కలిసుంటున్నాను.. ఇప్పుడే పెళ్లొద్దు..!

నా వయసు 26. తొమ్మిదేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. ఇంట్లో పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తోంటే మరో ఐదేళ్ల వరకూ చేసుకోనన్నాను. తను ప్రైవేట్‌ ఉద్యోగి, ఇంకా స్థిరపడాలి కనుక 32 ఏళ్లకి చేసుకోవాలనుంది. మా వాళ్లతో ఇంకొన్నేళ్లు గడపాలనుంది.

Published : 25 Jul 2022 00:20 IST

నా వయసు 26. తొమ్మిదేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. ఇంట్లో పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తోంటే మరో ఐదేళ్ల వరకూ చేసుకోనన్నాను. తను ప్రైవేట్‌ ఉద్యోగి, ఇంకా స్థిరపడాలి కనుక 32 ఏళ్లకి చేసుకోవాలనుంది. మా వాళ్లతో ఇంకొన్నేళ్లు గడపాలనుంది. పిల్లలంటే ఇష్టం లేదు. ఇంట్రావర్ట్‌ని. స్నేహితులు లేరు. తనతో తప్ప మరెవరితోనూ సంతోషంగా ఉండలేను. పెద్దవాళ్లను పట్టించుకోవడం లేదనే బాధతో ఒక్కోసారి జుట్టు లాగేసుకుంటాను. కొన్నిసార్లు చనిపోవాలనిపిస్తుంది.

- ఓ సోదరి

లుగురితో కలవలేక ఒంటరిగా ఉండటం, ఎవరినీ నమ్మక పోవడం, స్నేహంగా ఉండలేకపోవడం- వ్యక్తిత్వ లోపాల్లా ఉన్నాయి. అతడింకా స్థిరపడాలనడం, 30 తర్వాత పెళ్లి, పిల్లలు వద్దనడాన్ని బట్టి మీలో వయసుకు తగిన పరిపక్వత లేదనిపిస్తోంది. జీవితంలో ముఖ్యమైన పెళ్లి గురించి సరైన నిర్ణయం తీసుకోకుంటే ఆనక సమస్యలు రావచ్చు. రిలేషన్‌షిప్‌ అంటే.. అతనితో కలకాలం సుఖంగా, సౌఖ్యంగా ఉంటాననే నమ్మకముందా? పెళ్లనేది కంపానియన్‌షిప్‌ కోసం. ఒకరినొకరు అర్థం చేసుకుని, ఒకరి కోసం ఒకరన్నట్టుగా మెలిగేందుకు. శారీరక, మానసిక ఉల్లాసం కోసం. పిల్లలతో వంశం వృద్ధి చెందుతుంది. పెద్దయ్యాక వాళ్లు మన బాధ్యత తీసుకుంటారు. ఇంకో కుటుంబంతో బాంధవ్యం ఏర్పడుతుంది. చిన్న ఉద్యోగమైనా.. జాగ్రత్తగా ఉంటూ జీవనం సాగించవచ్చు. స్థిరపడటం అనేది మీరనుకున్న సమయానికి కావచ్చు, కాకపోవచ్చు. అది ముఖ్యం కాదు. ఎప్పుడు జరగాల్సిన ముచ్చట్లు అప్పుడు జరగాలి. వయసు మీరకుండానే చేసుకోవాలి. మీ వ్యక్తిత్వ రీత్యా అందరితో కలవలేనందున పెద్దలను ఒప్పించి అతన్ని చేసుకోవడం మంచిది. జాప్యం చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో తెలీదు కనుక త్వరపడండి. పెళ్లయ్యాక ఇరువైపులా పిల్లలను ఆశించడం సహజం. దానికి సిద్ధంగా ఉండాలి. పెళ్లి లేని రిలేషన్‌లో కుటుంబసభ్యులతో అనుబంధం ఉండదు. మీ ఇద్దరి మధ్య ప్రేమ కూడా పటిష్టంగా ఉండకపోవచ్చు. పిల్లలతో బాండింగ్‌ ఏర్పడుతుంది. అమ్మానాన్నా, అక్కచెల్లెళ్లు కొంతవరకే పట్టించుకుంటారు. ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకుని, పెళ్లి అవసరం గురించి, పరిణామాలూ పర్యవసానాలూ అన్నీ కుటుంబసభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. ఏదేమైనా ఇది లేఖ ద్వారా పరిష్కరించే సమస్య కాదు. మీరు తప్పనిసరిగా సైకియాట్రిస్టును సంప్రదించండి. పరీక్షించి కౌన్సిలింగ్‌ ఇస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని