ఇంకా గుర్తొస్తున్నాయి..

ముగ్గురు ఆడపిల్లల్లో నేనే పెద్దదాన్ని. పీజీ పూర్తవడంతో సంబంధాలు చూస్తున్నారు. చిన్నతనంలో ఆటోడ్రైవర్‌ చేతిలో లైంగిక హింసకు గురయ్యా.

Published : 03 Jul 2023 00:39 IST

ముగ్గురు ఆడపిల్లల్లో నేనే పెద్దదాన్ని. పీజీ పూర్తవడంతో సంబంధాలు చూస్తున్నారు. చిన్నతనంలో ఆటోడ్రైవర్‌ చేతిలో లైంగిక హింసకు గురయ్యా. ఈ విషయం ఇంట్లో చెబితే స్కూలు మానిపించేస్తారనే భయంతో చెప్పలేదు. ఆ చేష్టలు ఇంకా గుర్తొస్తున్నాయి. పెళ్లంటేనే భయమేస్తోంది.

- ఓ సోదరి

చిన్న వయసులో లైంగిక ఇబ్బందులకు గురైనప్పటికీ, దాన్ని పక్కన పెట్టి చదువు దెబ్బతినకుండా కృషి చేయడం మీ మానసిక దారుఢ్యాన్ని తెలియజేస్తోంది. చాలామంది అలాంటి సంఘటనలు తట్టుకోలేరు. చదువు మీద ధ్యాసపెట్టలేరు. కానీ మీ మనసులో ఆ బాధ, ఒత్తిడి ఉన్నప్పటికీ చదువెక్కడ మానిపిస్తారోనని అమ్మవాళ్లకు చెప్పకుండా దాన్ని అధిగమించడం అభినందనీయం. దీనిబట్టి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే స్థైర్యం మీలో ఉందని స్పష్టంగా తెలుస్తోంది. చిన్నప్పుడు వేధించిన ఆ చేష్టలు మాటి మాటికీ కళ్లముందు మెదలడం, పెళ్లయ్యాక సెక్స్‌ పరంగా ఎలా మెలగాలోనన్న భయంతో మీరు పెళ్లికి సుముఖత చూపడం లేదు. మీకు తెలియకుండా, మీ ప్రమేయం లేకుండా ఎవరో మీమీద దాడిచేశారు. అందులో మీ తప్పు ఎంతమాత్రం లేదని అర్థం చేసుకోండి. పాత విషయాలు మళ్లీ మళ్లీ గుర్తొస్తూ ప్రస్తుత జీవితానికి ఆటంకం కలగడాన్ని పోస్ట్‌ ట్రమాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌ అంటారు. వీటి నుంచి బయటపడి పెళ్లి చేసుకోవాలంటే అమ్మానాన్నలతో చర్చించండి. అసలు విషయం మొహమాటంతో చెప్పలేకపోయినా పెళ్లి గురించి భయాలున్నట్టు చెప్పి సైకియాట్రిస్టును సంప్రదించండి. శిక్షణ పొందిన కాగ్నెటివ్‌ బిహేవియర్‌ థెరపిస్ట్‌ను కలిస్తే మంచిది. మంచి జీవితాన్ని గడపగలిగేలా సాయం చేస్తారు. ఇది శరీరానికి సంబంధించిందే కానీ మనసుకు చెందింది కాదని అర్థం చేసుకుని దృఢంగా నిలబడండి. థెరపిస్టు సాయంతో మీ జీవితం సజావుగా సాగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని