చలికాలంలో వెచ్చవెచ్చటి హెల్దీ సూప్స్!

చలికాలంలో ఏం తిన్నా వేడివేడిగా తినాలనిపిస్తుంది. ఈ క్రమంలో రెండు ముద్దలు ఎక్కువే తినేస్తుంటారు చాలామంది. మరి ఓ వైపు చలి చంపేస్తుంటే ఇక వ్యాయామం సంగతి పట్టించుకునే వారు ఎంతమంది ఉంటారు చెప్పండి. దాని సంగతి దేవుడెరుగు అనుకునేవారు ఎంతమందో!

Published : 10 Nov 2021 20:45 IST

చలికాలంలో ఏం తిన్నా వేడివేడిగా తినాలనిపిస్తుంది. ఈ క్రమంలో రెండు ముద్దలు ఎక్కువే తినేస్తుంటారు చాలామంది. మరి ఓ వైపు చలి చంపేస్తుంటే ఇక వ్యాయామం సంగతి పట్టించుకునే వారు ఎంతమంది ఉంటారు చెప్పండి. దాని సంగతి దేవుడెరుగు అనుకునేవారు ఎంతమందో! ఇలా రెండుమూడు ముద్దలు ఎక్కువ తినడం, అటు వ్యాయామమూ చేయకపోవడం వల్ల చలికాలం పూర్తయ్యేసరికి బరువు పెరిగేస్తుంటారు చాలామంది. అందుకే అటు వేడివేడిగా కడుపు నింపుతూనే, ఇటు మీ ఫిట్‌నెస్‌ని కూడా కోల్పోకుండా ఉండాలంటే ఈ చలికాలంలో కొన్ని సూప్స్‌ ట్రై చేయడం బెటర్‌. మరి అలా నోరూరిస్తూ చలిని దూరం చేసే ఈ హెల్దీ సూప్స్‌ని ఒకసారి మీరూ ట్రై చేసి చూడండి!

బాదం- మష్రూమ్ సూప్

కావాల్సినవి :

* బాదంపప్పులు - అరకప్పు

* పాలు - అరకప్పు

* మష్రూమ్స్‌ - 50 గ్రాములు

* వెన్న - 2 టేబుల్‌ స్పూన్లు

* మైదా - 4 టేబుల్‌ స్పూన్లు

* నీళ్లు - 4 కప్పులు

* ఉప్పు - 2 టేబుల్‌ స్పూన్లు

* మిరియాల పొడి - పావు చెంచా

* క్రీమ్‌ - 4 టేబుల్‌ స్పూన్లు

తయారీ :

నానబెట్టిన బాదంపప్పుల్లో కొన్నింటిని తీసుకొని మీడియం సైజులో తరిగి పక్కన పెట్టుకోవాలి. మిగతా బాదంపప్పులను పాలలో వేసి బాగా కలిసిపోయేలా మిక్సీ పట్టాలి. ఇప్పుడు ప్యాన్‌లో వెన్న వేసి తరిగిన బాదంపప్పులు, మష్రూమ్స్‌ దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మైదా వేసి కాస్త వేగనివ్వాలి. ఆపై కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ మిశ్రమాన్ని కలుపుతుండాలి. ఈక్రమంలో మైదా ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు మంట తగ్గించుకొని ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న బాదం పాలను దీనికి చేర్చుకోవాలి. దీనికి సరిపోయేంత ఉప్పు, మిరియాల పొడి చేర్చి అయిదు నిమిషాల పాటు అలానే ఉంచాలి. ఈ క్రమంలో ఉండలు కట్టకుండా మధ్యమధ్యలో కలుపుతుండాలి. రెండు, మూడు నిమిషాల తర్వాత దించి క్రీమ్‌ కలుపుకుంటే టేస్టీగా ఉండే బాదం సూప్‌ రడీ!

 

టొమాటో- పుదీనా సూప్

కావాల్సినవి :

* టొమాటో - కిలో

* జాస్మిన్‌ టీ బ్యాగ్స్ - 2

* పుదీనా తరుగు - కొద్దిగా

* టబస్కో (సాస్) - ఒక టీస్పూన్

* ఉప్పు - తగినంత

* గార్లిక్‌ బ్రెడ్‌ - 4 ముక్కలు

* మిరియాల పొడి - తగినంత

తయారీ :

తొక్కతో పాటు గింజలను తొలగించిన టొమాటోలను స్టౌ మీద ఉడికించుకోవాలి. రసం చిక్కగా మారే సమయంలో ఉప్పు, మిరియాల పొడి, పుదీనా తరుగు, సాస్‌ను కలుపుకొని కాసేపు మరిగించుకోవాలి. ఇప్పుడు మరో బౌల్‌లో నీటిని తీసుకొని అందులో జాస్మిన్‌ టీ బ్యాగ్స్‌ వేసి మరిగించుకోవాలి. నీళ్లు బాగా మరిగి రసం దిగిన తర్వాత దాన్ని టొమాటో రసంలో కలుపుకొని గరిటతో తిప్పుకుంటే టొమాటో సూప్‌ సిద్ధమైనట్లే. దీన్ని నేరుగా తాగేయచ్చు.. లేదంటే గార్లిక్‌ బ్రెడ్, సాధారణంగా దొరికే మిల్క్‌ బ్రెడ్‌కి మంచింగ్‌గా తీసుకోవచ్చు.

 

బీట్‌రూట్ కాక్‌టెయిల్ సూప్

 

కావాల్సినవి :

* బీట్‌రూట్‌ ముక్కలు - కప్పు

* సొరకాయ ముక్కలు - కప్పు

* కట్‌ చేసిన ఉల్లిపాయలు - అరకప్పు

* టొమాటో ముక్కలు - అరకప్పు

* బంగాళాదుంప ముక్కలు - అరకప్పు

* చక్కెర - అర టీస్పూన్

* ఉప్పు - తగినంత

* మిరియాల పొడి - పావు చెంచా

* క్రీమ్‌ - 2 టేబుల్‌ స్పూన్లు

* పుదీనా లేక మెంతి ఆకుల తరుగు - కొద్దిగా

తయారీ :

ఒక ప్యాన్‌లో రెండు కప్పుల నీళ్లు పోసి అందులో బీట్‌రూట్, సొరకాయ, బంగాళాదుంప, టొమాటో ముక్కలను వేసి బాగా ఉడికించుకోవాలి. ముక్కలు బాగా ఉడికిన తర్వాత దించి చల్లార్చాలి. తర్వాత మిక్సీ పట్టుకొని వడకట్టుకోవాలి. తాగే ముందు కాస్త వేడి చేస్తూ.. రుచి కోసం కొద్దిగా చక్కెర, ఉప్పు, మిరియాల పొడి కలుపుకోవాలి. చివరగా సర్వ్‌ చేసుకునే ముందు పుదీనా లేదా మెంతి ఆకుల తరుగు, క్రీమ్తో గార్నిష్‌ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే బీట్‌రూట్‌ సూప్‌ని లాగించేయచ్చు.

 

క్యారట్‌ సూప్

కావాల్సినవి :

* క్యారట్లు - 5

* నూనె -  సరిపడినంత

* ఉప్పు - తగినంత

* వెజిటబుల్‌ సూప్‌ - 5 కప్పులు (ఇది మార్కెట్లో దొరుకుతుంది)

* అల్లం ముక్క - మీడియం సైజ్‌ (తురిమి పెట్టుకోవాలి)

* పుదీనా తరుగు - కొద్దిగా

* ఉల్లిపాయ - అరముక్క

* వెల్లుల్లి రెబ్బలు - 2

* మిరియాల పొడి - కొద్దిగా

తయారీ :

తొక్క చెక్కేసిన క్యారట్లను గుండ్రటి ముక్కలుగా చేసుకోవాలి. ప్యాన్‌లో కొద్దిగా నూనె వేసి క్యారట్‌ ముక్కలను దోరగా వేయించుకోవాలి. వాటిపై కాస్త ఉప్పు చల్లి ఇంకాసేపు వేయించుకోవాలి. తర్వాత మరో బౌల్‌లో వెజిటబుల్‌ సూప్‌ తీసుకొని అందులో అల్లం తురుము, పుదీనా తరుగు వేసుకొని పదిహేను నిమిషాల పాటు స్టౌపై మరిగించుకోవాలి. ఇప్పుడు మరో బౌల్‌లో కాస్త నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలను దోరగా వేయించుకోవాలి. కాసేపు అలాగే ఉంచి ఇంతకుముందు వేయించిన క్యారట్‌ ముక్కలు, వెజిటబుల్‌ సూప్‌ను ఈ మిశ్రమానికి కలుపుకొని పది నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మెత్తగా మిక్సీ పట్టుకొని పేస్ట్‌లా చేసుకోవాలి. మరీ చిక్కగా ఉంటే కాస్త నీళ్లు కలుపుకోవచ్చు. చివరగా తాగే ముందు కొద్దిగా వేడి చేసుకొని తగినంత ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర లేక పుదీనా తరుగు కలుపుకొని తీసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్