వీటిని రోజూ వాడకూడదట.. ఎందుకో తెలుసా?

డ్రై షాంపూ, ప్రైమర్, మెడికేటెడ్ లిప్‌బామ్, డీప్ కండిషనర్, ప్రొటీన్ అధికంగా ఉండే కేశ సంబంధిత ఉత్పత్తులు, ఎక్స్‌ఫోలియేటింగ్ ఉత్పత్తులు.. ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మాయిలు సౌందర్య పోషణలో భాగంగా ఉపయోగించే ఉత్పత్తుల జాబితా చాంతాడంత అవుతుంది. అయితే కొన్ని ఉత్పత్తులను మాత్రం రోజూ ఉపయోగించడం అంత శ్రేయస్కరం కాదంటున్నారు సౌందర్య నిపుణులు....

Published : 16 Aug 2023 18:17 IST

తమ సౌందర్య పోషణలో రకరకాల ఉత్పత్తులను భాగం చేసుకుంటారు అమ్మాయిలు. అయితే కొన్ని ఉత్పత్తులను రోజూ ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాల కంటే హానే ఎక్కువగా ఉంటుందంటున్నారు సౌందర్య నిపుణులు. ఇంతకీ ఆ ఉత్పత్తులేంటి? వాటి వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయో తెలుసుకోవాలంటే ఇది చదివేయాల్సిందే..

డ్రై షాంపూ, ప్రైమర్, మెడికేటెడ్ లిప్‌బామ్, డీప్ కండిషనర్, ప్రొటీన్ అధికంగా ఉండే కేశ సంబంధిత ఉత్పత్తులు, ఎక్స్‌ఫోలియేటింగ్ ఉత్పత్తులు.. ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మాయిలు సౌందర్య పోషణలో భాగంగా ఉపయోగించే ఉత్పత్తుల జాబితా చాంతాడంత అవుతుంది. అయితే కొన్ని ఉత్పత్తులను మాత్రం రోజూ ఉపయోగించడం అంత శ్రేయస్కరం కాదంటున్నారు సౌందర్య నిపుణులు.

స్క్రబ్..
స్క్రబ్ చేయడం వల్ల చర్మంపై పేరుకొన్న మృతకణాలు, మలినాలు.. తొలగిపోయి చర్మం శుభ్రపడుతుంది. అలాగే ప్రకాశవంతంగానూ కనిపిస్తుంది. అలాగని రోజూ స్క్రబ్ చేస్తే కలిగే ప్రయోజనాల కంటే హానే ఎక్కువగా ఉంటుంది. చర్మం పొడిబారడం, నిర్జీవంగా మారడం, పెళుసుబారడం, ఎర్రబడడం.. మొదలైన లక్షణాలు కనిపిస్తే ఎక్స్‌ఫోలియేషన్‌కి సంబంధించిన ఉత్పత్తులను అధికంగా ఉపయోగిస్తున్నారని అర్థం. చర్మాన్ని శుభ్రపరిచి ప్రయోజనం చేకూరుస్తున్నప్పటికీ స్క్రబ్‌ని వారానికి రెండు లేదా మూడుసార్లకు మించి ఉపయోగించకూడదు.

ప్రైమర్..
మేకప్ ఎక్కువ సమయం నిలిచి ఉండాలన్నా, మంచి లుక్ రావాలన్నా ప్రైమర్ తప్పనిసరిగా అప్త్లె చేసుకోవాల్సిందే. అయితే దీనిని రోజూ ఉపయోగించడం అంత మంచిది కాదంటున్నారు సౌందర్య నిపుణులు. ఎందుకంటే దీనిలో ఉండే సిలికాన్ చర్మగ్రంధులను మూసుకుపోయేలా చేయడం వల్ల చర్మం పొడిబారినట్లుగా మారుతుందట! కాబట్టి ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే దీనిని ఉపయోగించడం మంచిది. అలాగే ప్రైమర్ ఉపయోగించిన ప్రతిసారీ అది పూర్తిగా తొలగిపోయే వరకు శుభ్రం చేసుకోవడం కూడా తప్పనిసరి.

వాటర్‌ప్రూఫ్ మస్కారా..
ఐ మేకప్‌లో భాగంగా వాటర్‌ప్రూఫ్ మస్కారాను ఉపయోగిస్తున్నట్లయితే కాస్త జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే అది కనుబొమ్మల్లో ఉండే సహజసిద్ధమైన తేమని హరించడమే కాకుండా అవి పొడిబారిపోయేలా కూడా చేస్తుంది. కాబట్టి దీనిని కూడా రోజూ ఉపయోగించకూడదు. మరీ అవసరం అనుకుంటే ముందుగా సాధారణ మస్కారా ఒక కోటింగ్ అప్త్లె చేసుకున్న తర్వాత దాని మీద వాటర్‌ప్రూఫ్ మస్కారా అప్త్లె చేసుకోవచ్చు. అయితే రాత్రి పడుకొనే ముందు మాత్రం దీనిని తప్పనిసరిగా తొలగించాల్సిందే..!

డ్రై షాంపూ..
తలస్నానం చేసే సమయం లేకపోయినా.. తక్కువ సమయంలో కేశాలను తాజాగా కనిపించేలా చేయాలన్నా డ్రై షాంపూని ఉపయోగించడం సహజం. అయితే దీనిని కూడా రోజూ ఉపయోగించకూడదట! వరుసగా రెండు రోజులకు మించి దీనిని వాడకూడదు. ఇలా చేయడం వల్ల కేశాలు నిర్జీవంగా తయారై, అట్టకట్టినట్లు కనిపించడమే కాదు.. త్వరగా రాలిపోతాయి కూడా అంటున్నారు నిపుణులు. అలాగే దీనిని ఉపయోగించిన తర్వాత కూడా షాంపూతో తలస్నానం చేసి, మంచి కండిషనర్ అప్త్లె చేసుకుంటే మంచిది అని సలహా ఇస్తున్నారు.

డీప్ కండిషనర్..
పొడిబారిన కురులకు తేమనందించి తిరిగి సాధారణ స్థితికి తెచ్చేందుకు డీప్ కండిషనర్స్‌ని ఉపయోగిస్తుంటారు. అయితే వీటిని రోజూ ఉపయోగించడం వల్ల కురులు పొడిబారిపోతాయట! కేశాల్లో ఉండే పీహెచ్ స్థాయులపై కండిషనర్ ప్రభావం చూపడం వల్లే అలా జరుగుతుందంటున్నారు నిపుణులు. ఒకవేళ కురులకు పోషణ తప్పనిసరిగా అందించాలనుకునే పక్షంలో కొబ్బరినూనెని కూడా అందుకు ఉపయోగించవచ్చు.

ప్రొటీన్ అధికంగా ఉండే ఉత్పత్తులు..
కురులు ఒత్తుగా, ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రొటీన్ అధికంగా ఉన్న ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు చాలామంది అమ్మాయిలు. అయితే వీటిని కూడా రోజూ వినియోగించడం సరికాదంటున్నారు సౌందర్య నిపుణులు. ప్రొటీన్స్ ఎక్కువైతే కురులు ఆరోగ్యంగా ఉండడం కాకుండా పూర్తిగా రాలిపోవడమే అందుకు కారణం. కేశాల్లో సహజసిద్ధంగా ఉండే తేమ స్థాయులను ప్రొటీన్లు ప్రభావితం చేయడం వల్లే కురులు పెళుసుబారినట్లుగా మారి రాలిపోతాయట. కాబట్టి ఈ తరహా ఉత్పత్తులను రోజూ కాకుండా సందర్భానుసారంగా మాత్రమే ఉపయోగించాలి.

ఇవే కాదు.. హెవీ కాంటూరింగ్, పెట్రోలియం జెల్లీ, మెడికేటెడ్ లిప్‌బామ్స్, మ్యాటీ లిప్‌స్టిక్.. మొదలైన ఉత్పత్తులు కూడా రోజూ ఉపయోగించకూడదంటున్నారు నిపుణులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్