Published : 12/10/2021 20:39 IST

ఎక్కువ గంటలు పని చేస్తే ప్రాణాలకు ముప్పేనట!

‘ఏంటో ఈ ఆఫీస్‌ పని.. ఎంత చేసినా తరగదు’ అని విసుక్కుంటోంది ఓ కార్పొరేట్‌ కంపెనీలో టీమ్‌ లీడర్‌గా పని చేస్తున్న కోమలి. ప్రస్తుతం ఇంటి నుంచే పని చేస్తున్న ఆమె.. రోజువారీ పని పూర్తి చేసుకోవడానికి సుమారు 10-12 గంటలు వెచ్చిస్తోంది.
వాసవి ఇటీవలే ఉద్యోగంలో చేరింది. ప్రస్తుతం తాను చేస్తున్న ప్రాజెక్ట్‌ ఆమెకు కొత్త కావడంతో రోజువారీ పని పూర్తవడానికి కంపెనీ కేటాయించిన 9 గంటలు సరిపోవట్లేదామెకు.

ఉద్యోగంలో క్రమంగా పెరిగే బాధ్యతలు, సమయపాలన కొరవడడం, ఆలస్యంగా పనులు పూర్తిచేయడం.. ఇలా కారణమేదైనా చాలామంది పనివేళలు పూర్తయినా కంప్యూటర్‌ ముందు నుంచి కదలనే కదలరు. దీంతో ఇటు ఆఫీస్‌ పనులు, అటు ఇంటి పనులు సమయానికి పూర్తికాక విపరీతమైన ఒత్తిడికి లోనవుతారు. దీని ప్రభావం అంతిమంగా పడేది ఆరోగ్యం పైనే! ఇదే విషయాన్ని మరొక్కసారి గుర్తు చేస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో). ఇలాంటి అధిక పని గంటల కారణంగా దీర్ఘకాలిక అనారోగ్యాలే కాదు.. కొంతమందిలో ఇది మరణానికి సైతం దారి తీస్తోందని హెచ్చరిస్తోంది. వారానికి 55 గంటలు, అంతకు మించి పనిచేయడం వల్ల చాలామంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారని ఓ అధ్యయనంలో తేలింది. ఇందుకు అధిక పని గంటల కారణంగా తలెత్తే గుండె సంబంధిత సమస్యలే కారణమట!

 

కంప్యూటర్‌కే అతుక్కుపోతే ..

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో సుమారు 9 శాతం మంది నిర్ణీత పని గంటల కంటే ఎక్కువ సమయం పని చేస్తున్నారని ఓ అధ్యయనం చెబుతోంది. ఇలా అధిక పని గంటలతో గుండె సమస్యలు తలెత్తి అవి మరణానికి దారి తీయడానికి అనారోగ్యకరమైన ఆహారపుటలవాట్లు, నిద్రలేమి, శారీరక శ్రమ కొరవడడం వంటివి కారణమంటోంది.

కరోనా నేపథ్యంలో ఇప్పటికీ చాలామంది ఇంటి నుంచే పని చేస్తూ గంటల తరబడి కంప్యూటర్‌కే అతుక్కుపోతున్నారట! తద్వారా ఎవరికి వారే ప్రాణ సంకటం కొనితెచ్చుకుంటున్నారని చెబుతున్నారు నిపుణులు. అయితే ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే సంస్థలు, ఉద్యోగులు రియలైజ్‌ అయి.. పని గంటల్ని తగ్గించుకోవాలని.. వేళకు పని పూర్తి చేసేలా ప్రణాళిక వేసుకోవాలని.. తద్వారా ఇటు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండడంతో పాటు పని ఒత్తిడిని తగ్గించుకుని చక్కటి ఉత్పాదకతను సైతం సంస్థకు అందించచ్చని చెబుతున్నారు నిపుణులు.

వేళకు పని పూర్తి కావాలంటే..!

అధిక పనిగంటలతో అనవసరంగా ప్రాణాల మీదకు తెచ్చుకోకుండా.. కంపెనీ అప్పగించిన పనుల్ని వేళకు పూర్తి చేస్తే ఏ సమస్యా ఉండదంటోంది యూకేకు చెందిన నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌). మరి, ఇది సాధ్యం కావాలంటే కొన్ని చిట్కాలు పాటించమని చెబుతోంది. అవేంటంటే..!

పక్కా ప్లానింగ్‌తో!

ఒక పనిని దిగ్విజయంగా పూర్తి చేయాలంటే అందుకు తగిన ప్రణాళిక వేసుకోవడం తప్పనిసరి. రోజువారీ ఆఫీస్‌ పనులు పూర్తి చేయడానికీ ఇలాంటి ప్లానింగే అవసరం. ఈ క్రమంలో ఆ రోజు చేయాల్సిన పనుల్లో ముఖ్యమైన పనుల్ని ముందు పెట్టుకొని.. మిగతా పనుల్ని ఆఖర్లో పెట్టుకోవాలి. తద్వారా ఇవి పూర్తికాకపోయినా మరుసటి రోజు చేసుకోవచ్చు. వేళకు పని పూర్తి కావడానికి ఇదీ ఓ మార్గమే. అలాగే ఉదయం నిద్ర లేవడం, బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌, ఇతర పనులకు.. ఇలా ఒక్కో పనికి ఒక్కో సమయాన్ని ఫిక్స్‌ చేసుకొని దాన్ని పకడ్బందీగా పాటిస్తే ఎలాంటి సమస్యా ఉండదు.

టెన్షన్‌ పడకండి!

‘వామ్మో.. ఈ పనులన్నీ నేనెప్పుడు పూర్తి చేస్తాను!’ అని టెన్షన్‌ పడినా వేళకు పనులు పూర్తి కావు. కాబట్టి ముందు మనసులో నుంచి ఇలాంటి ఒత్తిడి, ఆందోళనల్ని దూరం చేసుకోవాలి. ఇందుకోసం పని మధ్యలో విరామం తీసుకోవడం తప్పనిసరి. ఆ సమయంలో ఓ కప్పు కాఫీ/టీ తీసుకోవచ్చు.. లేదంటే అలా పచ్చగడ్డిపై నడుస్తూ ఓ ఐదు పది నిమిషాలు మీకు నచ్చిన వారితో ఫోన్లో మాట్లాడచ్చు.. ఇలా చేయడం వల్ల మనసు రిలాక్సై మరింత చురుగ్గా మారుతుంది. పనులన్నీ చకచకా పూర్తి కావడానికి ఈ చురుకుదనమే అవసరం!

ఈ రెండింటినీ కలపద్దు!

ఇంటి నుంచి పనిచేసే మహిళలు ఇటు ఇంటి పనులు, అటు ఆఫీస్‌ పనులతో సతమతమవుతున్నారు. ఉన్న సమయం సరిపోక.. ఆఫీస్‌ పనులు చేస్తూనే వంట చేయడం లేదంటే ఇంట్లో ఉండే పెద్దవారిని/పిల్లల్ని చూసుకోవడం.. వంటివి చేస్తుంటారు. ఇలా చేస్తున్న పనిపై నుంచి మనసు వేరే వైపుకి మళ్లితే ఇక ఆ పని ఎంతకీ ముందుకెళ్లదు. వర్క్‌ ఫ్రమ్ హోమ్ చేస్తోన్న చాలామంది పని ఆలస్యంగా పూర్తి కావడానికి ఇదీ ఓ కారణమే! కాబట్టి ఇంటి పనుల్ని, ఆఫీస్‌ బాధ్యతల్ని అస్సలు కలపకూడదు. దేనికదే విడివిడిగా సమయం కేటాయించుకొని పూర్తి చేసేలా ప్లాన్‌ చేసుకుంటే గంటల తరబడి చేస్తోన్న ఆఫీస్‌ పనికి స్వస్తి చెప్పచ్చు.

‘4D’ రూల్‌ పాటిస్తున్నారా?

పనివేళ్లలో వ్యక్తిగతంగానైనా, వృత్తిపరంగానైనా ఈ-మెయిల్స్‌ చెక్‌ చేసుకోవడం చాలామందికి అలవాటే! ఈ క్రమంలో గంటలకొద్దీ సమయం వెచ్చించేవారూ లేకపోలేదు. నిజానికి ఇక్కడే చాలా సమయం వృథా అవుతుంది.. తద్వారా అసలు పని పూర్తవడానికి ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తుంది. కాబట్టి ఈ పరిస్థితిని అధిగమించాలంటే ‘4D’ రూల్‌ చక్కటి పరిష్కారం! ఇందులో భాగంగా..

Delete : వచ్చిన ఈ-మెయిల్స్‌లో అనవసరమైనవే (Spam Emails వంటివి) సగానికి పైగా ఉంటాయి. కాబట్టి వాటిని లోతుగా చూడాల్సిన అవసరం ఉండదు. చకచకా డిలీట్‌ చేసేస్తే సరి!

Do : కొన్ని ఈ-మెయిల్స్‌కి సత్వరమే ప్రతిస్పందించాల్సి ఉంటుంది. సో.. అలాంటి వాటికి వెంటనే రిప్లై పంపించేస్తే ఓ పనైపోతుంది.

Delegate : మీరే స్వయంగా చూడాల్సిన అవసరం లేని కొన్ని మెయిల్స్‌ని మీ సహోద్యోగులకు/ కింది ఉద్యోగులకు ఫార్వర్డ్‌ చేయచ్చు. లేదా అలాంటి మెయిల్స్ నేరుగా వారికే వచ్చే ఏర్పాటు చేసుకోవచ్చు.

Defer : అప్పటికప్పుడు చెక్‌ చేయాల్సిన అవసరం లేని మెయిల్స్‌కి ఆఖరి ప్రాధాన్యమిచ్చి.. మీకు సమయం దొరికినప్పుడు వాటిని తీరిగ్గా చూడచ్చు.

ఈ ఆలోచనలు సరికాదు!

‘ఇంటి నుంచే పని చేస్తున్నాం కదా.. కాస్త లేటైనా పర్లేదు..’, ‘ఎక్కడో ఒక చోట కూర్చొని పని చేద్దాంలే’.. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తోన్న ఉద్యోగుల్లో చాలామంది ఇలాంటి భావనలోనే ఉన్నారు. ఎక్కువ గంటలు పనిచేయాల్సి రావడానికి ఇదీ ఓ కారణమే! కాబట్టి ఈ ఆలోచనల్లో నుంచి ఎంత త్వరగా బయటకొస్తే అంత మంచిది. ఇంట్లో నుంచి పని చేసినా పక్కా ప్రణాళికతో సమయానికి పనులు పూర్తి చేసుకోవడం, అనువుగా పని చేసుకునేందుకు వీలుగా ఇంట్లోనే ఓ గదిలో ఆఫీస్‌ సెటప్‌ చేసుకోవడం.. ఈ రెండూ ముఖ్యమే! తద్వారా బయటి నుంచి, ఇతర కుటుంబ సభ్యుల నుంచి పనికి ఎలాంటి ఆటంకం ఉండదు.. ఫలితంగా పనులు వేళకు పూర్తవుతాయి.

ఇక వీటితో పాటు రోజూ ఉదయాన్నే కాస్త సమయం వ్యాయామం-ధ్యానం.. వంటి వాటికి కేటాయించడం, వారాంతాల్లో కూడా పనితో పరిగెత్తకుండా కుటుంబ సభ్యులతో సమయం గడపడం వల్ల మనసూ ఉత్సాహంగా ఉంటుంది. దీని ప్రభావం మరుసటి రోజు పనిపై సానుకూలంగా పడుతుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి