Published : 17/02/2022 00:17 IST

గుర్రమెక్కి... వధువు వస్తున్నదీ...

మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో పురుషాధ్యికత బాగా ఎక్కువ. అందులోనూ క్రతువుల్లో మరీ నిక్కచ్చిగా ఉంటారు. అలాంటి చోటే... కొందరు అమ్మాయిలు సంప్రదాయాల్ని తిరగ రాస్తున్నారు. అమ్మా నాన్నల మద్దతు, ఉన్నత విద్య వారిలో ఆత్మ విశ్వాసాన్ని నింపి పాత చింతకాయ పద్ధతులకు చెల్లు చీటీ రాసేలా ప్రేరణ కలిగిస్తున్నాయి. వారెవరో ఏం చేస్తున్నారో చూడండి...

‘మా తమ్ముడితో సమానంగా నన్నూ చూశారు. మా ఇంట్లో లింగ వివక్షకు చోటు లేదు. ఇది నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. దాంతో నాకు నచ్చిన న్యాయవాద కోర్సు పూర్తి చేస్తానన్నా. అమ్మానాన్న సరే అన్నా బంధువులు మాత్రం విమర్శించారు. ఈ చదువు చదివితే సరైన వరుడు రాడు, సంబంధం దొరకడం కష్టమన్నారు. న్యాయమూర్తి కావాలనే నా లక్ష్యానికి మా అమ్మానాన్నలు తోడుగా నిలుస్తానన్నారు. గతంలో మా కుటుంబాల్లో అమ్మాయిల నిర్ణయాలకు అంతగా విలువనిచ్చే వారు కాదు. పెద్ద చదువులు చదవడమూ అంతంత మాత్రమే. అయితే మా ఇంట్లో అమ్మానాన్న మాత్రం సమానత్వానికి పెద్దపీట వేశారు. నా పెళ్లి ఊరేగింపులో వరుడు మాత్రమే బారాత్‌లో గుర్రంపై వెళ్లాలి అన్నారంతా. అమ్మాయిలిలా ఎందుకు వెళ్లకూడదని నాన్నని అడిగా. అది సంప్రదాయం అని చెప్పారు. ఆ ఆచారానికి మనమెందుకు స్వస్తి చెప్పకూడదు అన్నా.  వరుడికి బదులు నేనే గుర్రంపై వివాహ వేదికకు వెళ్తా అంటే అమ్మ ఒప్పుకోలేదు. నాన్న మాత్రం నాకు మద్దతు పలికారు. ‘నువ్వే గుర్రంపై వెళుదువు గాని.. రేపటితరానికి ఈ ఊరేగింపు ఓ సందేశం కావాలి. అమ్మాయిలంటే సమాజంలో గౌరవం పెరగాలి’ అని నాన్న భుజం తట్టారు. నేను పుట్టినప్పుడు అందరూ ‘అయ్యో అమ్మాయి పుట్టిందా’ అంటే.. నాన్న మాత్రం స్వీట్లు పంచారట. తనకు అమ్మాయైనా, అబ్బాయైనా ఒక్కటే అన్నారట.

అందరికీ ఇటువంటి నాన్న ఉంటే ఎంత బాగుండును కదా. ఆ తర్వాత అమ్మ కూడా ఒప్పుకొంది. ఇలాంటి అమ్మానాన్నలు మన వెనుక ఉంటే జీవితంలో అనుకున్నది సాధించొచ్చు’ అని ఆనందంగా చెప్పుకొచ్చింది ప్రియ.
గర్వంగా... బిహార్‌లో ఇటీవల మరో వధువు కూడా ఇలాగే గుర్రంపై ఊరేగింపుగా వెళ్లింది. ఈమె పేరు అనుష్క గుహా. ఈ రాష్ట్రంలో లింగవివక్ష ఇప్పటికీ సమాజంలో కనిపిస్తూనే ఉంటుంది. అటువంటి చోట పుట్టిన ఈమెకు తల్లిదండ్రులు ఉన్నత విద్యనభ్యసించే స్వేచ్ఛనిచ్చారు. అలా ఎయిర్‌ హోస్టెస్‌ కోర్సు పూర్తి చేసి ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో విధులు నిర్వహిస్తోంది. ‘చిన్నప్పటి నుంచి చూసిన పెళ్లి ఊరేగింపుల్లో వరుడు గుర్రంపై వెళతాడు. అలా చూసిన ప్రతి సారీ నా పెళ్లికి మాత్రం నేనే ఊరేగింపుగా వరుడి వద్దకు వెళ్లాలనుకునే దాన్ని. అబ్బాయిలకు మాత్రమే ఈ సంప్రదాయమా... దీన్ని మార్చాలనిపించేది. ఇంట్లో చెబితే అమ్మానాన్న తప్పదు అనేవారు. వారికి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించే దాన్ని. నా వివాహం సమయానికి నాన్నతోపాటు అమ్మ సుష్మితను కూడా ఒప్పించేశా. వాళ్లు నా ఆలోచనలను అర్థం చేసుకుని మద్దతిచ్చారు. తెల్లని లెహెంగాలో నేను జీత్‌ ఇంటి దగ్గర దిగేసరికి అందరి ముఖాల్లో ఆశ్చర్యం. అందరికీ ఇటువంటి నాన్న ఉండాల్సిందే’ అని సంతోషంగా చెప్పిందీ నవ వధువు. రాజస్థాన్‌కు చెందిన కృతిక కూడా ఇటీవల ఇలానే గుర్రంపై ఊరేగింపుగా వెళ్లింది. లింగవివక్షకు వ్యతిరేకంగా తన ఊరేగింపు ఉండాలనే లక్ష్యంతో వరుడిలా షేర్వాణి ధరించి, తలపాగా కట్టుకొని కత్తిని చేపట్టి ‘బండోరీ’ పేరుతో వివాహ వేదికకు వెళ్లిందీమె.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని