ఉల్లి రసం... మరకలు మాయం!

ఉల్లి ఉండని వంటిల్లు ఉండదేమో. ప్రతి కూరలో ఉప్పుతోపాటు తప్పనిసరిగా కనిపిస్తుంది. ఆమ్లెట్‌ మొదలు మాంసాహార కూరల వరకూ అన్నింట్లో ఇది ఉండాల్సిందే. సలాడ్లలో సైడ్‌ డిష్‌గానూ కనువిందు చేస్తుంది. ఇన్ని సుగుణాలున్న ఉల్లి రుచినే కాదండోయ్‌...

Updated : 13 Feb 2022 04:45 IST

ఉల్లి ఉండని వంటిల్లు ఉండదేమో. ప్రతి కూరలో ఉప్పుతోపాటు తప్పనిసరిగా కనిపిస్తుంది. ఆమ్లెట్‌ మొదలు మాంసాహార కూరల వరకూ అన్నింట్లో ఇది ఉండాల్సిందే. సలాడ్లలో సైడ్‌ డిష్‌గానూ కనువిందు చేస్తుంది. ఇన్ని సుగుణాలున్న ఉల్లి రుచినే కాదండోయ్‌... శుచినీ అదేనండీ శుభ్రతనూ ఇస్తుంది. వంటసోడా, ఉప్పు లాంటి పదార్థాలతో కలిసి ఇంటిని శుభ్రం చేస్తుంది.

ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌... నూనె, దుమ్ము, ధూళితో మురికి పట్టిన ఈ ఫ్యాన్‌ను శుభ్రం చేయాలంటే కొంచెం ఇబ్బందే. సగం ఉల్లిపాయ ముక్కను వంటసోడాలో ముంచి దాంతో ఫ్యాన్‌ను తుడవండి. కాస్త గట్టిగానే రుద్దితే జిడ్డు తొలగిపోతుంది. కాసేపటి శుభ్రమైన పొడి వస్త్రంతో తుడిచేస్తే చాలు.
మరకలు మాయం... దుస్తులపై పడిన ఇంకు, ఇనుము మరకలను ఉల్లిరసం తొలగిస్తుంది. మరకలపై ఉల్లిపాయ ముక్కతో కాసేపు రుద్ది ఆరనివ్వాలి. అప్పటికీ మరక పోకపోతే మరోసారి రుద్ది కొన్ని నిమిషాలాగి పిండితే మరక మాయం.
గిన్నెల మసి వదిలేలా... మురికి పట్టిన లేదా బాగా మాడిన గిన్నెలను ఉల్లిపాయ ముక్కతో రుద్ది చూడండి. కాసేపు అలాగే ఉంచి ఆ తర్వాత ఎప్పటిలానే శుభ్రం చేయండి. మార్పు మీకే తెలుస్తుంది.
లోహ పాత్రలు మెరిసేలా... స్టీలు, ఇత్తడి, రాగి పాత్రలను మెరిపించాలా... ఉల్లిపాయ ఉంటే చాలు... ఇక మెరుపులే. ఉల్లిపాయ ముక్కలను కచ్చాపచ్చాగా దంచాలి. ఈ మిశ్రమంతో లోహ పాత్రలను రుద్దితే సరి. ఇలా చేస్తే గిన్నెలపై పట్టిన చిలుము లాంటివి పోవడమే కాకుండా కొత్తవాటిలా మెరుస్తాయి.
గ్యాస్‌ స్టవ్‌... వంట చేసేటప్పుడు అన్నం, పప్పు, కూర... ఇలా రకరకాల పదార్థాలు స్టవ్‌పై పడటం సాధారణమే. వీటిని వెంటనే తుడవకపోతే మొండి మరకలుగా మారతాయి. అయితే సులువుగా వీటిని వదిలించాలంటే మీ దగ్గర ఓ చిన్న ఉల్లిపాయ ముక్క, కాస్తంత ఉప్పు ఉంటే సరిపోతుంది. స్టవ్‌పై ఉప్పు చల్లి, ఉల్లిముక్కతో బాగా రుద్ది కాసేపు అలా వదిలేయాలి. ఆ తర్వాత శుభ్రమైన వస్త్రంతో తుడిస్తే మరకలు పోతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్