అవకాశమొస్తే మళ్లీ ఆ జీవితాన్నే ఎంచుకుంటా!

భవిష్యత్తుపై బోలెడు ఆశలు పెట్టుకున్న ఆమెను 22 ఏళ్లకే విధి వెక్కిరించింది. ఒంటికాలితో జీవితాన్ని అంధకారం చేయాలనుకుంది. అయితే కష్టాలు, కన్నీళ్లు ఆమెను మరింత కఠినంగా మార్చాయి. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసాన్ని అందించాయి. అందుకే కృత్రిమ కాలితోనే బ్యాడ్మింటన్‌ రాకెట్‌ పట్టుకుని బరిలోకి దిగింది. మొండి పట్టుదలతో పతకాల వేట.....

Published : 09 Mar 2022 18:30 IST

(Photo: Instagram)

భవిష్యత్తుపై బోలెడు ఆశలు పెట్టుకున్న ఆమెను 22 ఏళ్లకే విధి వెక్కిరించింది. ఒంటికాలితో జీవితాన్ని అంధకారం చేయాలనుకుంది. అయితే కష్టాలు, కన్నీళ్లు ఆమెను మరింత కఠినంగా మార్చాయి. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసాన్ని అందించాయి. అందుకే కృత్రిమ కాలితోనే బ్యాడ్మింటన్‌ రాకెట్‌ పట్టుకుని బరిలోకి దిగింది. మొండి పట్టుదలతో పతకాల వేట కొనసాగించింది. ఆమే పారా అథ్లెట్‌ మానసి జోషి. ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతార’న్నట్లు.. తన శారీరక లోపాన్ని అధిగమించి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై దేశానికి పతకాల పంట పండిస్తోంది. ఇందుకు ప్రతిగానే బీడబ్ల్యూఎఫ్‌ తాజాగా ప్రకటించిన ‘పారా బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్‌ సింగిల్స్‌’లో అగ్రస్థానాన్ని దక్కించుకుందీ స్మాషర్‌. ఈ నేపథ్యంలో విధిని ఓడించి జీవితాన్ని గెలిచిన ఈ రాకెట్‌ క్వీన్‌ కథేంటో తెలుసుకుందాం రండి..

ఆరేళ్ల వయసులోనే రాకెట్‌ పట్టుకుంది!

మానసి తండ్రి గిరీష్ చంద్ర జోషి స్వతహాగా బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌. ఇలా తన రక్తంలోనే ఈ క్రీడను అణువణువునా నింపుకొన్న ఆమె.. ఆరేళ్ల వయసులోనే రాకెట్‌ పట్టుకుంది. తన తండ్రితో కలిసి గేమ్‌ ఆడేది. ఓవైపు ఉన్నత చదువులు చదువుతూనే.. మరోవైపు క్రీడల్లోనూ రాణించింది. ముంబయిలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఎలక్ర్టానిక్స్‌ విభాగంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాక ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఉద్యోగినిగా కెరీర్‌ ఆరంభించింది. అయితే ఉద్యోగంలో చేరిన కొద్ది రోజులకే రోడ్డు ప్రమాదానికి గురైంది మానసి. 2011 డిసెంబర్‌ 2న ద్విచక్రవాహనంపై ఆఫీసుకు వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. ఆమె కింద పడిపోవడం, ఎడమకాలిపై నుంచే లారీ వెళ్లడంతో ఆ కాలు పూర్తిగా ఛిద్రమైంది. ఆస్పత్రికి తీసుకెళ్లేసరికి మరింత ఆలస్యం కావడంతో వైద్యులు ఎంత కష్టపడినా ఫలితం లేకుండా పోయింది. మొత్తం 45 రోజుల పాటు ఎన్ని చికిత్సలు చేసినా ఎడమకాలిని మాత్రం తిరిగి పొందలేకపోయిందీ పారా అథ్లెట్.

కృత్రిమ కాలితో!

ఇలా విధి ఆమె ఎడమకాలిని తీసుకెళ్లి తన బంగారు భవిష్యత్తుకు అడ్డుపుల్ల వేసింది. దీంతో చాలా రోజుల పాటు నాలుగ్గోడలకే పరిమితమైపోయింది మానసి. అయితే అలాగే ఉంటే లాభం లేదనుకుంది. ఆత్మవిశ్వాసంతో కఠిన పరిస్థితులను అధిగమించాలనుకుంది. ఈ పట్టుదలతోనే ఓ ప్రోస్థటిక్ కాలును అమర్చుకొని తనకు ఇష్టమైన బ్యాడ్మింటన్‌పై ఆసక్తి పెంచుకుంది. ఈ క్రమంలో మొదట తన తండ్రితో కలిసి సాధన చేసింది. ఆ తర్వాత ఓ పారా బ్యాడ్మింటన్ ప్లేయర్‌ ప్రోత్సాహంతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. 2018లో హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో చేరి తన ఆటకు మరిన్ని మెరుగులు దిద్దుకుందీ రాకెట్‌ క్వీన్‌. పారా బ్యాడ్మింటన్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ టోర్నీతో పాటు ఎన్నో అంతర్జాతీయ పతకాలు సాధించింది. తన ప్రతిభకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు, పురస్కారాలు కూడా సొంతం చేసుకుందీ పారా షట్లర్.

ప్రపంచ నం.1!

‘ఏషియన్‌ ఛాంపియన్‌షిప్స్‌’, ‘ఏషియన్‌ పారా గేమ్స్‌’, ‘ఇంటర్నేషనల్‌ ఛాంపియన్‌షిప్స్‌’లో కాంస్య పతకాలు గెలుచుకున్న మానసి.. 2019లో బీడబ్ల్యూఎఫ్‌ పారా బ్యాడ్మింటన్‌ ప్రపంచకప్‌లో తొలి స్వర్ణం చేజిక్కించుకుంది. ఇక ఇటీవల ‘స్పానిష్‌ ఇంటర్నేషనల్‌ ఈవెంట్‌’ మహిళల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌-3 విభాగంలో బంగారు పతకం గెలుచుకుంది. అలాగే ఇవే పోటీల్లో డబుల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగాల్లో రజత పతకాలు సాధించింది. ఇలా తన ప్రతిభతో కెరీర్లో దూసుకుపోతోన్న ఆమె.. బీడబ్ల్యూఎఫ్‌ తాజాగా ప్రకటించిన ‘పారా బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్‌ సింగిల్స్‌’లో తొలి ర్యాంక్‌ను చేజిక్కించుకుంది. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవానికి (డిసెంబర్ 3) ఒక్క రోజు ముందు జరిగిన ప్రమాదంలో కాలు కోల్పోయిన తాను.. ఏటా ఈ రోజున తనకంటూ కాస్త సమయం కేటాయించుకొని.. తన జీవితం తనకు నేర్పిన పాఠాల్ని నెమరు వేసుకుంటానంటోంది.

బార్బీ డాల్!

* 2019, డిసెంబర్‌ 3న రాష్ట్రపతి చేతుల మీదుగా ‘ఉత్తమ పారా అథ్లెట్‌’గా జాతీయ పురస్కారం అందుకుంది మానసి. అలాగే ‘బీబీసీ స్పోర్ట్స్‌ ఉమన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ - 2019’ అవార్డుతో పాటు 2020లో ప్రకటించిన ‘బీబీసీ-100 విమెన్‌’, ‘ఫోర్బ్స్‌ ఇండియా సెల్ఫ్‌ మేడ్‌ విమెన్‌’ జాబితాల్లోనూ చోటు దక్కించుకుంది. ప్రఖ్యాత టైమ్ పత్రిక నవతరం నాయకత్వ లక్షణాలున్న మేటి మహిళగా, ఆసియాలోని ప్రభావశీలురైన వ్యక్తుల్లో ఒకరిగా మానసిని గుర్తించింది.

* ఇక ఇంట్లో ఉన్నప్పుడూ సాధనను మరవనంటోన్న మానసి.. పుస్తకాలు చదవడం, గార్డెనింగ్‌, క్లీనింగ్‌.. వంటి పనులూ చేస్తానంటోంది.

* అమెరికాకు చెందిన బార్బీ కంపెనీ మానసి సాధించిన విజయాలకు గుర్తింపుగా ఆమె పోలికలతో ఓ బార్బీ బొమ్మను రూపొందించి.. అత్యంత ప్రభావశీలురైన మహిళల్లో ఒకరిగా స్థానం కల్పించింది.

* ‘ప్రమాదానికి ముందు, తర్వాత.. ఈ రెండింటిలో మీరు ఏ జీవితాన్ని ఎంచుకుంటారు?’ అని ఎవరైనా అడిగితే కచ్చితంగా ప్రమాదానికి ముందు గడిపిన జీవితాన్నే ఎంచుకుంటానని చెబుతోందీ పారా అథ్లెట్.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్