నిరుపేదల చిరునవ్వు కోసమే ఈ తపన!

మన చుట్టూ బోలెడు సమస్యలు కనిపిస్తుంటాయి... చాలావరకూ చూసీ చూడనట్లు వదిలేస్తాం.  అప్పటికీ మనసు కదలిస్తే...ఓ పదోపరకో ఇచ్చి సంతృప్తి పడిపోతాం.  అవి మాత్రమే సరిపోవనుకుంది హైదరాబాద్‌ కి చెందిన అర్చన... 2013లో ‘బ్రింగ్‌ ఎ స్మైల్‌ ఫౌండేషన్‌’ను ప్రారంభించి... నిరుపేదల సమస్యలకు పరిష్కారాలు చూపిస్తోంది. ఉపాధి మార్గాలను అందిస్తోంది. విద్యార్థులకు విద్యను కానుకగా ఇస్తోంది. ఆమెతో వసుంధర ముచ్చటించింది. ఆ వివరాలే ఇవి.

Published : 02 Aug 2021 01:22 IST

మన చుట్టూ బోలెడు సమస్యలు కనిపిస్తుంటాయి... చాలావరకూ చూసీ చూడనట్లు వదిలేస్తాం.  అప్పటికీ మనసు కదలిస్తే...ఓ పదోపరకో ఇచ్చి సంతృప్తి పడిపోతాం.  అవి మాత్రమే సరిపోవనుకుంది హైదరాబాద్‌ కి చెందిన అర్చన... 2013లో ‘బ్రింగ్‌ ఎ స్మైల్‌ ఫౌండేషన్‌’ను ప్రారంభించి... నిరుపేదల సమస్యలకు పరిష్కారాలు చూపిస్తోంది. ఉపాధి మార్గాలను అందిస్తోంది. విద్యార్థులకు విద్యను కానుకగా ఇస్తోంది. ఆమెతో వసుంధర ముచ్చటించింది. ఆ వివరాలే ఇవి.

‘పంచడంలో ఉన్న ఆనందం తెలిస్తే...ప్రపంచాన్ని జయించినంత సంతోషం కలుగుతుంది’ అని తరచూ అనేది మా అమ్మ రేణు. బీరువాలో ఉన్న దుస్తులు చూపించి...‘ఇన్ని కొంటున్నావు. వాటిల్లో వాడనివి తీసి... అవసరమున్నవారికి ఇచ్చేయొచ్చు కదా’ అని పోరు పెట్టేది. అప్పుడు ఆ మాటల అర్థం, విలువ తెలుసుకోలేకపోయాను. తను 2013లో క్యాన్సర్‌ బారిన పడింది. తరచూ చికిత్స కోసం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌కి తీసుకెళ్లేదాన్ని. అలా ఎప్పుడు వెళ్లినా... ఫుట్‌పాత్‌ల మీద, సర్కిల్‌ లాండ్‌ స్కేప్‌ల పైన చాలామంది కూర్చోవడం గమనించా. రాత్రిళ్లు ఆ దారిలో వెళ్తున్నప్పుడు చూసినా అదే దృశ్యం. ఎముకలు కొరికే చలిలోనూ అంతమంది అక్కడే ఉండటం అలా కనిపించడం బాధనిపించింది. ఆ విషయాన్ని అమ్మతో చెబితే... ‘మా తరంలో... సామాజిక సేవ చేయాలని ఉన్నా...అందరినీ ఒకతాటిపైకి తేవడానికి ఇంటర్నెట్‌, సోషల్‌ మీడియా వంటివి లేవు. మీకు ఇప్పుడు ఆ అవకాశం ఉంది. వారికోసం నీకు ఏదైనా చేయాలనిపిస్తే అది చేయ్‌ అంది’. ఆ ఆలోచనల్లో ఉండగానే... అమ్మని కోల్పోయాను. ఆ బాధనుంచి చాలా రోజులు కోలుకోలేకపోయా. తర్వాత తన మాటల్ని స్ఫూర్తిగా తీసుకుని సేవ చేయాలనుకున్నా.

అందరి సాయంతో...

ఇందుకోసం ఓ ఎన్జీవో ఏర్పాటు చేయాలన్న నా ఆలోచనని మొదట మా వారు అశోక్‌తో చెప్పా. ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఆయన...ముందుకెళ్లమని వెన్ను తట్టారు. అయితే నేనొక్కదాన్నే కాదు...కలిసి వచ్చే అందరినీ ఇందులో భాగస్వాముల్ని చేయాలనుకున్నా.  ఇందుకోసం మా కమ్యూనిటీవాసులందరికీ ఓ సందేశం పంపించా. మీకు అవసరం లేని వస్తువులు, దుస్తులు,  మాకు ఇవ్వండి...మేం వాటిని అవసరమున్నవారికి అందిస్తాం అని. గంట అవ్వకుండా ఓ నలభై మంది ముందుకు వచ్చారు. వారందరినీ కలుపుకొని ‘బ్రింగ్‌ ఎ స్మైల్‌’ నెట్‌వర్క్‌ని ఏర్పాటు చేశా. మొదట్లో దశలవారీగా మా ఇంటి చుట్టుపక్కల మురికివాడల్లో పంచేవాళ్లం. 2017లో ట్రస్ట్‌గా రిజిస్టర్‌ అయ్యాక...పెద్ద ఎత్తున కార్యక్రమాలకు రూపకల్పన చేశా...

స్మైల్‌బాక్సుల ఏర్పాటు...

ప్రస్తుతం...వివిధ రూపాల్లో రోజూ సుమారు ఐదువేలమంది మా ద్వారా సాయం పొందుతున్నారు. వందలాదిమంది నిరుపేద, అనాథ చిన్నారులను చదివించే బాధ్యత తీసుకున్నాం.ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణాలు, అనాథాశ్రమాల్లో వసతులు ఏర్పాటు, నిత్యావసరాల పంపిణీ చేస్తున్నాం. ఆ మధ్య మియాపూర్‌లోని ఓ పాఠశాల విద్యార్థుల కోసం ఓ ఫార్మాసంస్థ సాయంతో...స్కూలు బస్సులు అందించాం. దివ్యాంగులకు వీల్‌ఛైర్లు ఇవ్వడంతోపాటు ఉపాధికి అవసరమైన వనరులు సమకూర్చాం. మరో సంస్థ సాయంతో...ఓ స్కూలు కోసం 75 ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు ఇచ్చాం. ఇవేకాదు వ్యక్తులు, వివిధ సంస్థల అవసరాలకు అనుగుణంగా మా సంస్థ విరాళాలు, వస్తువులు సేకరిస్తుంది. ఇందుకోసం వివిధ ప్రాంతాల్లోని వాణిజ్య సముదాయాల్లో స్మైల్‌బాక్సులు ఏర్పాటు చేశాం. అలా 2012 నుంచి 2020 వరకూ 50 టన్నులకు పైగా దుస్తులు, ఆటబొమ్మలు, నిత్యావసర సరకులను వివిధ వర్గాలకు అందించాం. వీటి విలువ సుమారు రూ.75 లక్షలకు పైనే ఉంటుంది కొవిడ్‌ బాధితులు, ఉపాధికోల్పోయిన నిరుపేద వర్గాల అవసరాల కోసం ఈ ఏడాది మొదటి నుంచి ఇప్పటివరకూ సుమారు 17 లక్షల రూపాయల్ని ఖర్చుపెట్టాం. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మారేడుమిల్లి గిరిజన ప్రాంతాల్లో లక్షలాది రూపాయల విలువైన నిత్యావసరాలు, ఇతరత్రా సామగ్రిని పంపిణీ చేశాం.

ప్రపంచవ్యాప్తంగా శాఖలు...

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 500 మంది మా సంస్థతో కలిసి పనిచేస్తున్నారు. హైదరాబాద్‌తోపాటు బెంగళూరులో, చెన్నై, దిల్లీ...ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, యూకే, దుబాయ్‌ వంటి దేశాల్లోనూ శాఖలు ఉన్నాయి. ప్రారంభంలో వీటికోసం నా సొంత డబ్బుల్ని వెచ్చించేదాన్ని. కానీ అవసరాలు పెరిగే కొద్దీ సన్నిహితులు, బంధువుల నుంచి నిధులు సేకరించేదాన్ని. అయితే తీసుకున్న ప్రతి రూపాయికీ జవాబుదారీగా ఉండేందుకు ఆ లెక్కల్ని ఎప్పటికప్పుడు మెయిళ్ల రూపంలో వారికి అందిస్తా. ఐటీ రిటర్న్‌ కూడా దాఖలు చేస్తాం. మా బృందంలో ప్రతిమ, అంకుర్‌, శిల్ప, రాజశ్రీ, వింధ్యాహరి, అమృత, అక్షయ్‌, కృష్ణ...వంటి సేవాదృక్పథం గలవారెందరో ఉన్నారు.


నా గురించి...

నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. అమ్మది పంజాబ్‌, నాన్నది కేరళ. వారిద్దరూ పెళ్లి చేసుకున్నాక హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. మావారు ఓ ఎంఎన్‌సీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. మాకో  పాప. తనకి పదేళ్లు. కుటుంబ సహకారంతోనే ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాల్ని గత తొమ్మిదేళ్లుగా చేయగలుగుతున్నా. ప్రస్తుతం పదిహేనేళ్లపాటు...పలు కార్పొరేట్‌, ఎంఎన్‌సీలో ఉన్నస్థాయిలో పనిచేశా. ఏ ఉద్యోగంలోనూ కలగని సంతృప్తి నాకు ఈ సేవాపథంలోనే కనిపించింది. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి సోషల్‌ ఇంపాక్ట్‌ గ్రూప్‌లో పనిచేస్తున్నాను.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్