ఆస్తి, పిల్లాడూ నా హక్కు కాదా!

మా వారు కొవిడ్‌తో మరణించే నాటికి నాకు ఏడాది వయసున్న కొడుకున్నాడు. అప్పటికి ఆయన పేరు మీద రెండెకరాల పొలం, పది సెంట్ల స్థలం, ఒక ఫ్లాట్‌ ఉన్నాయి. పిల్లాడితోనూ, ఆస్తితోనూ నాకు ఎటువంటి సంబంధం లేదని అత్తమామలు రాసివ్వమంటున్నారు.

Published : 20 Jun 2023 05:21 IST

మా వారు కొవిడ్‌తో మరణించే నాటికి నాకు ఏడాది వయసున్న కొడుకున్నాడు. అప్పటికి ఆయన పేరు మీద రెండెకరాల పొలం, పది సెంట్ల స్థలం, ఒక ఫ్లాట్‌ ఉన్నాయి. పిల్లాడితోనూ, ఆస్తితోనూ నాకు ఎటువంటి సంబంధం లేదని అత్తమామలు రాసివ్వమంటున్నారు. అలా చేస్తే పద్దెనిమిదేళ్ల తర్వాత బాబుకి అవన్నీ అప్పగిస్తామనీ, అప్పట ¨వరకూ వారే ఆ ఆస్తికీ, బిడ్డకీ కూడా సంరక్షకులుగా ఉంటామనీ చెబుతున్నారు. ఇలా చేస్తే... మరో పెళ్లి చేసుకోవడానికి పదిహేను లక్షల రూపాయలను ఇస్తాం అంటున్నారు. ఇదంతా సరైనదిగా నాకు అనిపించడం లేదు. ఏం చేయాలో సలహా ఇవ్వగలరు?

- ఓ సోదరి

చిన్న వయసులోనే భర్తను కోల్పోవడం దురదృష్టకరం. అతడి ఆస్తితో మీకు సంబంధం లేదని అత్తింటివాళ్లు అనడాన్ని చట్టం ఒప్పుకోదు. హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్‌-8 ప్రకారం హిందూ పురుషుడు వీలునామా రాయకుండా చనిపోతే అతని ఆస్తి సెక్షన్‌ 10లో చెప్పిన క్లాస్‌-1 వారసులకు చెందుతుంది. ఈ సెక్షన్‌లోని రూల్‌ నంబర్‌(1)లో చనిపోయిన వ్యక్తి భార్య, రూల్‌ నంబర్‌(2)లో తర్వాత పిల్లలు, తల్లి వస్తారు. దాని ప్రకారం మీకు ఒక భాగం కచ్చితంగా రావాలి. ఇకపోతే పిల్లల కస్టడీకి తల్లిదండ్రులు సహజ సంరక్షకులు. తండ్రి లేకపోతే తల్లికి పూర్తి హక్కులు ఉంటాయి. తాత, నానమ్మలు పిల్లాడిని చూడాలనుకుంటే కోర్టు ద్వారా విజిటింగ్‌ రైట్స్‌ పొందవచ్చు. పూర్తిగా మీ దగ్గర నుంచి తీసుకోవాలంటే మాత్రం మీకు బాబుని చూసుకునే స్థోమత, మానసిక స్థితి సరిగా లేవని నిరూపించాలి. సాధారణంగా 5 ఏళ్ల లోపు పిల్లల్ని తల్లి దగ్గరే ఉంచుతారు. ఇక, పిల్లాడు మీ దగ్గర ఉన్నప్పటికీ అతడికి రావాల్సిన ఆస్తి వస్తుంది. ఒకవేళ ఆస్తులు వాళ్ల స్వాధీనంలో ఉంటే వెంటనే మీకు అప్పగించమనీ, అందులో మీకూ, అబ్బాయికి రావాల్సిన భాగాల్ని కోరుతూ దావా వేయండి. భర్త పేరనున్న ఆస్తి భార్య పేరు మీదకు రావాలంటే రెవిన్యూ రికార్డుల్లో మ్యుటేషన్‌ చేయించుకోవాలి. అందుకు మీరు చట్టబద్ధ వారసులుగా నిరూపణ కోరుతూ సక్సెషన్‌ సర్టిఫికెట్‌ని కోర్టు నుంచి తీసుకోవాలి. దీనికి ఆరునెలలు పట్టొచ్చు. మీరు ఈలోగా ఎటువంటి ఒప్పందాల మీదా సంతకాలు పెట్టొద్దు. ఏదున్నా కోర్టు ద్వారానే తేల్చుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని