Jazmyn Forrest: బార్బీలా మారాలని లక్షలు ఖర్చుపెడుతోంది!

మనం మనలా ఉండడానికే ఇష్టపడతాం.. అదే మనలోని ప్రత్యేకత అనుకుంటాం. కానీ కొంతమందికి తమ రూపు తమకు నచ్చదు. తాము అభిమానించే తారలు, బొమ్మల్లా మారిపోవాలని కోరుకుంటారు. అంతటితో ఆగిపోకుండా వారిలా తమ రూపురేఖల్ని....

Published : 03 Jun 2023 13:21 IST

(Photos: Instagram)

మనం మనలా ఉండడానికే ఇష్టపడతాం.. అదే మనలోని ప్రత్యేకత అనుకుంటాం. కానీ కొంతమందికి తమ రూపు తమకు నచ్చదు. తాము అభిమానించే తారలు, బొమ్మల్లా మారిపోవాలని కోరుకుంటారు. అంతటితో ఆగిపోకుండా వారిలా తమ రూపురేఖల్ని మార్చుకోవడానికి లక్షలు ఖర్చుపెట్టడానికీ వెనకాడరు. ఆస్ట్రేలియాకు చెందిన జాజ్‌మిన్‌ ఫారెస్ట్‌ ఇదే కోవకు చెందుతుంది. పట్టుమని పాతికేళ్లు కూడా నిండని ఈ అమ్మాయికి బార్బీ బొమ్మంటే చచ్చేంత ఇష్టం. అలాగని దాన్ని చూస్తూ సంతృప్తి పడిపోకుండా.. అచ్చం ఆ బొమ్మలాగే తన శరీరాకృతిని మార్చుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఇప్పటికే పలు కాస్మెటిక్‌, ప్లాస్టిక్‌ సర్జరీలు చేయించుకుంది. ఇందుకోసం దేశవిదేశాల్లోని నిపుణుల్ని సంప్రదించింది. ఇటీవలే మరో చికిత్స కోసం సియోల్‌ వెళ్లిన జాజ్‌మిన్.. ఎవరెలా స్పందించినా తనకు నచ్చేలా తనను తాను మార్చుకున్నప్పుడే సంతోషంగా ఉండగలనంటోంది. మరి, ఈ రియల్‌ లైఫ్‌ బార్బీ డాల్ కథేంటో తెలుసుకుందామా?!

జాజ్‌మిన్‌ ఫారెస్ట్‌ది ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్. చిన్న వయసు నుంచే ఈ అమ్మాయికి అందంపై ఆసక్తి ఎక్కువ! పదే పదే తనను తాను అద్దంలో చూసుకుంటూ మురిసిపోయేది. ఇదే తన ఆత్మవిశ్వాసాన్ని పెంచేదని చెబుతోంది. అయితే పెరిగి పెద్దయ్యే క్రమంలో బార్బీ డాల్ ఆమెకు పరిచయమైంది. ఆ బొమ్మ అందానికి ముగ్ధురాలైన జాజ్‌మిన్.. తానూ ఆ బొమ్మలా మారిపోవాలని నిర్ణయించుకుంది.

18 ఏళ్లకే మొదలు..!

ఈ ఆలోచనను తన 18 ఏట నుంచి ఆచరణలో పెట్టడం ప్రారంభించింది జాజ్‌మిన్. తొలుత బ్రెస్ట్‌ ఆగ్మెంటేషన్‌/బ్రెస్ట్‌ ఎన్‌లార్జ్‌మెంట్ సర్జరీ చేయించుకున్న ఆమె.. ఆపై పెదాలకు ‘లిప్‌ ఫిల్లర్‌’, బుగ్గలకు ‘చీక్స్‌ ఫిల్లర్‌’, ముక్కుకు ఇరువైపులా చర్మాన్ని సాగదీయడానికి; గడ్డం, దవడల్లో మార్పులు చేసుకోవడానికి మరిన్ని కాస్మెటిక్‌ సర్జరీలు చేయించుకుంది. తరచూ బొటాక్స్ ఇంజెక్షన్లు తీసుకోవడంతో పాటు పొట్ట, భుజాలు, పిరుదులు, నడుం.. వంటి భాగాల్లో మార్పులు చేసుకునేందుకు ‘వేసర్‌ లైపోసక్షన్‌’ను ఆశ్రయించిందామె. గతేడాది మరోసారి ‘బ్రెస్ట్‌ ఎన్‌లార్జ్‌మెంట్‌’ సర్జరీ చేయించుకున్న జాజ్‌మిన్.. ఇటీవలే నుదురు భాగంలో ప్లాస్టిక్ సర్జరీ (రినోప్లాస్టీ) చేయించుకోవడానికి సియోల్‌ వెళ్లింది. ఇలా ఇన్నేళ్ల పాటు తన సర్జరీల కోసం సుమారు రూ. 82 లక్షలకు పైగానే ఖర్చు చేసిందట జాజ్‌మిన్. ఇక తను పూర్తిస్థాయి బార్బీలా మారడానికి భవిష్యత్తులో మరిన్ని చికిత్సలు అవసరమని వైద్యులు చెప్పారని, వాటినీ చేయించుకొని రియల్‌ టైమ్‌ బార్బీలా మారిపోతానంటోందీ ఆసీస్‌ టీన్.

నాకు నచ్చిన పని చేస్తున్నా!

లక్షలు ఖర్చుపెడుతూ బార్బీలా మారాలని పలు చికిత్సలు చేయించుకుంటోన్న జాజ్‌మిన్.. ప్రతి చికిత్స తర్వాత తన శరీరాకృతిలో వస్తోన్న మార్పులకు సంబంధించిన ఫొటోలు, వీడియోల్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటుంది. అయితే వీటికి చాలామంది నుంచి సానుకూల స్పందన వస్తుందని, కొంతమంది నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ వాటిని పట్టించుకోనంటోందీ బార్బీ లవర్.

‘బార్బీలా మారాలన్న ఆలోచన వచ్చినప్పుడే ప్లాస్టిక్‌ సర్జరీ గురించి తెలుసుకున్నా. ఈ క్రమంలో చికిత్స చేయించుకున్న ప్రతిసారీ నాలో వచ్చిన మార్పులకు సంబంధించిన ఫొటోల్ని, వీడియోల్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం ప్రారంభించా. చాలామంది సానుకూలంగా స్పందించడంతో నాలో ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. దీనికి తోడు నా అందాన్ని పదే పదే అద్దంలో చూస్తూ మురిసిపోవడం నాకు ఇష్టం. అయితే కొంతమంది ‘ఫేక్‌, ప్లాస్టిక్‌’ అంటూ నా రూపాన్ని విమర్శించిన వారూ లేకపోలేదు. నిజానికి నేను అలాంటి కామెంట్లను పట్టించుకోవట్లేదు. ఎందుకంటే నాకు నచ్చినట్లుగా నేను ఉండాలనుకుంటున్నా.. ఇదే నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది..’ అంటూ చెప్పుకొచ్చింది జాజ్‌మిన్.


ఎవరిలానో ఉండాలనుకోవడమెందుకు?!

అయితే జాజ్‌మిన్ మాదిరిగానే కొంతమంది విదేశీ అమ్మాయిలు.. తమకు నచ్చిన బొమ్మలా, తాము అభిమానించే నటీమణిగా మారిపోవాలని వరుస పెట్టి కాస్మెటిక్‌/ప్టాస్టిక్‌ సర్జరీలు చేయించుకోవడం, లక్షల కొద్దీ డబ్బు ఖర్చు చేయడం మనం చూస్తున్నాం. ఇరాక్‌కు చెందిన దలియా నయీమ్‌, జర్మనీకి చెందిన జెస్సీ బన్నీ.. వంటి అమ్మాయిలు బార్బీలా మారిపోవాలని; అంతకుముందు ఇరాన్‌కు చెందిన సహర్‌ తబర్‌ తన అభిమాన నటి ఏంజెలీనా జోలీలా మారిపోవాలని ఇలాంటి ప్రయత్నాలే చేసి వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే! అయితే తమ ఇష్టాయిష్టాలు, ఆత్మవిశ్వాసం సంగతేమో గానీ.. ఇలాంటి సర్జరీల వల్ల లేని సమస్యలు కొని తెచ్చుకున్నట్లే అంటున్నారు నిపుణులు. ఈ తరహా చికిత్సలు/సర్జరీల వల్ల రక్తం ఎక్కువగా కోల్పోవడం, ఇన్ఫెక్షన్‌ ముప్పు పెరగడం, నరాలు డ్యామేజ్‌ కావడం, మత్తు వల్ల దుష్పభావాలు తలెత్తడంతో పాటు కొన్నిసార్లు ఆయా అవయవాలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదమూ ఉంటుందంటున్నారు. కాబట్టి ఎవరిలానో ఉండాలన్న తాపత్రయాన్ని వీడి.. స్వీయ ప్రేమను పెంచుకోమంటున్నారు. తద్వారా ఆత్మవిశ్వాసం, ఆత్మసంతృప్తి రెండూ సొంతమవుతాయంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్