మూడ్ బాలేదా..? ఇలా చేసి చూడండి..!

మన మనసు రోజూ ఒకేలా ఉండదు. ఒక రోజు ఉత్సాహంగా మొదలై పనులన్నీ చకచకా పూర్తి చేస్తే.. మరో రోజు డల్‌గా ప్రారంభమై.. దాని ప్రభావం చేసే పనిపై, ఉత్పాదకతపై పడుతుంది. ఇందుకు వ్యక్తిగతంగా, వృత్తిపరంగానే కాదు.. ఇతర విషయాలూ కారణం కావచ్చు. ఏదేమైనా రోజు ప్రారంభంలోనే మనసు......

Published : 29 Oct 2022 20:56 IST

మన మనసు రోజూ ఒకేలా ఉండదు. ఒక రోజు ఉత్సాహంగా మొదలై పనులన్నీ చకచకా పూర్తి చేస్తే.. మరో రోజు డల్‌గా ప్రారంభమై.. దాని ప్రభావం చేసే పనిపై, ఉత్పాదకతపై పడుతుంది. ఇందుకు వ్యక్తిగతంగా, వృత్తిపరంగానే కాదు.. ఇతర విషయాలూ కారణం కావచ్చు. ఏదేమైనా రోజు ప్రారంభంలోనే మనసు బాగోకపోవడం వల్ల ప్రతికూల ఆలోచనలు ఆవహిస్తాయి.. పని పైనా దృష్టి పెట్టలేం.. కాబట్టి ఇలాంటప్పుడు మూడ్‌ని తిరిగి సెట్‌ చేసుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి..

ప్రకృతికి దగ్గరగా..!

మనసు బాగోకపోయినా.. సమయానికి పని పూర్తిచేయాలని బలవంతంగా డెస్క్‌కే పరిమితమవుతుంటారు చాలామంది. నిజానికి దీనివల్ల పని ముందుకు కదలకపోగా.. మనసుపై మరింత ఒత్తిడి పడుతుంది. ఇలా పైపైన చేసే పని ద్వారా ఆశించిన ఉత్పాదకతనూ పొందలేం. కాబట్టి ఇలాంటప్పుడు పని నుంచి కాస్త విరామం తీసుకొని ప్రకృతితో గడపమంటున్నారు నిపుణులు. మనసు బాగోకపోయినప్పుడు కేవలం పదే పది నిమిషాలు ప్రకృతితో మమేకమైతే ఒత్తిళ్లన్నీ మాయమై.. తిరిగి పునరుత్తేజితం కావచ్చని ఓ అధ్యయనంలో కూడా తేలింది. కాబట్టి మూడ్‌ని తిరిగి సెట్‌ చేసుకోవడానికి ఈ చిట్కా పాటించచ్చు. ఒకవేళ పచ్చటి ప్రకృతి తమ చుట్టూ లేదనుకుంటే.. ఆఫీస్‌లో మీకు నచ్చిన ప్రదేశం అంటూ ఒకటి ఉండే ఉంటుంది.. కాబట్టి కాసేపు అక్కడ గడిపినా సమాన ఫలితాన్ని పొందచ్చంటున్నారు నిపుణులు. మీ బాస్‌ ఒప్పుకుంటే ఆ రోజంతా అక్కడే కూర్చొని పనిచేయచ్చు.

సరిగ్గా నిద్రపోయారా?

వృత్తిరీత్యా ఇప్పుడు చాలా సమయం కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌ ముందు గడపాల్సి వస్తోంది. అయితే దాన్నుంచి వెలువడే బ్లూ లైట్‌ మన శరీరంలో మెలటోనిన్‌ అనే హార్మోన్‌ విడుదలను నియంత్రిస్తుంది. మనల్ని సుఖనిద్రకు ప్రేరేపించే హార్మోన్‌ ఇది. ఈ హార్మోన్‌ స్థాయులు తగ్గడం వల్ల రాత్రుళ్లు సరిగ్గా నిద్ర పోక.. దాని ప్రభావం మరుసటి రోజు పనిపై పడుతుంది. కాబట్టి.. పని వేళల్లో కాకుండా మిగతా సమయాల్లో ఇలాంటి గ్యాడ్జెట్లను పూర్తిగా పక్కన పెట్టమని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఇంట్లో వాళ్లతో, స్నేహితులతో సమయం గడపడం.. అభిరుచులపై దృష్టి సారించడం వల్ల మనసు మరింత ఉత్తేజితం అవుతుంది. అలాగే ఇలా ఖాళీ సమయాల్లో వ్యాయామానికి సమయం కేటాయించినా శరీరంలో హ్యాపీ హార్మోన్ల స్థాయుల్ని పెంచుకోవచ్చు.

వారితో మాట కలిపితే..!

ఉదయం ఉత్సాహంగా పని ప్రారంభించినా.. ఉన్నట్లుండి మధ్యలో మూడ్‌ పాడవడం, పనిపై ఆసక్తి తగ్గిపోవడం.. వంటివి మనలో చాలామందికి అనుభవమే! ఇలాంటప్పుడు ఒక్కోసారి ఇంటికెళ్లిపోవాలనిపిస్తుంటుంది. కానీ దానివల్ల ఆ రోజు మనం పూర్తిచేయాల్సిన పని మధ్యలోనే ఆగిపోతుంది. కాబట్టి ఇలాంటప్పుడు సానుకూల దృక్పథం నింపే వ్యక్తులతో మాట కలపడం మంచిదంటున్నారు నిపుణులు. మనం పనిచేసే బృందంలో మనతో స్నేహంగా, పాజిటివ్‌గా మాట్లాడే సహోద్యోగి ఎవరో ఒకరు ఉండే ఉంటారు. వారితో కాసేపు మాట్లాడి చూడండి.. వీలైతే మీ సమస్యను వారితో పంచుకోండి.. వారిచ్చే సలహాలు మీ సమస్యకు పరిష్కారం చూపడమే కాదు.. మీ మనసును పునరుత్తేజితం చేస్తాయి. ఇక ఆపై తిరిగి పని మొదలుపెడితే.. ఇక మీకు తిరుగే ఉండదు.

పనే జీవితం కాకూడదు!

మన జీవితం ఎన్నో అంశాలతో ముడిపడి ఉంటుంది. అందులో పని కూడా ఒకటి. అయితే కొంతమంది పనే జీవితంగా భావిస్తారు. సమయమంతా దానికే కేటాయిస్తారు. ఆఫీస్‌ వేళలు ముగిసినా, ఆ రోజు పని పూర్తైనా.. ఇంకా అదే వాతావరణంలో గడపడం, అదనపు పని స్వీకరించడం.. వంటివి చేస్తుంటారు. ఈ ఆసక్తి మొదట్లో కొంతవరకు ఆహ్లాదాన్ని పంచినా.. కొన్నాళ్లకు మనకు తెలియకుండానే మనలో ఒత్తిడి, ఆందోళనలకు కారణమవుతుందంటున్నారు నిపుణులు. దీనివల్ల కూడా రోజంతా మనసుపై ప్రతికూల ప్రభావం పడుతుందంటున్నారు. కాబట్టి పనికే అంకితమవకుండా.. కాసేపు కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేయడం, ఇంకా సమయం మిగిలితే మీకు ఆసక్తి ఉన్న అంశాలపై దృష్టి సారించడం వల్ల మనసు పునరుత్తేజితమవుతుంది.. ఇటు కంటి పైనా ప్రతికూల ప్రభావం పడకుండా జాగ్రత్తపడచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్