Updated : 05/11/2021 17:56 IST

అందుకే కార్తీకం అంత పవిత్రం!

ఆస్తిక లోకంలో కార్తీక మాసానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ నెలలో చేసే వ్రతాల వల్ల పుణ్య సముపార్జన సులభతరం అవుతుందని కార్తీక పురాణంతో పాటు మరికొన్ని వ్రత గ్రంథాలు వివరిస్తున్నాయి. శరదృతువు ఉత్తరార్ధంలో వచ్చే కార్తీకమాసంలో ప్రతిరోజూ ఓ పర్వదినమే. ఈ కార్తీకమాసంతో సమానమైన మాసం లేదని అత్రి మహర్షి అగస్త్యుడికి వివరించినట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి. నెల రోజులపాటు కార్తీక పురాణాన్ని రోజుకొక అధ్యాయం వంతున చదవటం, వినటం వల్ల ఎంతో మేలు జరుగుతుందని చెబుతారు.

పవిత్ర స్నానాలకు ప్రత్యేకత అదే!

కార్తీకమాసంలో నదీస్నానం, ఉపవాసం, పురాణ పఠన శ్రవణాలు, దీపారాధన, దీప దానం, సాలగ్రామ పూజ, దైవపూజ, వన సమారాధన లాంటివన్నీ జరపాలి. విష్ణువు ఆషాఢ శుక్ల దశమినాడు పాల కడలిలో శేషతల్పం మీద యోగనిద్రలోకి వెళ్లి తిరిగి కార్తీక శుక్ల ద్వాదశినాడు నిద్ర నుంచి లేస్తాడంటారు. అందుకే ఈ మాసానికి మరింత ప్రాముఖ్యాన్నిస్తారు భక్తులు. ఈ మాసంలో చెరువులు, బావులు, దిగుడు బావులు, పిల్ల కాలువలు అన్నింటా శ్రీ మహావిష్ణువు నివసిస్తాడంటారు. ఈ కారణంగానే పవిత్ర స్నానాలకు ఈ మాసంలో ఓ ప్రత్యేక స్థానముంది. కార్తీకంలో శివాలయంలోనైనా, వైష్ణవాలయంలోనైనా సంధ్యా సమయంలో దీపం పెట్టి స్వామిని పూజిస్తే మేలు జరుగుతుందంటారు. కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తే పాపనాశనం, మోక్ష ప్రాప్తి లభిస్తుందంటారు. ఈ మాసంలో వచ్చే సోమవారానికి మరింత విశిష్టత ఉంది. ఆ రోజున చేసే స్నాన, దాన, జపాదులు అధిక ఫలితాన్నిస్తాయి. ఆలయాలలో చేసే దీపమాలిక సమర్పణం కూడా సర్వపాప హరణం అని చెబుతారు.

అభిషేకంతో పాటు...

ఈ మాసంలో తులసి దళాలు, గంధంతో సాలగ్రామాన్ని అర్చించటం క్షేమదాయకం. సాలగ్రామాన్ని ఉసిరిచెట్టు కింద కూడా పూజించటం శ్రేయస్కరం. కార్తీకంలో శివుడికి ప్రత్యేకంగా అభిషేకాలతో పాటుగా తులసి, జాజి, మారేడు, అవిశె పూలు, మల్లె, గరిక తదితరాలతో పాటు గంధ పుష్ప ధూప దీపాలతో అర్చన చేస్తారు. వన సమారాధన చేసేటప్పుడు ఉసిరి చెట్టును పూజించటం వల్ల యముడి బారి నుంచి బయట పడవచ్చంటారు. ఈ మాసంలో చేసే హిరణ్య, రజత, తామ్ర, కాంస్య, ఉసిరి, దీప, లింగ, ధాన్య, ఫల, ధన, గృహ దానాలు మామూలు సమయాలకన్నా అధిక ఫలితాన్నిస్తాయి. కార్తీకమాసంలో తొలి రోజు నుంచి చివరి రోజు దాకా ఏ రోజున ఏ వ్రతం చేయాలో, ఎలాంటి నియమాలను పాటించాలో కార్తీక పురాణం వివరిస్తోంది. ఈ పురాణంలో ఉన్న అనేకానేక కథలు పురాణ మహత్యాన్ని వివరిస్తున్నాయి.

సోమవార వ్రతం ఎన్ని రకాలు?

* కార్తీక మాసం నెలరోజులు చేయాల్సిన విధులను, వ్రతాలను కార్తీక పురాణం పేర్కొంటోంది. ఒకటో రోజున అర్చన, అగ్ని పూజ నిర్వహించాలి. సాయంత్రం పూట విధిగా ఆలయంలో దీపం పెట్టి దేవుడికి నైవేద్యాలను సమర్పించి స్తుతించాలి. ఇలా కార్తీకమాసం మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా చెయ్యాలి.

* కార్తీక పురాణంలో రెండో అధ్యాయంలో వశిష్టుడు కార్తీక సోమవారం వ్రతాన్ని గురించి చెప్పాడు. సోమవారం వ్రతం మొత్తం ఆరు విధాలుగా చేసుకోవచ్చని వివరించాడు. ఉపవాసం, ఏకభుక్తం, నక్తం, అయాచితం, స్నానం, తిలాదానం అనే ఆరు రకాలుగా సోమవార వ్రతం ఉంటుంది.

* కార్తీక సోమవారం నాడు పగలంతా భోజనం చేయకుండా ఉపవాసంతో గడిపి సాయంత్రం వేళ శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనం అయ్యాక తులసి తీర్థాన్ని మాత్రమే సేవించడం ఉపవాసంగా చెబుతారు.

* అలా చేయటం సాధ్యం కాని వాళ్లు ఉదయం పూట యథా ప్రకారం స్నాన, దాన, జపాలను చేసి మధ్యాహ్నం భోజనం చేసి రాత్రికి మాత్రం శివ తీర్థాన్నో, తులసి తీర్థాన్నో ఏదో ఒకటి మాత్రం స్వీకరిస్తారు. ఇలా చేయటాన్ని ఏకభుక్తం అని అంటారు.
* పగలంతా ఉపవాసంతో గడిపి రాత్రి నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భోజనం చేయటాన్ని నక్తం అని అంటారు.

* తమకు తాము భోజనం కోసం ప్రయత్నించకుండా ఎవరైనా పిలిచి భోజనం పెడితే తినవచ్చు. దీన్నే అయాచితం అని పిలుస్తారు.

* ఉపవాసం, ఏకభుక్తం, నక్తం, అయాచితం అనే నాల్గింటిలో ఏదీ చెయ్యలేని వారు కార్తీక సోమవారం నువ్వులు దానం చేసినా సరిపోతుంది. దీనినే తిలాదానం అంటారు.

* ఈ ఆరు విధానాల్లో కనీసం ఏదో ఒకటైనా ఆచరించి తీరటం శ్రేయస్కరమని శివపురాణం చెబుతోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని