ఒట్టి కాళ్లతోనే పరిగెత్తా...

కూలికెళితేనే కడుపు నిండే కుటుంబంలో పుట్టింది నయన. అయితేనేం.. పరుగులో వేగం ఆమెను అంతర్జాతీయ క్రీడాకారిణిగా మార్చింది. ఆసియాలోనే అతి వేగవంతమైన నాలుగో క్రీడాకారిణిగా నిలిపింది.

Updated : 11 Jun 2023 06:54 IST

కూలికెళితేనే కడుపు నిండే కుటుంబంలో పుట్టింది నయన. అయితేనేం.. పరుగులో వేగం ఆమెను అంతర్జాతీయ క్రీడాకారిణిగా మార్చింది. ఆసియాలోనే అతి వేగవంతమైన నాలుగో క్రీడాకారిణిగా నిలిపింది. త్వరలో సౌత్‌ కొరియాలో జరగనున్న అండర్‌-20 ఛాంపియన్‌ షిప్‌కు దేశం పోటీపడుతున్న 19 ఏళ్ల నయన గంగూకోక్రే మనోగతమిది.

నిరుపేద కుటుంబంలో పుట్టిన నేను విమానమెక్కగలుగుతానని కలలో కూడా అనుకోలేదు. మాది కర్ణాకలోని మారుమూల గ్రామం. అమ్మానాన్న కూలికెళ్లి మమ్మల్ని పోషించే వారు. అక్క, నేను, తమ్ముడు స్కూల్‌కెళ్లేవాళ్లం. ఆ తర్వాత మా ఇద్దరి చదువు కొనసాగడానికి అక్క స్కూల్‌ మానేసింది. సెలవు రోజుల్లో నేనూ వారితోపాటు కూలికి వెళితేనే ఇంటి అవసరాలు తీరేవి. మా ఊళ్లో నీరు, విద్యుత్తు కొరత ఎక్కువ. వ్యవసాయం లేక అందరూ పనులుచేసి బతకాల్సిందే. మంచినీళ్ల కోసం రోజూ ఎన్నో మైళ్లు నడుస్తాం. అలా చిన్నప్పట్నుంచి ఎంత దూరమైనా.. వేగంగా నడవడం అలవాటు.

ఆ ప్రోత్సాహం...

స్కూల్‌లో జరిగే క్రీడా పోటీల్లో పాల్గొనడం ఇష్టం. పరుగులో నా వేగాన్ని పీటీ మాస్టారు గుర్తించారు. తొమ్మిదో తరగతిలో  స్థానికంగా జరిగే ఓ పోటీకి వెళ్లమన్నారు. నెగ్గితే నగదు బహుమతి ఉంటుందనడంతో ఉత్సాహంగా బయలుదేరా. తీరా ఆ పోటీలో అందరూ బూట్లు వేసుకొన్నారు. బూట్లు కొనే స్థోమత లేక, ఒట్టి కాళ్లతోనే పరుగుపెట్టా. పోటీలో గెలిచి నగదును అమ్మకిచ్చేశా. చాలాసార్లు నగదును ఇంటి అవసరాలకిచ్చేదాన్ని. అలా పోటీలకు వెళితే కోచ్‌ల దృష్టిలో పడి, నాకు శిక్షణ దొరుకుతుందని మాస్టారి ఆశ. ఆయన అనుకున్నట్లే అవకాశమూ వచ్చింది.

విదేశాలకు..

2019లో క్రీడలపై ఆసక్తి ఉన్న పేద పిల్లలకు చేయూతనిచ్చే ‘బ్రిడ్జెస్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ (బీఓఎస్‌)’ సేవాసంస్థ దృష్టిలో పడ్డా. దీనిద్వారా పౌష్టికాహారంతోపాటు ప్రత్యేక కోచ్‌ల శిక్షణ పొందా. మూడేళ్ల క్రితం వరకు కాళ్లకు కనీసం బూట్లు లేని నేను, ఇప్పుడు స్పోర్ట్స్‌ షూతో పోటీల్లో పాల్గొంటున్నా. సౌత్‌ కొరియాలో జరగనున్న అండర్‌-20 ఛాంపియన్‌షిప్‌ పోటీలకు క్వాలిఫై కావడమే కాదు, ఆసియాలో నాలుగో వేగవంతమైన రన్నర్‌గా నిలిచా. 100, 200 మీటర్ల పరుగు పోటీలో త్వరలో ఆసియా క్రీడల్లో పాల్గొనే అర్హతను సాధించా. ఉత్తమ శిక్షణ జీవితమార్గాన్నెలా మార్చేయగలదో చెప్పడానికి నేనే ఉదాహరణ. కొవిడ్‌ సమయంలో శిక్షణకు దూరం కాకూడదని, ఇంట్లోనే ఫిట్‌నెస్‌ కోసం వ్యాయామాలు చేసేదాన్ని. పరుగూ మానలేదు. దాంతో ఆ తర్వాత జరిగిన మూడో నేషనల్‌ ఓపెన్‌ 400 మీటర్ల ఛాంపియన్‌షిప్‌లో పతకాన్ని గెలుచుకొన్నా. ఇప్పటివరకు పదికిపైగా జాతీయస్థాయి ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొన్నా. ఎప్పుడూ ఫలితం గురించి ఆలోచించను. లక్ష్యమంతా గమ్యంపైనే. అదే విజయాన్నిస్తుందని నమ్ముతా. త్వరలో ఇంటర్నేషనల్‌ టోర్నమెంట్స్‌లోనూ పోటీ పడుతున్నా. సామర్థ్యాన్ని పెంచుకొంటే దేన్నైనా సాధించొచ్చు. నాలాంటివారికందరికీ స్ఫూర్తిగా నిలవడం గర్వంగా ఉంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని