వేల జాలర్ల జీవితాల్లో వెలుగులు నింపుతూ...

చిన్నప్పుడు సముద్రంలో వేటకెళ్లిన తండ్రి కోసం భయంగా ఎదురుచూసిన జ్ఞాపకాలు ఆమెని మెరైన్‌ బయాలజిస్టుని చేసింది. చేపల వేటలో జాలర్లకి ఎదురయ్యే ప్రమాదాలను దూరం చేయడానికి  సాంకేతికతను దరిచేర్చి.. ఇప్పటివరకు దాదాపు 20వేల మంది మత్య్సకారులకు శిక్షణనందించింది. ఇవి కాక మహిళా సాధికారతకు ఊతమిస్తూ జాలర్ల జీవితాల్లో వెలుగులు నింపుతున్న వెల్విళి స్ఫూర్తి కథనమిది.

Published : 09 Feb 2022 01:04 IST

చిన్నప్పుడు సముద్రంలో వేటకెళ్లిన తండ్రి కోసం భయంగా ఎదురుచూసిన జ్ఞాపకాలు ఆమెని మెరైన్‌ బయాలజిస్టుని చేసింది. చేపల వేటలో జాలర్లకి ఎదురయ్యే ప్రమాదాలను దూరం చేయడానికి  సాంకేతికతను దరిచేర్చి.. ఇప్పటివరకు దాదాపు 20వేల మంది మత్య్సకారులకు శిక్షణనందించింది. ఇవి కాక మహిళా సాధికారతకు ఊతమిస్తూ జాలర్ల జీవితాల్లో వెలుగులు నింపుతున్న వెల్విళి స్ఫూర్తి కథనమిది.

నాగపట్నంలోని పూంపుహార్‌లో ఉన్న ఎమ్మెస్‌ స్వామినాథన్‌ రిసెర్చ్‌ ఫౌండేషన్‌ (ఎమ్మెస్సెస్‌ఆర్‌ఎఫ్‌) లో ‘ఫిష్‌ ఫర్‌ ఆల్‌ రిసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌’లో జీవశాస్త్రవేత్త వెల్విళి. తను 20 ఏళ్లు కృషి చేసి, తీర వాసుల జీవితాల్లో మార్పు తీసుకురాగలిగింది. ప్రమాదాలను పసిగట్ట లేకపోతే ప్రాణాపాయం పొంచి ఉంటుందనే విషయాన్ని మత్స్యకారులకు తెలియజేయడానికి వారితోపాటు ప్రయాణించడానికీ వెనుకాడదీమె. ముగ్గురు తోబుట్టువుల మధ్య పుట్టిన వెల్విళిది జాలర్ల కుటుంబం. ఆమెకు పదేళ్ల వయసప్పుడు... తండ్రి సింగారవేల్‌ సముద్రంలోకి మోటార్‌బోటులో చేపలు పట్టడానికి వెళ్లేవాడు. ప్రతిసారీ ఆయన తిరిగొచ్చే వరకు కుటుంబమంతా భయంగా ఎదురుచూసేది. తనకు తెలిసిన ఎందరో జాలర్లు వేటకు వెళ్లి తిరిగి వచ్చేవారు కాదు. ఇవన్నీ వెల్విళిని ఆలోచింపజేశాయి. సముద్రం గురించి తెలుసుకోవాలనుకుంది. ఇబ్బందులెన్నెదురైనా అధిగమించి, మెరైన్‌ బయాలజీలో ఎంఫిల్‌, ఆ తర్వాత పీహెచ్‌డీలో భాగంగా ‘ఇరులర్‌ ట్రైబల్‌ ఫిషర్స్‌ కమ్యూనిటీ’పై పరిశోధననూ చేపట్టింది. జీవశాస్త్రవేత్తగా ఎమ్మెస్సెస్‌ఆర్‌ఎఫ్‌లో చేరి తన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి కృషి చేసింది. సముద్రపు లోతుల్లో ఏయే ప్రాంతాల్లో ఏయే రకాల చేపలు నివసిస్తాయి, ఏ దిశగా ప్రయాణిస్తే వేట సులభం అవుతుంది వంటి అంశాలపై విస్తృతంగా అధ్యయనం చేసింది.

యాప్‌ ద్వారా...

జాలర్ల జీవనప్రమాణాలను మెరుగుపరిచే దిశగా ఎమ్మెస్సెస్‌ఆర్‌ఎఫ్‌ చేపట్టిన 14 ప్రాజెక్టులకు నేతృత్వం వహించి, కారైకాల్‌ సహా తమిళనాడు తీరప్రాంత మత్స్యకారులకెందరికో వెల్విళి చేయూతనందించింది. ‘జాలర్లు కొందరు వేట నుంచి తిరిగి రాని సందర్భాలెన్నో చూశా. సముద్రంలో అనుకోని ప్రకృతి విపత్తులు ప్రమాదాలకు దారితీస్తాయి. చేపలెక్కువగా ఎక్కడ ఉంటాయో అవగాహన లేకపోయినా, లేదా సముద్రగర్భంలోని వాతావరణం తెలియకపోయినా ప్రమాదం ముంచేస్తుంది. వీటన్నింటి గురించి జాలర్లకు చెప్పాలనిపించేది. అలా వారితోపాటు చాలా సార్లు వేటకు వెళ్లి అక్కడి పరిస్థితులను వారికి అర్థమయ్యేలా వివరించడం మొదలుపెట్టా. అలాగే కృత్రిమ దిబ్బల నిర్మాణం, వాటిపై చేపల పెంపకంలో మెరుగైన పద్ధతులను శిక్షణద్వారా అవగాహన కలిగించే ఏడు ప్రాజెక్టులను పూర్తిచేశా. సముద్రమార్గాన్ని సూచించడానికి ‘మీనావా నన్బన్‌’ అనే మొబైల్‌ యాప్‌ సౌకర్యాన్ని కల్పిస్తున్నా. ఏయే మార్గాల్లో ప్రయాణించాలో, వాతావరణంలో మార్పులు వంటివి దీనిద్వారా జాలర్లు తెలుసుకోవచ్చు. అలాగే తాబేళ్లను పరిరక్షణ గురించి కూడా అవగాహన కలిగిస్తున్నా’ అని చెబుతున్న వెల్విళి ఇప్పటికీ తన తండ్రి వద్ద సముద్రం గురించి సందేహాలను తీర్చుకుంటూ ఉంటుంది. మహిళలకు స్వయం ఉపాధి దిశగా చేపలను ఎండబెట్టి విక్రయించడం నుంచి సముద్రంలో లభ్యమయ్యే పలురకాల ఆల్చిప్పలతో అలంకార వస్తువుల తయారీ వరకు శిక్షణనందించింది తను. ఈ శిక్షణద్వారా దాదాపు 17వేలమంది మహిళలు సాధికారతను సాధించడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్