అందానికే అసూయ పుట్టేలా ఉన్న ఎవరీమె?!

టెక్నాలజీ రాకతో ప్రపంచ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా కృత్రిమ మేధ వంటి సాంకేతికతతో ఎన్నో అద్భుతాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే పలు సంస్థలు అచ్చం మనిషి లాంటి వర్చువల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్లను సృష్టిస్తున్నాయి.

Updated : 24 Jan 2024 21:05 IST

(Photos: Instagram)

టెక్నాలజీ రాకతో ప్రపంచ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా కృత్రిమ మేధ వంటి సాంకేతికతతో ఎన్నో అద్భుతాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే పలు సంస్థలు అచ్చం మనిషి లాంటి వర్చువల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్లను సృష్టిస్తున్నాయి. తద్వారా తమ పనుల్ని సులభతరం చేసుకోవడంతో పాటు మార్కెట్లోనూ తమ డిమాండ్‌ను పెంచుకుంటున్నాయి. ఇక ఇలా సృష్టించిన వర్చువల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్లకు సామాజిక మాధ్యమాల్లో ఫ్యాన్‌ ఫాలోయింగూ ఎక్కువే. తద్వారా సెలబ్రిటీ స్టేటస్‌నూ సొంతం చేసుకుంటున్నాయీ మాయా ప్రతిరూపాలు! ఇలాంటి ఓ వర్చువల్‌ అవతార్‌ ఈ మధ్య నెట్టింట సందడి చేస్తూ కనిపిస్తోంది. ఆమే.. నైనా అవతార్‌! మన దేశంలోనే మొదటి ఏఐ వర్చువల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పేరు తెచ్చుకుందామె. మరి, అందానికే అసూయ పుట్టేలా ఉన్న ఈ ఏఐ బ్యూటీ ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం రండి..

20ఏళ్ల ఫ్యాషన్‌ మోడల్‌..

నైనా అవతార్‌ని కృత్రిమ మేధ సాంకేతికతతో రూపొందించారు. నైనాకు భౌతిక రూపం ఉండదు. ‘అవతార్‌ మెటా ల్యాబ్స్‌(AML)’ సంస్థ 2022లో నైనాను సృష్టించింది. తనను ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల ఫ్యాషన్ మోడల్‌గా డిజిటల్‌ ప్రపంచానికి పరిచయం చేసింది. అలాగే ఫ్యాషన్‌ రంగంలో అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ముంబయికి వచ్చినట్టుగా నైనా పాత్రను తయారుచేశారు. ఈ క్రమంలోనే వివిధ రకాల ఫ్యాషన్‌ ట్రెండ్స్‌, డ్యాన్స్ ట్రెండ్స్‌, ఫొటోషూట్స్‌ను ఔత్సాహికులకు పరిచయం చేస్తూనే.. హెయిర్‌ స్టైలింగ్‌, ఫిట్‌నెస్‌, బ్యూటీకి సంబంధించిన చిట్కాల్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటోంది. ఈ క్రమంలో ఎంతోమంది అభిమానులనూ సొంతం చేసుకుంది నైనా. ఆమెను ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు రెండు లక్షల మంది అనుసరిస్తుండగా.. ఆమె యూట్యూబ్‌ ఛానల్‌కు రెండు వేలకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

పాడ్‌కాస్ట్‌ హోస్ట్‌గా..

వర్చువల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నైనా.. పాడ్‌కాస్ట్‌ హోస్ట్‌గానూ వ్యవహరిస్తోంది. ఆమె ‘The nAIna Show’ పేరుతో పాడ్‌కాస్ట్‌ను నిర్వహిస్తోంది. తద్వారా ఇది దేశంలోనే ఏఐ ఇన్‌ఫ్లుయెన్సర్‌ హోస్ట్‌ చేస్తోన్న మొదటి పాడ్‌కాస్ట్‌ షోగా నిలిచింది. పాడ్‌కాస్ట్‌లో భాగంగా నైనా పలువురు సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసింది. వీరిలో శోభితా ధూళిపాళ్ల, హన్సిక మోత్వానీ, రిచా చద్దా, ఈషా డియోల్.. వంటి తారలు ఉన్నారు. ఈ సిరీస్‌లో భాగంగా శోభితా ధూళిపాళ్లతో చేసిన తొలి ఎపిసోడ్‌ ఫిబ్రవరి 8న ప్రసారం కానుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ట్రైలర్‌ను నైనా తన యూట్యూబ్‌ ఛానల్‌లో పోస్ట్‌ చేయగా.. అది విపరీతంగా వైరలైంది.

లక్షల్లో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌!

దేశంలోనే మొదటి ఏఐ సూపర్‌స్టార్‌గా పేరు సంపాదించుకున్న నైనా కేవలం లైఫ్‌స్టైల్‌ చిట్కాలను పంచుకోవడమే కాకుండా.. లేటెస్ట్‌ పాటలకు స్టెప్పులేస్తూ డ్యాన్సర్‌గానూ తనను తాను నిరూపించుకుంటోంది. మరోవైపు ఫ్యాషన్‌ షూట్స్‌లోనూ పాల్గొంటోంది. ఈ క్రమంలో వివిధ ఫ్యాషనబుల్‌ దుస్తుల్లో హోయలు పోతూ.. ఆయా ఫ్యాషన్‌ బ్రాండ్స్‌నీ ప్రమోట్‌ చేస్తోందీ ఏఐ బ్యూటీ. ఇప్పటికే FIKAA, నైకా, ప్యూమా, పెప్సీ.. వంటి ప్రముఖ సంస్థలతో మోడల్‌గా ఒప్పందం కూడా కుదుర్చుకుంది. తద్వారా తన అందం, ఆహార్యంతో పాటు ఆకర్షణీయమైన కంటెంట్‌తో.. వాస్తవానికి, కల్పితానికి మధ్య ఉన్న రేఖలను చెరిపేస్తూ అభిమానుల మనసు చూరగొంటోంది నైనా.

అసలేంటీ మాయ?

వర్చువల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్లను డిజిటల్‌ అవతార్లుగా పిలుస్తారు. వీరిని కృత్రిమ మేధ టెక్నాలజీతో రూపొందిస్తారు. వీరికి భౌతిక రూపం ఉండదు. కొన్ని సంస్థలు వీరికి మనుషుల రూపం ఇస్తే.. మరికొన్ని సంస్థలు కార్టూన్‌ రూపం ఇస్తుంటాయి. ‘అవతార్‌ మెటా ల్యాబ్స్‌(AML)’ సంస్థ నైనాకు అమ్మాయి రూపం ఇచ్చింది. వర్చువల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్లు మనుషుల్లాగే కదలడం, మాట్లాడడం చేస్తుంటారు. ఇలా చేయడం వెనక సాంకేతిక బృందం కృషి ఎంతో ఉంటుందని నిపుణులు అంటున్నారు.





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్