పిల్లలతో ఈ మాటలు వద్దు..!

పిల్లలు సున్నిత మనస్కులు. వారిపై చిన్న విషయం కూడా పెద్ద ప్రభావం చూపుతుంది. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల తప్పులను సరిదిద్దడానికి వారిని తరచుగా కొన్ని మాటలు అంటుంటారు. ఇది వారి మంచికోసమే అయినా వారి మనసుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంటాయి. ముఖ్యంగా కొన్ని పదాలు పిల్లలను మొండిగా.....

Updated : 22 Nov 2022 20:52 IST

పిల్లలు సున్నిత మనస్కులు. వారిపై చిన్న విషయం కూడా పెద్ద ప్రభావం చూపుతుంది. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల తప్పులను సరిదిద్దడానికి వారిని తరచుగా కొన్ని మాటలు అంటుంటారు. ఇది వారి మంచికోసమే అయినా వారి మనసుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంటాయి. ముఖ్యంగా కొన్ని పదాలు పిల్లలను మొండిగా మార్చేస్తుంటాయంటున్నారు నిపుణులు. కాబట్టి, పిల్లలతో కొన్ని పదాలు ఎక్కువగా ఉపయోగించకూడదని సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఆ పదాలేంటో, వాటికి బదులుగా ఎలా మాట్లాడాలో తెలుసుకుందాం రండి...

నైపుణ్యాన్ని గుర్తించాలి...

ఈ రోజుల్లో పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య వచ్చే ప్రధాన సమస్య మార్కులు. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు మార్కులు తక్కువగా వస్తే ‘నువ్వు దద్దమ్మవు.. నీకు ఏదీ రాదు’ అంటుంటారు. ఇలా తరచుగా వారిని నిందించడం వల్ల నిజంగా తమకు చదువు రాదేమోనన్న భావన వారిలో కలుగుతుంది. ఫలితంగా వారికి చదువుపై పూర్తిగా ఆసక్తి తగ్గే ప్రమాదం లేకపోలేదు. నిజానికి మార్కులు తక్కువగా వచ్చే పిల్లలను నిందించకుండా వారికి సరైన సహకారం అందిస్తే చదువులో రాణిస్తుంటారు. అయితే ఇందుకు వారితో సానుకూలంగా మాట్లాడాలి. ‘నీలో చదువుకునే సత్తా ఉంది.. నీకు మార్కులు ఖచ్చితంగా వస్తాయి’ అంటూ వారిలో ధైర్యం నింపితే ప్రయోజనం ఉంటుందంటున్నారు నిపుణులు.

ముద్ర వేయకూడదు...

పిల్లలు తప్పు చేసినప్పుడు వారిని కోప్పడడం సహజం. కానీ, కొంతమంది తల్లిదండ్రులు కోపం వచ్చినప్పుడు వారి లోపాలను గుర్తు చేస్తుంటారు. ‘ఎత్తు, బరువు, బద్ధకం, నత్తి, మతిమరుపు’ వంటి అంశాలపై వారికి ఒక పేరు పెట్టి ముద్ర వేస్తుంటారు. ఇలా తరచుగా నిందించడం వల్ల ఆత్మనూన్యతకు లోనయ్యే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. వారు పెరిగే కొద్దీ ఈ ముద్ర కూడా వారి వెంటే వస్తుంటుంది. కాబట్టి, కోపంలో కూడా సాధ్యమైనంత వరకు వారి లోపాలను గుర్తు చేయకుండా ఉండడం మంచిది.

ఆ విషయాలు వద్దు...

కొంతమంది తల్లిదండ్రులు పిల్లల ముందు ఆర్థిక విషయాలు చర్చిస్తుంటారు. ‘ఈ నెల ఖర్చులు ఎలా భరించాలో అర్థం కావడం లేదు’ అంటూ పిల్లల ముందే భాగస్వామితో మాట్లాడుతుంటారు. ఇలాంటి మాటలు పిల్లల్లో ఆందోళనలు పెంచుతుంటాయి. కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల పరిస్థితిని అర్థం చేసుకుని వారికి కావాల్సిన ముఖ్యమైన అవసరాలను కూడా చెప్పకుండా దాచిపెడుతుంటారు. ఇది వారి కెరీర్పై ప్రభావం చూపే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి, ఇలాంటి అంశాలను పిల్లల ముందు చర్చించకపోవడం మంచిది.

ఇతరులతో పోల్చుతూ..

కొంతమంది తల్లిదండ్రులు ఇతర పిల్లలతో పోల్చుతూ తమ పిల్లల్ని నిందిస్తుంటారు. ఈ క్రమంలో కొన్ని పదాలను తరచుగా ఉపయోగిస్తుంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఇలాంటి మాటలు వారిపై వ్యతిరేక ప్రభావం చూపించడమే కాకుండా ఎవరితో పోల్చుతున్నారో వారిపై కోపం పెంచుకునే ప్రమాదం కూడా ఉంది. దీనికి బదులుగా ‘నువ్వు బాగా చేస్తావు, నీకు మంచి సహకారం అందిస్తాం, నీలో మంచి నైపుణ్యాలు ఉన్నాయి’ అంటూ వారిలో స్ఫూర్తి నింపుతుండాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్