Divya Mittal IAS : అధికారిగా కాదు.. ఓ అమ్మగా చెబుతున్నా!

తమ పిల్లలు వ్యక్తిగతంగా, కెరీర్‌లో అత్యున్నత స్థానంలో ఉండాలనేదే తల్లిదండ్రులందరి తాపత్రయం! ఈ క్రమంలో వారిని పెంచి పెద్ద చేసే విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటాం.. వారికి కొన్ని వెసులుబాట్లు కల్పిస్తాం.. పిల్లల పెంపకం విషయంలో మనకు తెలియని....

Published : 26 Aug 2022 19:02 IST

(Photos: Instagram)

తమ పిల్లలు వ్యక్తిగతంగా, కెరీర్‌లో అత్యున్నత స్థానంలో ఉండాలనేదే తల్లిదండ్రులందరి తాపత్రయం! ఈ క్రమంలో వారిని పెంచి పెద్ద చేసే విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటాం.. వారికి కొన్ని వెసులుబాట్లు కల్పిస్తాం.. పిల్లల పెంపకం విషయంలో మనకు తెలియని విషయాల్ని మన పెద్ద వాళ్ల దగ్గర్నుంచి తెలుసుకోవడానికీ వెనకాడం. ఇలా తానూ తన తల్లి దగ్గర్నుంచి బోలెడన్ని విషయాలు నేర్చుకున్నానంటోంది ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి దివ్యా మిట్టల్‌. తన తల్లి పెంపకంలో తాను, తన ఇద్దరు తోబుట్టువులు అటు కెరీర్‌లో, ఇటు వ్యక్తిగత జీవితంలో బాగా స్థిరపడ్డారని.. ఆమె స్ఫూర్తితోనే తన ఇద్దరు కూతుళ్లను అత్యున్నతంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నానంటున్నారామె. ఇలా తాను పాటిస్తోన్న పేరెంటింగ్‌ సూత్రాల్ని వరుస ట్వీట్ల రూపంలో సోషల్‌ మీడియాలో పంచుకున్నారు దివ్య. దీంతో ఈ పోస్టులు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

దివ్యా మిట్టల్‌.. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని సంత్‌ కబీర్‌ నగర్‌ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమెకు ఇద్దరు కూతుళ్లు. అయితే తన కూతుళ్ల పెంపకం విషయంలో తన తల్లి నుంచే స్ఫూర్తి పొందానని చెబుతున్నారు దివ్య. తనను, తన ఇద్దరు తోబుట్టువుల్ని తన తల్లి అత్యుత్తమంగా తీర్చిదిద్దారని, అందుకే ఆమె సూత్రాల్నే తన పిల్లల పెంపకం విషయంలోనూ పాటిస్తున్నానని తాజాగా సోషల్‌ మీడియాలో వరుస ట్వీట్లు చేశారు దివ్య. అవేంటో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం..!

నా పేరెంటింగ్‌ సూత్రాలివే!

‘మా అమ్మ ముగ్గురు పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. మేమందరం ఐఐటీ, ఐఐఎంలలో విద్యనభ్యసించి.. ఇప్పుడు కెరీర్‌లో, వ్యక్తిగత జీవితంలో.. ఉన్నతంగా స్థిరపడ్డాం.. ఆమె స్ఫూర్తితోనే నేను నా పిల్లల్ని పెంచుతున్నాను. ఈ క్రమంలో నేను పాటిస్తోన్న కొన్ని పేరెంటింగ్‌ చిట్కాల్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నా. అవేంటంటే..!

పిల్లలు వారు చేసే ప్రతి పనిలోనూ వారిని ప్రోత్సహించాలి. ‘మీరు ఏదైనా సాధించగలర’న్న భరోసా వారికి అందించాలి. ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని, సంకల్ప బలాన్ని పెంచుతుంది. ఈ నమ్మకమే వారి అంతిమ లక్ష్యాన్ని నిర్ణయిస్తుంది.

పిల్లలు తప్పు చేస్తే చాలామంది పేరెంట్స్‌ దండిస్తుంటారు.. కానీ ఆ తప్పుల నుంచే వారు జీవితానికి ఉపయోగపడే ఎన్నో పాఠాలు నేర్చుకోగలుగుతారు. కాబట్టి వారిని పొరపాట్లు చేయనివ్వండి. అలాగే వారికి ఎదురయ్యే ప్రతి సవాలును అధిగమించే క్రమంలో మనం తోడుండచ్చు.. ఉండకపోవచ్చు. కాబట్టి సొంతంగా ఆ ఆపద నుంచి బయటపడే మార్గాల్ని స్వయంగా అన్వేషించుకునేలా వారిని వెన్నుతట్టాలి.

పిల్లలు ఓడిపోయిన ప్రతిసారీ నిరుత్సాహపరచకుండా.. తిరిగి ఆ పోటీలో పాల్గొనేలా ప్రోత్సహించాలి. ఆరోగ్యకరమైన పోటీతత్వం వారిని ఎప్పటికైనా విజయం దిశగా నడిపిస్తుంది.

పిల్లల్ని సాహసకృత్యాల్లో పాల్గొనేలా ప్రోత్సహించండి. దీనివల్ల ప్రమాదకర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో, వాటి నుంచి ఎలా బయటపడాలో స్వయంగా వారు నేర్చుకోగలుగుతారు.

పూర్వీకులు/ముందు తరం వారితో పిల్లల్ని పోల్చితే వారి మనసు నొచ్చుకుంటుంది. నిజానికి ఏ తరానికి ఉండే అవకాశాలు, సౌలభ్యాలు, వనరులు ఆ తరానికి పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ‘మా తరం, మా ముందు తరం వారంతా టీచర్‌ వృత్తిలో ఉన్నాం.. మీరూ ఈ రంగంలోకే రావాలం’టూ వారిపై ఒత్తిడి తేకుండా.. వారి మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేయండి.

పిల్లలు ఏదైనా పెద్ద వాళ్ల నుంచే నేర్చుకుంటారు. అందుకే మనమే వాళ్ల రోల్‌మోడల్స్‌ కావాలి. కాబట్టి మనం పొరపాటు చేస్తూ.. పిల్లల్ని మందలించడం కాకుండా.. మనం మంచి చేస్తూ వారినీ సన్మార్గంలో పెడదాం.. ఇలా తల్లిదండ్రులు చేసే పనులే పిల్లలకు మార్గనిర్దేశనం చేస్తాయి.

చిన్నారులు ప్రతిసారీ అదే తప్పు చేసినా, వారిలో ప్రవర్తన లోపాలున్నా సరిదిద్దడం తల్లిదండ్రుల బాధ్యత. దాన్ని ఎంత ఓపికతో నిర్వర్తిస్తే అంత మంచిది. అలాకాకుండా నిర్లక్ష్యం చేస్తే వారు పెడదోవ పట్టే అవకాశం ఉంటుంది.

ఏ అనుబంధాన్నైనా నిలబెట్టేది నమ్మకమే! పేరెంట్స్‌-పిల్లల మధ్యా ఇది కచ్చితంగా ఉండాల్సిందే! పిల్లల వ్యక్తిగత, చదువు, కెరీర్‌.. వంటి విషయాల్లో నిరాశ చెందకుండా.. ఆశతో, వారిపై నమ్మకంతో ముందుకుసాగితేనే ఇద్దరి మధ్య చక్కటి బంధం ఏర్పడుతుంది.

‘పెద్దవాళ్ల విషయాలు పిల్లల దాకా ఎందుకు?’ అనుకుంటారు చాలామంది. కానీ ఆ ఆలోచనను మనసులో నుంచి తొలగించి మీ పూర్వానుభవాలను వారితో పంచుకోండి.. అవి వారికి లోకం పోకడను తెలియజేస్తాయి.. వాటి నుంచి వారు జీవిత పాఠాల్నీ నేర్చుకోగలుగుతారు.

వినడం అనేది చాలా మంచి ప్రక్రియ. దీనివల్ల ఎదుటివారి నుంచి బోలెడన్ని విషయాలు తెలుసుకోవచ్చు. తల్లిదండ్రులు-పిల్లలు కూడా దీన్ని అలవాటు చేసుకోవాలి. ఒకరి మాటలు మరొకరు వినడం వల్ల ఇద్దరి మధ్య సఖ్యత పెరుగుతుంది. దాపరికం లేకుండా అన్ని విషయాలు పంచుకోగలుగుతారు. సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు.

చాలామంది తల్లిదండ్రులు చేసే పొరపాటు.. తమ పిల్లల్ని ఇతర చిన్నారులతో, తోబుట్టువులతో పోల్చడం. ఈ తప్పు అస్సలు చేయకూడదు. దీనివల్ల వారు పెద్దయ్యాక పలు సమస్యల్ని ఎదుర్కొంటారు. ఇది వారి ప్రవర్తనపైనా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.

పిల్లలు సురక్షితమైన, ప్రోత్సాహకరమైన వాతావరణంలో పెరగాలనుకుంటారు. అది అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే! అప్పుడే వారు ఇతరులతోనూ ప్రేమగా మెలుగుతారు.. ఇది వారికి జీవితంలో, కెరీర్‌ పరంగా ఉన్నతికి దోహదం చేస్తుంది.

ఈ చిట్కాలన్నీ మీరు మరింత మందితో పంచుకుంటే వాళ్లకూ ఇవి ఉపయోగపడతాయి..’ అంటూ దివ్య పెట్టిన పేరెంటింగ్‌ పాఠాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయంటూ ఎంతోమంది వీటికి రీట్వీట్లు చేస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని