వర్షాల్లో వస్త్రాలు జాగ్రత్త!

చినుకులు మొదలయ్యాయి. దుస్తుల ఎంపికలో ముందస్తు జాగ్రత్త తీసుకుంటే సీజన్‌కు తగినట్లు అందంగా కనిపించడమే కాదు, ఆరోగ్యంగానూ ఉండొచ్చు అంటున్నారు నిపుణులు.

Published : 22 Jun 2022 01:47 IST

చినుకులు మొదలయ్యాయి. దుస్తుల ఎంపికలో ముందస్తు జాగ్రత్త తీసుకుంటే సీజన్‌కు తగినట్లు అందంగా కనిపించడమే కాదు, ఆరోగ్యంగానూ ఉండొచ్చు అంటున్నారు నిపుణులు.

ర్షం మొదలైందంటే ఇంటి సామాన్లతో పాటు దుస్తులనూ జాగ్రత్త చేసుకోవాలి. కాలానికి తగిన వాటిని ఎంచుకునే ముందు సీజన్‌కు తగ్గట్లుగా వార్డ్‌రోబ్‌ను సర్దుకోవడం మంచిది. మొదట అలమర తలుపులు పూర్తిగా మూసుకుంటున్నాయో లేదో, అలాగే చెక్క బీరువా అయితే ఎక్కడైనా బీటలు వారిందేమో పరిశీలించి బాగు చేయాలి. లేదంటే వాతావరణంలోని చెమ్మ దుస్తులకు చేరుకొనే ప్రమాదం ఉంది. ఆ తర్వాత అలమరలన్నీ ఖాళీ చేసి, శుభ్రం చేసి కాసేపు ఆరనిచ్చి పొడి వస్త్రంతో తుడవాలి. దుమ్మూ, ధూళి లేకుండా జాగ్రత్తపడితే దుస్తులకు ఫంగస్‌ పట్టదు. అలాగే రోజూ పది నిమిషాలు తలుపులు తీసి ఉంచడం మంచిది. వార్డ్‌రోబ్‌లో దుస్తులను సర్దేటప్పుడు కూడా వాటిలో చెమ్మ లేకుండా జాగ్రత్తపడాలి.

దుస్తులను.. సీజన్‌కు తగిన దుస్తులను ముందుగా ఎంపిక చేసుకొని, మిగతావాటిని మరొక అలమర లేదా వార్డ్‌రోబ్‌లో విడిగా భద్రపరచాలి. సిల్కు రకాలకు ప్రాముఖ్యతనివ్వాలి. వీటిని ధరించినప్పుడు తడిసినా.. త్వరగా ఆరిపోతాయి. అలాగే శరీరానికి వెచ్చదనాన్నీ.. అందిస్తాయి. జీన్స్‌ వాడకం తగ్గించడం మంచిది. ఇవి తడిస్తే బరువెక్కడమే కాదు, శరీరమంతా చెమ్మదనంతో అనారోగ్యాలకు దారితీసేలా చేస్తాయి. తేలికైన సిల్కు ప్యాంటు, స్కర్టు, ఫ్లోరల్‌ డిజైన్లున్న టాప్స్‌, చుడీదార్‌లు వర్షాకాలానికి సరైన ఎంపిక. ఫ్లోర్‌ లెంత్‌ దుస్తులకూ దూరంగా ఉండాలి. హెవీ ఎంబ్రాయిడరీ సూట్స్‌ను విడిగా పొడి కవర్లలో పెట్టి వేరే అలమరలో ఉంచడం మంచిది. వార్డ్‌ రోబ్‌లో దుస్తులు ఇరుకుగా లేకుండా కాస్తంత ఖాళీగా ఉండేలా సర్దుకోవాలి.

సువాసనభరితంగా.. బీరువా అలమరలను మూడుగా విభజించి, టాప్స్‌, ప్యాంటులు, దుపట్టాలను విడివిడిగా ఉంచాలి. దుస్తుల్లో చెమ్మ చేరి దుర్వాసన రాకుండా ఉండాలంటే ప్రతి అరలోనూ ముందుగా పొడి కాగితాన్ని పరవాలి. నాలుగైదు చెంచాల ఉప్పు వేసిన సంచిని ప్రతి అరలో మూలల్లో ఉంచాలి. ఇది వాతావరణంలోని చెమ్మను పీల్చి పొడిగా ఉండేలా చేస్తుంది. లేదా రెండు మూడు చాక్‌పీస్‌లను కాగితంలో పొట్లంలా కట్టి మూలల్లో ఉంచాలి. చిన్న కవర్‌లో కర్పూరం నింపి ఉంచినా, దుస్తుల మధ్య నాఫ్తలిన్‌బాల్స్‌ను ఉంచినా అలమరల్లో చెమ్మదనం ఉండదు. సువాసనగానూ ఉంటుంది. వీటితోపాటు గుప్పెడు ఎండు వేపాకులను కప్‌బోర్డ్‌ మూలల్లో ఉంచితే కీటకాలు రాకుండా ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్