ఈ టూరిస్ట్‌ గైడ్‌ ఫీజు రూ.కోట్లు

అమెరికా అధ్యక్షుడు మొదలు అంతర్జాతీయ స్థాయి కోటీశ్వరుల వరకు విహార యాత్రలకు వెళ్లాలంటే ఈమెను సంప్రదిస్తారు. ఆ పర్యటనను వారికి మరువలేని జ్ఞాపకంగా మార్చేస్తుందీమె.  అందుకేతనను గైడ్‌గా ఎంచుకోవడానికి కోట్ల రూపాయలు చెల్లించడానికి సిద్ధపడతారు. 

Published : 16 May 2022 01:49 IST

అమెరికా అధ్యక్షుడు మొదలు అంతర్జాతీయ స్థాయి కోటీశ్వరుల వరకు విహార యాత్రలకు వెళ్లాలంటే ఈమెను సంప్రదిస్తారు. ఆ పర్యటనను వారికి మరువలేని జ్ఞాపకంగా మార్చేస్తుందీమె.  అందుకే తనను గైడ్‌గా ఎంచుకోవడానికి కోట్ల రూపాయలు చెల్లించడానికి సిద్ధపడతారు.   అమెరికాకు చెందిన 35 ఏళ్ల జాక్వెలిన్‌ సియన్నా ఇండియా  ఇంత గుర్తింపు ఎలా తెచ్చుకుందంటే...

జాక్వెలిన్‌ సియన్నాకు చిన్నప్పటి నుంచి పర్యాటక రంగమంటే ఇష్టం. ప్రపంచమంతా తిరిగి రావాలని కలలు కనేది. భారతీయ మూలాలున్న జాక్వెలిన్‌.. ఫిలడెల్ఫియా టెంపుల్‌ యూనివర్శిటీ నుంచి ఆర్ట్స్‌లో డిగ్రీ, న్యూయార్క్‌ విశ్వవిద్యాలయం నుంచి హాస్పిటాలిటీ అండ్‌ టూరిజంలో ప్రత్యేక కోర్సు చేసింది. 2015లో ‘వోయెజ్‌’ పత్రికను ప్రారంభించి, ప్రపంచంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, బస, అక్కడి రుచుల సమాచారాన్ని అందించేది. 2008లో న్యూయార్క్‌ కేంద్రంగా పర్యటకులకు మార్గనిర్దేశం చేసేందుకు ‘సియన్నా ఛార్లెస్‌’ ట్రావెల్‌ ఏజెన్సీ ప్రారంభించింది. అప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రముఖుల అభిరుచులు, వారి ఆసక్తి, జీవనశైలి గురించి తెలుసుకున్న ఈమె దీన్ని ప్రముఖ పర్యాటక సంస్థగా మార్చడానికి కృషి చేసింది. అతి తక్కువ కాలంలోనే లగ్జరీ ట్రావెల్‌ ఏజెంట్‌గా పేరు సంపాదించింది.

జార్జిబుష్‌కు... అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జిబుష్‌ ఆయన సతీమణి లారాతో కలిసి 2015లో ఇథియోపియా సందర్శనకు వెళ్లినపుడు గైడ్‌గా పనిచేసింది జాక్వెలిన్‌. ‘అప్పటికే ప్రముఖులెందరికో పర్యాటకంలో సేవలందించిన నాకు బుష్‌తో పర్యటన సంతృప్తినిచ్చింది. ఆయనతోపాటు లారా బుష్‌, నలుగురు స్నేహితులు, వ్యక్తిగత వైద్యుడు, 30మంది సీక్రెట్‌ సర్వీస్‌ స్టాఫ్‌ వచ్చారు. అలా లలిబెలాకు చేరుకున్న ఆయనకు అక్కడ వందమందికిపైగా చిన్నారులు రాయల్‌బ్లూ టెక్సాస్‌ రేంజర్‌ టోపీలు ధరించి స్వాగతం పలికేలా చేశా. ఇటువంటి  ఊహించని, మరవలేని అనుభవాలను అందేలా చేయడంలో అవతలి వారికి దక్కే సంతోషం మాటల్లో చెప్పలే. అతిథికి ముందుగా తెలియకుండా చేసే ఇలాంటి సర్‌ప్రైజ్‌లకు చాలా సంతోషిస్తారు. ఇథియోపియాలో ఆయన కోసం ముందుగానే ఒక లగ్జరీ క్యాంపు సొంతంగా సిద్ధం చేసి మరీ అతిథి సేవలు అందించాం. అనుకున్నట్లుగా బస లేకపోవడంతో ఇలా చేశాం. బుష్‌ సందర్శించిన 80 దేశాల పర్యాటక ప్రాంతాలన్నిటిలోకీ, తాజ్‌మహల్‌  మరవలేనిదన్నారు.

ఏ ఇద్దరి ప్రముఖులకూ ఒకే విధమైన అభిరుచులు ఉండవు. మా ఏజెన్సీ ద్వారా పర్యాటకానికి వచ్చేవారి అభిరుచులూ, ఆహారపుటలవాట్లూ ముందే తెలుసుకుంటా. వెళ్లాల్సిన ప్రాంతాల విశేషాలపై పూర్తిగా అధ్యయనం చేసి వస్తా. కొందరినైతే ముందుగా వెళ్లి కలుస్తా. అలా వారి అభిరుచులనే కాదు, వారికి ఉండే ఫుడ్‌ తదితర అలర్జీలనూ.. తెలుసుకుంటా. వారు చదివే పత్రికల గురించి కూడా ఆరా తీస్తా. తర్వాతే వారి పర్యటన ప్రణాళిక రూపొందిస్తా. అక్కడ వారిని ఆశ్చర్యపరిచేందుకు ప్రయత్నిస్తా. దీంతో ఆ ప్రముఖులెవరూ మా సేవలను అందుకున్నతర్వాత మా సంస్థను మరువలేరు. కొందరి అభిరుచి మేరకు సాహస యాత్రలనూ ఏర్పాటు చేస్తుంటా. కొందరేమో పిరమిడ్లు వంటి కట్టడాలు చూడటానికి ఇష్టపడతారు. ఓ ప్రముఖ నేత ఈజిప్టులోని కైరో నుంచి నైల్‌ నది గుండా సముద్ర తీరం వరకూ ప్రైవేటు పడవలో ప్రయాణం చేశారు.  ప్రఖ్యాత ఎయిర్‌ మ్యూజియం, ఆలయాలు వంటివన్నీ మార్గమధ్యంలో సందర్శించేలా చేసి ఆశ్చర్యపరిచా. ఒక నేతకైతే ఆయన సతీమణి పుట్టిన రోజు సందర్భంగా చెర్రీ స్నో గులాబీలతో ఓ ప్రైవేటు విల్లా అంతా అలంకరించి సర్‌ప్రైజ్‌ ఇచ్చాం. ఒకసారి మియామీలో సినిమాలకు సెట్టింగ్‌ వేసే కళాకారులను రప్పించి పర్షియన్‌ సెట్‌ను సిద్ధంచేసి, ప్రముఖ చెఫ్‌ ఎరిక్‌ రిపెర్ట్‌ డిజైన్‌ చేసిన ప్రత్యేక మెనూను ఏర్పాటు చేయించా. 80 దేశాలకు పైగా పర్యటించా. దేశాధ్యక్షులు, ప్రధానమంత్రులు, ప్రపంచ నేతలు... ఇలా దాదాపు 15మందికి పైగా టూరిస్ట్‌ గైడ్‌గా పనిచేశా. వీళ్లు కాకుండా వ్యాపార, సినీ, క్రీడా ప్రముఖులూ ఉన్నారు’ ..అని చెప్పుకొస్తున్న జాక్వెలిన్‌ ఈ స్థాయికి చేరుకోవడంలో భర్త ఫ్రెడ్డీ ఛార్లెస్‌ రీనెర్ట్‌ ప్రోత్సాహమెంతో ఉందంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్