమె తండ్రి కల. కానీ తనకేమో ఫ్యాషన్‌ రంగంపై మక్కువ ఎక్కువ! అయినా తన తండ్రిని నిరుత్సాహపరచడం ఇష్టం లేని ఆమె.. యూపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమవ్వడానికి జైపూర్‌ వెళ్లింది. అక్కడే తన ఫ్యాషన్‌ కలకు బీజం పడిందంటోంది పూజ.

‘నాన్న ఇష్ట ప్రకారం సివిల్స్‌ చదవడానికి జైపూర్‌ అయితే వెళ్లా.. కానీ నా మనసంతా ఫ్యాషన్‌, దుస్తుల పైనే ఉంది. నాకు చిన్నతనం నుంచి కొత్త కొత్త దుస్తులు వేసుకోవాలన్న ఆరాటం ఉండేది. ఈ క్రమంలోనే సివిల్స్‌ నా అంతిమ లక్ష్యం కాదని గ్రహించా. అలాగని పెళ్లయ్యాక కేవలం గృహిణిగానే ఉండిపోవాలని లేదు. ఇదే విషయాన్ని స్పష్టంగా నాన్నతో చెప్పా. తనూ నా మనసును అర్థం చేసుకున్నాడు. ఫ్యాషన్‌పై నాకున్న ఇష్టాన్ని గ్రహించి నన్ను ఈ దిశగా ప్రోత్సహించాడు’ అని చెప్పుకొచ్చిందామె.

ఐదు వేలు పెట్టుబడిగా..!

మనం చేసే పనిపై ఇష్టం ఉంటే.. ఎంత కష్టమైనా అందులో విజయం సాధించి తీరతాం.. ఇందుకు పూజే ప్రత్యక్ష ఉదాహరణ. ‘నిజానికి దుస్తులకు సంబంధించిన వ్యాపార మెలకువలు నాకు తెలియదు.. పైగా నా చదువుకు, ఈ రంగానికి ఎలాంటి సంబంధం లేదు. కేవలం ఒక అభిరుచిగానే నా వద్ద ఉన్న రూ. 5 వేల పాకెట్‌ మనీతో 2018లో ‘లావణ్య – ది లేబుల్‌’ అనే ఆన్‌లైన్‌ స్టోర్‌ని ప్రారంభించా. ఫ్యాషన్‌ డిజైనింగ్‌, ఇప్పుడొస్తున్న ట్రెండ్స్‌ గురించి తెలుసుకోవడానికి ఇంటర్నెట్‌ని ఆశ్రయించా. ఇలా ఇందులో నైపుణ్యాల్ని పెంచుకున్న నేను.. స్థానికంగా క్లాత్ కొనుగోలు చేసి.. నిపుణులతో విభిన్న దుస్తులు కుట్టించి నా స్టోర్లో వినియోగదారులకు అందుబాటులో ఉంచేదాన్ని. సంప్రదాయ, మోడ్రన్‌, ఇండో-వెస్ట్రన్‌ స్టైల్స్‌.. ఇలా నేటి అమ్మాయిల అభిరుచులకు తగినట్లుగా రూపొందించిన ప్రతి ఫ్యాషన్‌ మా వద్ద లభిస్తోంది. అలాగే ఎక్కువగా ట్రెండింగ్‌లో ఉన్న రంగులు, ప్రింట్ల విషయంలోనూ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతున్నాం..’ అంటోంది పూజ. ఇలా ప్రత్యేక సందర్భాల్లో ధరించే దుస్తులతో పాటు నైట్‌వేర్‌, ఫుట్‌వేర్‌.. వంటివీ తమ వద్ద అందుబాటులో ఉన్నాయంటోందీ ఫ్యాషనర్.

మేటి బ్రాండ్లతో మమేకమై..!

ఈ క్రమంలో బిల్వారాలో ఓ కంపెనీని ప్రారంభించిన పూజ.. తన సంస్థ ద్వారా నేటి అమ్మాయిల ఫ్యాషన్‌ అవసరాలు తీర్చడమే కాదు.. ఎంతోమంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. మరోవైపు Myntra, Nykaa.. వంటి ప్రముఖ ఫ్యాషన్‌ బ్రాండ్‌లతోనూ కలిసి పనిచేస్తోంది. అలాగే కొంతమంది సెలబ్రిటీలకూ ఆయా సందర్భాలకు తగినట్లుగా దుస్తులు రూపొందిస్తోంది కూడా! వినియోగదారులకు నచ్చిన దుస్తుల్నీ డోర్‌ డెలివరీ చేస్తోంది. ఇలా ఇంతింతై అన్నట్లుగా తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసింది పూజ.. ఇప్పుడు ఏడాదికి రూ.15 కోట్ల టర్నోవర్కు చేరుకుంది.  ‘వ్యాపారమంటేనే సవాలుతో కూడుకున్నది. ఒక్కోసారి నష్టాలు రావచ్చు.. ఉత్పత్తి సరైన సమయంలో వినియోగదారులకు చేరకపోవచ్చు.. ఎంత కష్టపడినా.. ఇలాంటి లోపాలు మానసికంగా ఒత్తిడిని కలిగిస్తుంటాయి. ఇలాంటప్పుడే సంయమనం పాటించి పట్టుదలతో ముందుకు సాగాలి. అవసరమైతే కుటుంబ సభ్యుల, నిపుణుల సహకారం తీసుకోండి.. కానీ లక్ష్యాన్ని మాత్రం వీడకండి.. స్వీయ నమ్మకమే మన విజయానికి పునాది వేస్తుంది..’ అంటూ తన మాటలతోనూ ఔత్సాహిక వ్యాపారవేత్తల్లో స్ఫూర్తి నింపుతోంది పూజ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్