గడపదాటకున్నా... గౌరవం!

ధనిక కుటుంబం, మంచి ఉద్యోగం... కోరుకున్న జీవితం... అలాగని సంతృప్తిపడిపోలేదామె! తోటి మహిళల్ని కష్టాల నుంచి గట్టెక్కించాలనుకున్నారు. నైపుణ్యాల శిక్షణనిచ్చి, పర్యావరణహిత ఉత్పత్తుల తయారీతో వందల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నారు. ఆమే ‘సిరోహీ ఎన్జీవో’ నిర్వాహకురాలు గౌరీ మాలిక్‌.

Published : 13 Mar 2024 03:24 IST

ధనిక కుటుంబం, మంచి ఉద్యోగం... కోరుకున్న జీవితం... అలాగని సంతృప్తిపడిపోలేదామె! తోటి మహిళల్ని కష్టాల నుంచి గట్టెక్కించాలనుకున్నారు. నైపుణ్యాల శిక్షణనిచ్చి, పర్యావరణహిత ఉత్పత్తుల తయారీతో వందల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నారు. ఆమే ‘సిరోహీ ఎన్జీవో’ నిర్వాహకురాలు గౌరీ మాలిక్‌.

సంప్రదాయ భావాలున్న ధనవంతుల కుటుంబం గౌరీమాలిక్‌ది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ ఆమె స్వస్థలం. ఆ రోజుల్లో  స్థానికంగా జరిగిన హింసాత్మక ఘటనలకు భయపడి తల్లిదండ్రులామెను ఆరేళ్లప్పుడు దెహ్రాదూన్‌లోని వెల్హమ్‌ గర్ల్స్‌ స్కూల్లో చేర్చారు. అక్కడే స్వతంత్రంగా ఎలా బతకాలో నేర్చుకున్నానంటారామె. ఆపై యూకేలోని వార్విక్‌ బిజినెస్‌ స్కూల్లో ఎంఎస్సీ ఫైనాన్స్‌, ఎకనమిక్స్‌ పట్టా అందుకున్నారు. కొన్నాళ్లు పెరూలోని ఓ మైక్రో క్రెడిట్‌ సంస్థలో వాలంటీర్‌గా పనిచేశారు. ఆ ప్రాంతంలోని ఒంటరి తల్లులు సొంతంగా వ్యాపారాలు చేసుకునేందుకు చేయూతనందించే ప్రాజెక్ట్‌లో కీలకంగా వ్యవహరించారు.ఆ పని ఆమె ఆలోచనా దృక్పథాన్నే మార్చేసింది. ఇండియాకు తిరిగొచ్చాక ముంబయిలోని   డాయిష్‌ బ్యాంక్‌లో కొన్నాళ్లు పనిచేశారు. మరోపక్క దిల్లీ కేంద్రంగా ‘స్కిల్డ్‌ సమారిటన్‌’ పేరుతో ఓ ఎన్జీవో ఏర్పాటు చేసి తీవ్రమైన విద్యుత్‌ సమస్య ఉన్న మూడు గ్రామాలకూ, పది పాఠశాలలకు సోలార్‌ పవర్‌ని అందించారు. అయితే, మూడేళ్ల తరవాత వివిధ కారణాలతో ఆ ప్రయాణాన్ని ఆపేశారు.

గరాజ్‌ నుంచే పనులు...

ఓసారి ఇద్దరు మైనర్‌ బాలికలకు వారికిష్టం లేని పెళ్లి చేయడం చూశారు గౌరి. ఆపాలని ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. అలాంటివారు తిరిగి తమ తలరాతను మార్చుకునే అవకాశం కల్పించేందుకు ఏం చేయాలా అని ఆలోచనలో పడ్డారు. చదువు రాకపోయినా కొందరు ఆడవాళ్లు అందమైన చార్‌పాయ్‌ కాట్స్‌(నులక మంచాలు), గృహోపకరణాలను తయారు చేయడం చూశారు. వీరికే మరికొన్ని నైపుణ్యాలు నేర్పిస్తే... ఉపాధి కల్పించొచ్చని తలచి సిరోహీ పేరుతో ఓ ఎన్జీవోని ప్రారంభించారు గౌరీ. దాచుకున్న రూ.2 లక్షలను పెట్టుబడిగా, తన ఇంట్లోని కార్‌ గరాజే ఆఫీసుగా కార్యకలాపాలు ఆరంభించారు. అయితే, నైపుణ్యాల శిక్షణ అందించి, ఉపాధి కల్పిస్తామని చెప్పినా మొదట ఎవరూ స్పందించలేదు. గౌహర్‌ ఫాతిమా అనే మహిళ మాత్రం తన ఇంటికే ముడిసరకు ఇస్తే కలిసి పనిచేస్తానని ముందుకు వచ్చింది. దాంతో ముప్ఫైవేల రూపాయల ముడిసరకు కొని ఇవ్వడంతో తన ప్రయాణం ప్రారంభించింది. గౌహర్‌ వచ్చిన ఆదాయంతో తన కుటుంబాన్ని చక్కదిద్దుకోవడం చూసి మరికొంతమంది మహిళల్లోనూ చైతన్యం వచ్చింది.

పర్యావరణహితంగా...

పత్తి, జ్యూట్‌, కలువ నార, టెక్స్‌టైల్‌, ప్లాస్టిక్‌ వ్యర్థాలు, మూన్జ్‌ గ్రాస్‌, రాఫియా ఫైబర్‌ వంటివాటిని సిరోహీ ఉత్పత్తులకు ముడిసరకుగా వాడతారు. తయారీదారుల ఇళ్లకు వీటిని పంపించాక ఎవరికి ఏ డిజైన్లు తయారు చేయాలో వీడియో కాల్‌లో చెబుతారు. ఆ సూచనల ఆధారంగా కుర్చీలు, బెంచీలు, చార్‌పాయ్‌లు, బుట్టలు, పెట్టెలు వివిధ గృహాలంకరణ వస్తువులెన్నో తయారుచేస్తారు. ఇది బాగానే సాగుతోందనుకుంటుండగా కొవిడ్‌ మహమ్మారి వీరి అవకాశాలను దెబ్బతీసింది. అయినా నిరాశపడక ఉత్పత్తులను సామాజిక మాధ్యమాల ద్వారా మరింత ప్రాచుర్యంలోకి తెచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న క్రాఫ్ట్‌ కమ్యూనిటీలతో కలిసి పనిచేయడం ప్రారంభించారు. దీంతో కశ్మీర్‌లోని పేపర్‌ మెషే ఉత్పత్తుల నుంచి పుణెలోని కాపర్‌ క్రాఫ్ట్స్‌ వరకూ ఎన్నింటినో సిరోహీ విక్రయిస్తోంది. దీంతో ఉపాధి పొందిన కుటుంబాలు మెరుగైన జీవనశైలిని అనుసరిస్తున్నాయి. బాల్యవివాహాలు, నేరాల రేటు తగ్గింది. మహిళలు ఆర్థిక భద్రత సాధించడంతో పాటు నాయకత్వ లక్షణాలనూ అలవరుచుకున్నారు. ప్రస్తుతం ఈ సంస్థతో దేశవ్యాప్తంగా సుమారు 2500మంది కళాకారులు పనిచేస్తున్నారు. వీరు చేసిన ఉత్పత్తులు సిరోహీ వెబ్‌సైట్‌తో పాటు ఓఖై, అమెజాన్‌, పర్పుల్‌ టర్టిల్‌, లా మార్చే వంటి ఈ-కామర్స్‌ సైట్లలోనూ లభిస్తాయి. ఇబ్బందులన్నీ దాటి ఇప్పుడిప్పుడే సంస్థ కోట్ల రూపాయల ఆదాయాన్ని అందుకుంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్