ఆయన వల్ల.. చనిపోవాలనిపిస్తోంది!

నాకు పెళ్లయింది., ఇద్దరు పిల్లలు. నా భర్త ఇద్దరు మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈమధ్యే నాకూ తెలిసింది. గతంలోనూ ఎన్నోసార్లు మా మధ్య గొడవలు జరిగినా.. వాటిని అంతగా పట్టించుకునేదాన్ని కాదు. కానీ ఈ విషయం తెలిశాక నాకు అతనితో కలిసి ఉండాలనిపించటం లేదు.

Updated : 06 Nov 2023 10:26 IST

నాకు పెళ్లయింది., ఇద్దరు పిల్లలు. నా భర్త ఇద్దరు మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈమధ్యే నాకూ తెలిసింది. గతంలోనూ ఎన్నోసార్లు మా మధ్య గొడవలు జరిగినా.. వాటిని అంతగా పట్టించుకునేదాన్ని కాదు. కానీ ఈ విషయం తెలిశాక నాకు అతనితో కలిసి ఉండాలనిపించటం లేదు. విడాకులు తీసుకుని పిల్లలతో ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోవాలనుంది. మా ఇంట్లో వాళ్లేమో అందుకు ఒప్పుకోవడం లేదు. అతనేమో నాతో సరిగా ఉండట్లేదు. ఇంతకు ముందులాగా నాకు ఆయనతో చనువూ లేదు. మానసికంగా చాలా డిస్టర్బ్‌ అయ్యాను. నన్నెవరూ అర్థం చేసుకోవటం లేదని బాధగా ఉంది. యోగా, ధ్యానం వంటివి చేస్తూ ఆలోచనలను అదుపు చేసుకోవాలనుకున్నా.. నా వల్ల కావటం లేదు. చనిపోవాలని బలంగా అనిపిస్తోంది. పిల్లల భవిష్యత్తు తలచుకొని ఆగిపోతున్నా. ఈ పరిస్థితి నుంచి ఎలా బయట పడాలి? సలహా ఇవ్వండి.

ఓ సోదరి

మీ భర్తకి ఇద్దరితో వివాహేతర సంబంధం ఉందంటున్నారు. అది నిజమేనా? ఒకవేళ ఈ విషయాన్ని ఎవరైనా చెప్పుంటే.. అందులో ఎంతవరకూ నిజం ఉందో తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. నిజానిజాలు నిర్ధారించుకున్న తర్వాతే విడాకుల గురించి ఆలోచించండి. ముందు మీ తల్లిదండ్రులు, అత్తమామలతో ఒకసారి మాట్లాడండి. వాళ్ల ఆలోచనేంటో తెలుసుకోండి. ఆ తర్వాతే నిర్ణయానికి రండి. రెండోది మీకు డిప్రెషన్‌ ఎక్కువగా ఉంది. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు అందులో భాగమే. దానిపై దృష్టిపెట్టండి. కుటుంబ సభ్యులతో కలిసి ఒకసారి సైకియాట్రిస్ట్‌ను కలవండి. మీరు అత్యవసర పరిస్థితిలో ఉన్నారు. చికిత్స చాలా అవసరం. డిప్రెషన్‌లో ఉన్నవాళ్లకు ఆత్మహత్య ఆలోచనలు ఎప్పుడు వస్తాయో అంచనా వేయలేం. కాబట్టి అశ్రద్ధ చేయకుండా కౌన్సెలింగ్‌ తీసుకోండి. ఆ తర్వాత మీ భర్త మానసిక స్థితినీ, అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో కనుక్కోండి. ఇందుకు మీ ఇద్దరూ మ్యారిటల్‌ కౌన్సెలింగ్‌ తీసుకోవాలి. అప్పుడు అసలు విషయం తెలుస్తుంది. అతనూ తన ప్రవర్తన మార్చుకుంటారు. దీని ద్వారా మీరిద్దరికీ సఖ్యత కుదిరేలా చేయొచ్చు కూడా. అయినా మార్పు కనిపించకపోతే అప్పుడే విడిపోవడం గురించి ఆలోచించొచ్చు. మీ మీద ఆధారపడి ఇద్దరు పిల్లలున్నారు. వారికి మీ ప్రేమ, ఆప్యాయత, అండదండలు అవసరం. మీరు ఆత్మహత్యలాంటి తీవ్ర ఆలోచనలు చేస్తే అది మీ పిల్లల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. మానసిక వ్యధకు గురవుతారు. ముందు వాటి నుంచి బయటపడి.. ఆపై ఏం చేయాలన్నది నిర్ణయం తీసుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్