Black Water : ఇదే మా ఫిట్‌నెస్‌ సీక్రెట్!

ఇంతకీ వాటర్‌ బాటిల్‌ ఏంటి? నీళ్లు తాగడమేంటి? వైరలవడమేంటి? అని ఆలోచిస్తున్నారా? అవి సాధారణ నీళ్లైతే ఎవరూ పట్టించుకునే వారు కాదేమో! కానీ ఆ బాటిల్‌లో, గ్లాసులో ఉన్నవి కాస్ట్‌లీ ‘బ్లాక్‌ వాటర్‌’. మనకు ఈ పేరు కొత్త కావచ్చు.. కానీ ఫిట్‌నెస్‌, క్రీడలకు ప్రాధాన్యమిచ్చే సెలబ్రిటీలకు ఈ నీళ్లు సర్వసాధారణం.

Updated : 08 Dec 2022 14:26 IST

మొన్నటికి మొన్న ఓ జిమ్‌ నుంచి బయటికొస్తోన్న మలైకాను కాకుండా ఆమె చేతిలో పట్టుకున్న వాటర్‌ బాటిల్‌ పైనే అందరి దృష్టి పడింది.

ఇక ఇప్పుడేమో.. నీళ్లు తాగుతూ పోజిస్తోన్న శృతి హాసన్‌ ఫొటో సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతోంది.

ఇంతకీ వాటర్‌ బాటిల్‌ ఏంటి? నీళ్లు తాగడమేంటి? వైరలవడమేంటి? అని ఆలోచిస్తున్నారా? అవి సాధారణ నీళ్లైతే ఎవరూ పట్టించుకునే వారు కాదేమో! కానీ ఆ బాటిల్‌లో, గ్లాసులో ఉన్నవి కాస్ట్‌లీ ‘బ్లాక్‌ వాటర్‌’. మనకు ఈ పేరు కొత్త కావచ్చు.. కానీ ఫిట్‌నెస్‌, క్రీడలకు ప్రాధాన్యమిచ్చే సెలబ్రిటీలకు ఈ నీళ్లు సర్వసాధారణం. బోలెడన్ని పోషక విలువలతో పాటు ఫిట్‌నెస్‌ను అందించే గుణాలూ ఇందులో పుష్కలంగా ఉండడం వల్లే తాము ఈ బ్లాక్‌ వాటర్‌ను ఎంచుకున్నామంటున్నారీ ముద్దుగుమ్మలు. మరి, ఇంతకీ ఏంటీ బ్లాక్‌ వాటర్‌? దీనివల్ల చేకూరే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం రండి..

బ్లాక్‌ వాటర్‌.. గత కొన్ని రోజుల నుంచి మనమంతా ఎక్కువగా వింటున్న పదమిది. ముఖ్యంగా మలైకా అరోరా, శృతి హాసన్‌, ఊర్వశీ రౌతెలా.. వంటి ముద్దుగుమ్మలు ఈ నీటిని తమ రోజువారీ జీవనశైలిలో భాగం చేసుకుంటున్నట్లు ఇటీవలే వైరలైన కొన్ని ఫొటోలు, వీడియోల ద్వారా తెలుస్తోంది. పైగా ఈ నీళ్లు తనకెంతో స్పెషల్‌ అంటోంది శృతి.

ఏంటీ బ్లాక్‌ వాటర్?!

పేరుకు, రూపుకి తగ్గట్లుగానే నలుపు రంగులో అచ్చం కూల్‌డ్రింక్‌ని పోలి ఉంటాయీ నీళ్లు. అల్కలైన్‌ వాటర్‌గా పిలిచే ఈ నీటిలో సుమారు 70కి పైగా ఖనిజాలు మిళితమై ఉంటాయట! అంతేకాదు.. సాధారణ నీటిలో పీహెచ్‌ స్థాయులు 6-7గా ఉంటే.. బ్లాక్‌ వాటర్‌లో దీని విలువ 8 కంటే ఎక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు. అందుకే ఈ నీళ్లు తాగడం వల్ల ఎక్కువ సమయం పాటు హైడ్రేటెడ్‌గా (శరీరం నీటిని కోల్పోకుండా) ఉండచ్చు. అధిక పీహెచ్‌ స్థాయుల కారణంగా శరీరంలో ఆమ్ల స్థాయులు ఎక్కువగా ఉత్పత్తవకుండా అదుపులో ఉంటాయి. అలాగే శరీరంలోని విషతుల్యాలు సులభంగా బయటికి వెళ్లిపోయేందుకు ఈ నీళ్లు సహకరిస్తాయట! జీవక్రియల పనితీరుకు, తీసుకున్న ఆహారంలోని సూక్ష్మ పోషకాలను శరీరం సులభంగా గ్రహించేందుకూ ఈ బ్లాక్‌ వాటర్‌ దోహదం చేస్తుందంటున్నారు నిపుణులు. మరి, ఇన్ని పోషకాలు మిళితమై ఉన్న ఈ నీటి ధరెంతో తెలుసా? లీటర్‌కు రూ. 3000 నుంచి రూ. 4000 దాకా ఉంటుందట!

ప్రయోజనాలివీ!

* శరీరంలో ఆమ్ల స్థాయుల్ని అదుపులో ఉంచే ఈ నీటిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుందంటున్నారు నిపుణులు. తద్వారా తీసుకున్న ఆహారం నుంచి సూక్ష్మ పోషకాలను శరీరం త్వరగా గ్రహించగలుగుతుంది. ఫలితంగా రోగనిరోధక శక్తి పెరిగి.. వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తపడచ్చు.

* జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటే జీవక్రియల పనితీరూ మెరుగుపడుతుంది. ఫలితంగా శరీరంలో అనవసర కొవ్వులు పేరుకుపోకుండా.. బరువును అదుపులో ఉంచుకోవచ్చు.. అలసట దరిచేరకుండా రోజంతా ఉత్సాహంగా ఉండచ్చు.

* బ్లాక్‌ వాటర్‌లో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు.. శరీరంలో వ్యాధులకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను బయటికి పంపించడంలో సమర్థంగా పని చేస్తాయట! తద్వారా వయసు పైబడిన ఛాయలు దరిచేరకుండా నవయవ్వనంగా మెరిసిపోవచ్చంటున్నారు నిపుణులు.

దుష్ప్రభావాలూ ఉన్నాయ్!

ఈ ఆల్కలైన్‌ వాటర్‌ వల్ల బహుళ ప్రయోజనాలున్నప్పటికీ.. వీటి విషయంలో ఇంకా లోతుగా అధ్యయనాలు జరగాల్సి ఉందంటున్నారు నిపుణులు. అయితే ఈ నీళ్లు కొంతమంది శరీరానికి సరిపడినా.. మరికొంతమందిలో పలు దుష్ప్రభావాలు కనిపించే అవకాశాలూ లేకపోలేదంటున్నారు. ఈ క్రమంలో శరీరంలో ఆల్కలైన్ స్థాయులు పెరిగిపోవడం వల్ల గ్యాస్-ఉదర సంబంధిత సమస్యలు, వికారం, వాంతులు, చర్మ సమస్యలు, ఏకాగ్రత కోల్పోవడం, తికమకపడడం.. వంటి సమస్యలొస్తాయట!
శరీరానికి పడుతుందో, లేదో అన్న సందేహానికి తోడు.. ఇంత ఖర్చు పెట్టి ఈ నీళ్లు తాగడం అవసరమా? అనిపిస్తోంది కదూ! అందుకే ఈ సందిగ్ధానికి బదులు సాధారణ నీటినే తగినంత మొత్తంలో తీసుకుంటూ శరీరాన్ని ఎప్పటికీ హైడ్రేటెడ్‌గా ఉంచుకుంటే.. అటు ఆరోగ్యాన్ని, ఇటు ఫిట్‌నెస్‌ను ఏకకాలంలో సొంతం చేసుకోవచ్చని సలహా ఇస్తున్నారు నిపుణులు. అంతేకాదు.. మొక్కల ఆధారిత ఆహారంలో కూడా బ్లాక్‌ వాటర్‌లో ఉన్నన్ని ఫైటోన్యూట్రియంట్లు, ఫైబర్.. వంటి పోషకాలుంటాయట! కాబట్టి ఈ పదార్థాలనైనా ఆహారంలో చేర్చుకోవచ్చు. అలాగని బ్లాక్‌ వాటర్‌ గురించి తెలుసుకోవడంలో తప్పు లేదు కదా! మరి, మీరేమంటారు?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్