ప్యాడ్‌ ఉమెన్‌ చేతిలో సిద్ధూ క్లీన్‌బౌల్డ్‌

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన మహిళా అభ్యర్థుల గురించి ఇప్పుడంతా చర్చించుకుంటున్నారు. అందులో హేమా హేమీలను కంగు తినిపించి మరీ ప్రత్యేకంగా నిలిచిన వారు సామాజిక సేవకురాలు జీవన్‌ జ్యోత్‌ కౌర్‌, అన్మోల్‌ గగన్‌ మాన్‌. వారి విశేషాలేంటో తెలుసుకోండి...

Updated : 12 Mar 2022 05:46 IST

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన మహిళా అభ్యర్థుల గురించి ఇప్పుడంతా చర్చించుకుంటున్నారు. అందులో హేమా హేమీలను కంగు తినిపించి మరీ ప్రత్యేకంగా నిలిచిన వారు సామాజిక సేవకురాలు జీవన్‌ జ్యోత్‌ కౌర్‌, అన్మోల్‌ గగన్‌ మాన్‌. వారి విశేషాలేంటో తెలుసుకోండి...

పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్‌ సిద్ధూ... తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన జీవన్‌ జ్యోత్‌ కౌర్‌ చేతిలో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యారు. అమృత్‌సర్‌ ఈస్ట్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆప్‌ అభ్యర్థిగా నిలిచిన కౌర్‌... సిద్ధూతోపాటు మరో ఇద్దరు ప్రముఖుల్నీ ఓడించారు. 40వేల పైచిలుకు ఓట్లు సాధించి సమీప ప్రత్యర్థి సిద్ధూపై 6750 ఓట్ల మెజారిటీతో గెలిచారీమె. 50 ఏళ్ల కౌర్‌కు ఎలాంటి రాజకీయ నేపథ్యమూ లేదుకానీ, ‘ప్యాడ్‌ ఉమెన్‌ ఆఫ్‌ పంజాబ్‌’గా పేరుంది. 1996లో ‘శ్రీ హేమ్‌కుండ్‌ ఎడ్యుకేషన్‌(షి)’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఓ పాఠశాలను స్థాపించి పేద పిల్లలు చదువుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. అల్పాదాయ వర్గాలవారికి ఉపాధి అవకాశాలు చూపిస్తున్నారు. కొన్నేళ్లుగా ‘ఎకోషీ’ పేరుతో పర్యావరణ హితమైన శానిటరీ ప్యాడ్లను అందిస్తున్నారు. ఒక స్విట్జర్లాండ్‌ సంస్థతో కలిసి వీటిని రాష్ట్రవ్యాప్తంగా మహిళా ఖైదీలూ, పలు కళాశాలల విద్యార్థినులతోపాటు మురికివాడలూ, గ్రామీణ మహిళలకు ఉచితంగా అందిస్తున్నారీమె. దీంతో ‘ప్యాడ్‌ ఉమెన్‌ ఆఫ్‌ పంజాబ్‌’గా గుర్తింపు తెచ్చుకున్నారు. 2016లో ఆప్‌లో చేరి, పార్టీలో కీలకంగా మారుతూ వచ్చిన కౌర్‌.. ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. గడపగడపకూ తిరిగి ప్రచారం చేయడమే కాకుండా, ‘జన్‌ సన్సద్‌’ పేరుతో నియోజకవర్గంలోని ప్రతి వార్డులో చర్చా కార్యక్రమాలు నిర్వహించి ప్రధాన సమస్యలైన వైద్య సదుపాయాలూ తాగునీరు, పారిశుద్ధ్యం... మొదలైనవి మెరుగు పరుస్తానని మాటిచ్చారు. మరోవైపు ప్రత్యర్థుల్ని సూటిగా విమర్శించడంలోనూ ముందుండే వారీమె.


ఆ గాయని ఇప్పుడు ఎమ్మెల్యే...

ఆమె తీయని పాటకు అక్కడందరూ అభిమానులే. అందుకు నిదర్శనం ఇన్‌స్టాలో ఆమెకున్న 25 లక్షల ఫాలోయర్లే. ఆమె ఇప్పుడు రాజకీయాల్లోనూ తానేంటో నిరూపించుకుంది. 32 ఏళ్ల అన్మోల్‌ గగన్‌మాన్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీ తరఫున ఖరార్‌ నియోజకవర్గం నుంచి గెలుపొందింది. అన్మోల్‌ మరో పేరు... గగన్‌దీప్‌ కౌర్‌ మాన్‌. మాన్సా జిల్లాలోని మొహాలీలో పుట్టిందీమె. చిన్నప్పట్నుంచీ చదువు, సంగీతంతోపాటు ప్రజాసేవన్నా ఆసక్తి ఎక్కువ. రాజకీయాల్లోకి రాకముందు నుంచే స్థానికుల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించేది. తనలో నాయకత్వ లక్షణాలకు బీజం పడింది అప్పుడే. తర్వాత ఆప్‌ తరఫున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేది. అతి కొద్దికాలంలోనే పార్టీ యువ విభాగానికి అధ్యక్షురాలైంది. ఈ ఎన్నికల్లో 36 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందింది. గగన్‌కు బాల్యం నుంచి సంగీతమంటే ప్రాణం. సైకాలజీ, సంగీతం సబ్జెక్టులుగా డిగ్రీ చేసింది. 2013లో ‘మిస్‌ వరల్డ్‌ పంజాబన్‌’ పోటీల్లో పాల్గొని మిస్‌ మొహాలీ పంజాబన్‌ కిరీటాన్ని దక్కించుకుంది కూడా. 2014లో ‘రాయల్‌ జట్టి’ గీతంతో సంగీత రంగ ప్రవేశం చేసింది అన్మోల్‌. ఏడాదికే ఈ పాట ‘పంజాబో’ టైటిల్‌తో ఆల్బమ్‌గా విడుదలైంది. అప్పట్నుంచీ తన గొంతు పంజాబీలకుసుపరిచితం. అన్మోల్‌ పాడే ప్రతి పాటా సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌ అవ్వాల్సిందే. కొన్ని పాటలకు కోట్లలో మరికొన్నింటికి లక్షల సంఖ్యలో వీక్షకులున్నారు. రచయిత్రిగా, సంగీత దర్శకురాలిగానూ పేరు తెచ్చుకుందీ బహుముఖ ప్రజ్ఞాశాలి. ప్రజా ప్రతినిధిగా కొత్త ఇన్నింగ్స్‌నీ విజయవంతంగా కొనసాగిస్తానంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్