ఏడేళ్లలో రెండు వందల సార్లు ఎముకలు విరిగాయి!

నూటికో... కోటికో ఒక్కరికి వచ్చే అరుదైన వ్యాధి అది... తనకే ఎందుకు వచ్చిందని తలరాతని నిందిస్తూ కూర్చోలేదామ్మాయి.. కాస్త గట్టిగా తాకినా విరిగిపోయే ఎముకల వ్యాధిపై తానే సవాల్‌

Updated : 27 Aug 2021 00:39 IST

నూటికో... కోటికో ఒక్కరికి వచ్చే అరుదైన వ్యాధి అది... తనకే ఎందుకు వచ్చిందని తలరాతని నిందిస్తూ కూర్చోలేదామ్మాయి.. కాస్త గట్టిగా తాకినా విరిగిపోయే ఎముకల వ్యాధిపై తానే సవాల్‌ విసిరింది... పట్టుదలకు ప్రతిరూపంగా నిలిచింది సాయిప్రజ్ఞ.. తిరుపతి ఐఐటీలో ఎంటెక్‌ చదువుతూ దేశంలో ఆ ఘనత సాధించిన తొలి యువతిగా గుర్తింపు పొందింది...

ఆస్టియో జెనిసిస్‌ ఇంపర్‌ఫెక్టా... ఓ జన్యువ్యాధి. ఇది ఉన్నవారిలో చీటికీమాటికీ ఎముకలు విరిగిపోతాయి. అలాంటి అరుదైన వ్యాధి సాయి ప్రజ్ఞకు ఉంది. అమ్మకడుపులోంచి భూమ్మీదకు వచ్చేటప్పుడే ఎముకలు విరిగిపోయి పుట్టింది సాయిప్రజ్ఞ. ఏడేళ్లు వచ్చేటప్పటికి 200 సార్లు విరిగాయి. అది మొదలు ఇంకెన్ని సార్లు ఎముకలు విరిగాయో... ఎన్ని చికిత్సలు చేయించారో అమ్మా నాన్నలు రమణారావు, జ్యోత్స్నలకే తెలుసు. ఈ సమస్యకు వైద్య పరిష్కారాలేమీ లేక, ఆమె దృష్టిని చదువుపై మళ్లించాలనుకున్నారు వాళ్లు. అప్పట్లో నెల్లూరులో ఉండే వాళ్లు. ప్రత్యేకంగా ఆమె కోసం కుర్చీ తయారు చేయించారు. ప్రాథమిక పాఠశాలకు పంపారు. ఆ ముచ్చటా ఎన్నో రోజులు లేదు. ప్రజ్ఞ తండ్రికి గుంటూరు బదిలీ కావడంతో ఆమె చదువుకు బ్రేక్‌ పడింది. ఇక్కడి స్కూళ్లు ఆరోతరగతిలో ఆమెని చేర్చుకోవడానికి నిరాకరించాయి. దాంతో ఆరు, ఏడు తరగతులు ఇంట్లోనే చదువుకుంది. తర్వాత బడికెళ్లి 10వ తరగతిలో 9.2 గ్రేడు సాధించింది. ఇంటర్‌లో 97.2 శాతం సాధించింది. ఇంజినీరింగ్‌ (సీఎస్‌ఈ) పూర్తి చేసింది. ఆ వెంటనే నాలుగు పెద్ద కార్పొరేట్‌ సంస్థలు ఏడాదికి రూ.నాలుగున్నర నుంచి రూ.పది లక్షల వరకూ వేతనం ఇవ్వడానికి ముందుకొచ్చాయి. కానీ ఐఐటీలో ఎంటెక్‌ చేయాలన్నది ప్రజ్ఞ కల. పట్టుదలగా గేట్‌ రాసి సీటు సాధించింది. తండ్రి ఉద్యోగరీత్యా తిరుపతి ఐఐటీ అయితే అనుకూలమన్న ఉద్దేశంతో అక్కడే ప్రవేశం తీసుకుంది. ఇప్పుడు ఎంటెక్‌ మొదటి ఏడాది చదువుతోంది. అరుదైన జన్యువ్యాధితో ఎంటెక్‌ చదువుతున్న తొలి యువతిగా గుర్తింపు సాధించింది.

ఆటంకాలను అధిగమిస్తూ... ఈ ప్రయాణం అంత తేలిగ్గా సాగలేదామెకు. చాలా సందర్భాల్లో పరీక్ష కేంద్రాలు పై అంతస్థులో ఉండేవి. అక్కడికి చక్రాల కుర్చీలో వెళ్లలేక ఇబ్బందులు పడింది. కనీసం లిఫ్ట్‌ అయినా ఉంటే తనలాంటి వారికి సౌకర్యంగా ఉంటుంది అని అధికారులతో అంటే ‘ఇప్పుడు పరీక్షలు రాసి ఏం సాధిస్తుందట’ అని ఎద్దేవా చేసే వాళ్లు కొందరు. మరికొందరేమో ‘ఎందుకండీ ఇంత యాతన’ అనే వాళ్లు. ఇవన్నీ తన పట్టుదలని రెట్టింపు చేశాయి. ఇంటర్‌ పరీక్షల కోసం తండ్రి సాయంతో రాష్ట్ర స్థాయి అధికారులను కలిసి కింది గదిలో పరీక్ష రాసే అవకాశాన్ని సాధించుకుని... మంచి మార్కులతో ఉత్తీర్ణురాలైంది. పరీక్షల్లో దివ్యాంగులకు ఇచ్చే అదనపు సమయాన్ని కూడా ఉపయోగించుకోకపోవడం తన ఆత్మస్థైర్యానికి నిదర్శనం. ఇంజినీరింగ్‌లో తన కోసం తరగతులు కింది గదిలో నిర్వహించడం, తర్వాత లిఫ్ట్‌ ఏర్పాటుతో ఆ కోర్సును సజావుగా పూర్తి చేసింది. ‘ఆస్టియో జెనిసిస్‌ ఇంపర్‌ఫెక్టా బాధితులం వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో మూడేళ్ల నుంచి 40 ఏళ్ల వయసు వరకూ సభ్యులున్నారు. సలహాలు, సూచనలు, విద్యకు సంబంధించిన అంశాలు, సమస్యలపై చర్చించుకుంటాం, ధైర్యం చెప్పుకుంటాం, ప్రోత్సహించుకుంటాం. పదో తరగతిలో పాఠంలో ఉండే ‘నిక్‌’ నాకు స్ఫూర్తి. పుట్టుకతోనే అతనికి కాళ్లు, చేతులూ లేవు. అయినా ఆత్మవిశ్వాసంతో స్విమ్మింగ్‌, టైపింగ్‌, అన్ని ఆటలు ఆడటంతోపాటు ప్రపంచ ప్రఖ్యాత మెంటర్‌గా ఎదిగాడు. అతని స్ఫూర్తితోనే ఎంటెక్‌ చేసి రక్షణ, పరిశోధన రంగంలో దేశానికి ఉపయోగపడే పరిశోధనల్లో భాగస్వామిని కావాలన్నది నా లక్ష్యం. దాన్ని సాధిస్తా’ అని ఆత్మవిశ్వాసంతో చెబుతోంది ప్రజ్ఞ.

- పెనికలపాటి రమేశ్‌, గుంటూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్