Updated : 20/10/2021 16:20 IST

కాలేజీ ప్రేమ పెళ్లిపీటలెక్కింది!

(Photo: Instagram)

అందం, తరగని ఆస్తిపాస్తులున్నా.. ఆమె సింప్లిసిటీ అతనికి నచ్చింది.. గుర్రపు పందేల్లో రాణిస్తూ రికార్డులు కొల్లగొడుతోన్న అతని మనసు ఆమెను కట్టిపడేసింది. దాంతో చదువుకునే వయసులోనే ప్రేమ పాఠాలు నేర్చుకున్నారు వారిద్దరూ. అభిరుచులతో పాటు మనసులు కూడా కలవడంతో తమ ప్రేమ బంధాన్ని పెళ్లితో శాశ్వతం చేసుకోవాలనుకున్నారు. అందుకు పెద్దల ఆశీర్వాదం కూడా తోడవడంతో గతేడాది నిశ్చితార్థం చేసుకున్నారు.. తాజాగా పెళ్లిపీటలెక్కారు. వారే ప్రపంచ కుబేరుడు బిల్‌గేట్స్‌ పెద్ద కూతురు జెన్నిఫర్‌ కేథరిన్‌ గేట్స్‌ - ఈజిప్టుకు చెందిన ప్రొఫెషనల్‌ హార్స్ రైడర్‌ నాయెల్‌ నాసర్‌. గేట్స్‌ ఫామ్‌హౌస్‌లో కొద్ది మంది అతిథుల సమక్షంలో ఇటీవలే ఉంగరాలు మార్చుకొని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిందీ అందాల జంట. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

యూనివర్సిటీలోనే ప్రేమ పాఠాలు!

స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు మొదటిసారిగా ఒకరికొకరు పరిచయమయ్యారు జెన్నిఫర్‌-నాసర్‌. ఆ పరిచయమే ఆ తర్వాత ప్రేమగా చిగురించింది. స్టార్‌ కిడ్‌ అయినా.. మొదటి నుంచి సీక్రెట్‌ లైఫ్‌కి ప్రాధాన్యమిచ్చే జెన్నిఫర్‌ తన ప్రేమ గురించి ఎప్పుడూ బయటికి చెప్పలేదు. అయితే 2017 వేలంటైన్స్‌ డే రోజున తాము ప్రేమలో ఉన్నామని అధికారికంగా ప్రకటించారు జెన్నిఫర్‌-నాసర్‌. అదే సంవత్సరం జెన్నిఫర్‌ను తన కుటుంబ సభ్యులకు పరిచయం చేశాడు నాసర్‌. ఇక చిన్నప్పటి నుంచి జెన్నిఫర్‌కు గుర్రపు స్వారీ అంటే చాలా ఇష్టం. ఆ ఆటకు సంబంధించి పలు పోటీల్లో కూడా పాల్గొందీ ముద్దుగుమ్మ. ఇక నాసర్‌ ప్రొఫెషనల్‌ హార్స్‌ రైడర్. వివిధ ‘షో జంపింగ్‌’ (గుర్రపు స్వారీకి సంబంధించిన ఆట) కాంపిటీషన్లలో పాల్గొనడమే కాకుండా పలు టైటిళ్లు కూడా సొంతం చేసుకున్నాడు. అంతేకాదు.. ఈ ఏడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లోనూ పోటీపడి తన సత్తా చాటుకున్నాడీ హ్యాండ్‌సమ్‌. ఒక్క గుర్రపు పందేలనే కాదు.. చాలా విషయాల్లో ఇద్దరి అభిరుచులు కలవడంతో గతేడాది తమ ప్రేమను నిశ్చితార్థం దాకా తీసుకెళ్లారీ స్వీట్‌ కపుల్.

ఇకపై నువ్వే నా లోకం డియర్!

అయితే తాజాగా తమ ప్రేమ బంధాన్ని పెళ్లితో శాశ్వతమైన అనుబంధంగా మార్చుకున్నారు జెన్నిఫర్‌-నాసర్‌. అక్టోబర్‌ 16న గేట్స్‌ ఫామ్‌హౌస్‌ వీరిద్దరి వివాహ వేడుకకు వేదికగా నిలిచింది. ఇరు కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో ఉంగరాలు మార్చుకుందీ అందాల జంట. ఈ క్రమంలో జెన్నిఫర్‌ ఐవరీ బ్రైడల్‌ గౌన్‌లో దేవకన్యను తలపించగా.. నాసర్‌ బ్లాక్‌ అండ్‌ వైట్‌ సూట్‌లో ముస్తాబయ్యాడు. అయితే తమ పెళ్లికి సంబంధించిన పలు ఫొటోల్ని తాజాగా సోషల్‌ మీడియాలో పంచుకుంటూ మురిసిపోయారీ న్యూకపుల్.

ఈ క్రమంలో ‘ఇకపై నువ్వే నా లోకం డియర్‌!’ అంటూ జెన్నీ క్యాప్షన్‌ పెట్టగా.. ‘జీవితమంతా నీతో గడపడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అంటూ నాసర్‌ రాసుకొచ్చాడు. ఇక వీరి వివాహానికి హాజరైన జెన్నిఫర్‌ తల్లిదండ్రులు బిల్‌-మెలిందాలు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

సెలబ్రిటీ స్టేటస్‌కు దూరంగా!

ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌-మిలిందా దంపతుల వారసురాలిగా పుట్టుకతోనే సెలబ్రిటీ స్టేటస్‌ సొంతం చేసుకుంది జెన్నిఫర్‌ కేథరిన్‌ గేట్స్‌. అయితే ఆ హోదాను ఏ మాత్రం తలకెక్కించుకోకుండా చిన్నప్పటి నుంచి సింప్లిసిటీకే ప్రాధాన్యమిస్తూ వస్తోందీ స్టార్‌ కిడ్‌. కూతురి స్వేచ్ఛకు తమ హోదా అడ్డు రాకూడదని బిల్‌గేట్స్‌ దంపతులు కూడా జెన్నిఫర్‌ ప్రైవేట్‌ లైఫ్‌కే ప్రాధాన్యమిచ్చారు. అందుకే స్కూలింగ్‌ నుంచి టీనేజ్‌కు వచ్చేదాకా తన పూర్తి వివరాలేవీ మీడియాకు కూడా తెలియదు. ఎప్పుడైతే తన గ్రాడ్యుయేషన్‌ కోసం స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో చేరిందో అప్పుడే ఆమె గురించి ప్రపంచానికి తెలిసింది. ఇక నాసర్‌ లాగే జెన్నిఫర్‌కు హార్స్‌ రైడింగ్‌ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచే పలు గుర్రపుస్వారీ పోటీల్లో కూడా పాల్గొంది. నాసర్‌తో పరిచయం అయ్యాక జంటగా వివిధ దేశాల్లో జరిగే గుర్రపు స్వారీ పోటీలకు హాజరయ్యారీ లవ్లీ పెయిర్‌. ఇక ఈజిప్టుకు చెందిన నాసర్‌ ప్రొఫెషనల్‌ హార్స్‌ రైడర్‌గా, షో జంపర్‌గా పలు పోటీల్లో సత్తా చాటాడు. ఈ ఏడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో తన దేశం తరఫున పాల్గొని ప్రతిభ కనబరిచాడు.

 

తల్లిదండ్రుల అడుగుజాడల్లోనే!

* 2014లో ‘హ్యూమన్‌ బయాలజీ’లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది జెన్నిఫర్‌. డాక్టర్‌గా సేవలందించడమే తన లక్ష్యమంటోన్న ఆమె ప్రస్తుతం మన్‌హట్టన్‌లోని ఓ మెడికల్‌ కళాశాలలో మెడిసిన్ చదువుతోంది.

* జెన్నిఫర్‌కు జంతువులంటే చాలా ప్రేమ. గుర్రాలతో పాటు తన వెంట ‘Earl Grey’ అనే ఓ పెట్‌డాగ్‌ కూడా ఉంటుంది. అంతేకాదు వివిధ జంతువుల సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాల్లో తరచుగా పాల్గొంటుంటుందీ యానిమల్‌ లవర్.

* గుర్రపుపందేలతో పాటు ట్రావెలింగ్‌ అంటే చాలా ఇష్టపడే జెన్నిఫర్‌.. తన ఇష్టసఖుడితో వివిధ పర్యటక ప్రాంతాల్ని చుట్టేయడానికి ఆసక్తి చూపుతుంటుంది. ఈ క్రమంలోనే వీరిద్దరూ గడిపిన విహార యాత్రలకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరలవడం ఇదివరకు చాలా సందర్భాల్లో మనం చూసే ఉంటాం.

* ఇక సేవా కార్యక్రమాలకు సంబంధించి తన తల్లిదండ్రుల అడుగుజాడల్లోనే నడుస్తోందీ సెలబ్రిటీ కిడ్‌. ఇందులో భాగంగా గుర్రాల రక్షణ కోసం ‘EQUUS’ ఫౌండేషన్‌ నిర్వహిస్తోన్న వివిధ కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తోంది.

* గతంలో అమెరికన్‌ స్కూళ్లలో గన్‌కల్చర్‌ బాగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా 2018, మార్చి 22న ‘రైడ్‌ ఫర్‌ అవర్‌ లైవ్స్‌’ పేరిట ఓ క్యాంపెయిన్‌ని నిర్వహించింది జెన్నిఫర్‌. ‘గన్‌ కల్చర్‌’పై తన నిరసన గళాన్ని వినిపిస్తూ సాగిన ఈ కార్యక్రమంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిందీ ముద్దుగుమ్మ.

ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ఈ ముద్దుల జంట పెళ్లి ఫొటోలే దర్శనమిస్తున్నాయి. ‘మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌’, ‘లవ్లీ కపుల్‌’.. అంటూ ఈ క్యూట్‌ కపుల్‌కి అటు సెలబ్రిటీలు, ఇటు సామాన్యులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి, మనమూ ఈ అందాల జంట పెళ్లి ఫొటోలపై ఓ లుక్కేద్దాం రండి!

హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌ స్వీట్‌ కపుల్!CVLYNiQJhaD

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని