పిల్లల జుట్టు నెరిసిపోతోందా?

వయసు పైబడే కొద్దీ తెల్లవెంట్రుకలు రావడం అనేది ఒకప్పటి మాట! కానీ ప్రస్తుతం చిన్న పిల్లలకి కూడా జుట్టు నెరిసిపోవడం చూస్తూనే ఉన్నాం. ఒకరకంగా చెప్పాలంటే.. పిల్లల్లో ఈ సమస్య ఇప్పుడు సర్వసాధారణమైపోయిందన్నా ఆశ్చర్యం లేదు.

Updated : 07 Sep 2023 13:09 IST

వయసు పైబడే కొద్దీ తెల్లవెంట్రుకలు రావడం అనేది ఒకప్పటి మాట! కానీ ప్రస్తుతం చిన్న పిల్లలకి కూడా జుట్టు నెరిసిపోవడం చూస్తూనే ఉన్నాం. ఒకరకంగా చెప్పాలంటే.. పిల్లల్లో ఈ సమస్య ఇప్పుడు సర్వసాధారణమైపోయిందన్నా ఆశ్చర్యం లేదు. పోషకాహార లోపం, వాతావరణ కాలుష్యంతో.. పాటు ఇందుకు ఇంకా చాలా రకాల కారణాలే ఉన్నాయంటున్నారు నిపుణులు. దీనివల్ల చిన్నతనంలోనే పిల్లల వయసు ఎక్కువగా కనిపించి క్రమంగా వారిలో ఆత్మన్యూనతా భావం కలిగే అవకాశమూ లేకపోలేదు. మరి ఈ సమస్య నుంచి పిల్లల్ని బయటపడేసే మార్గమే లేదా.. అంటే? బోలెడన్ని పరిష్కార మార్గాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి..

ఈ సమస్యలున్నాయేమో!

పిల్లల్లో జుట్టు త్వరగా తెల్లబడడానికి వారు ఎదుర్కొనే కొన్ని రకాల సమస్యలే కారణం అంటున్నారు నిపుణులు. అవేంటంటే..

పిల్లలు చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా? ఎందుకంటే చుండ్రు జుట్టును నిర్జీవం చేసి త్వరగా తెల్లబడేలా చేస్తుందని ఓ పరిశోధనలో వెల్లడైంది. కాబట్టి ఒకవేళ పిల్లల్లో ఈ సమస్య ఉన్నట్లయితే వెంటనే డాక్టర్ సలహా మేరకు తగిన మందులు వాడి చుండ్రును వీలైనంత త్వరగా తగ్గించుకోవడం మంచిది.

కొన్ని సమస్యలు వంశపారంపర్యంగా రావడం మనం గమనిస్తూనే ఉంటాం. వాటిలో జుట్టు తెల్లబడడం కూడా ఒకటి. పిల్లల తల్లిదండ్రులకో, వారి తాతముత్తాతలకో ఈ సమస్య ఉంటే వారికి కూడా చిన్నతనంలోనే వచ్చే అవకాశాలుంటాయి.

విటమిన్ బి12 లోపం, అనీమియా, థైరాయిడ్, ఒత్తిడి.. వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల్లోనూ తెల్లవెంట్రుకలు వచ్చే అవకాశం ఉంటుంది.

సహజసిద్ధంగానే..

పిల్లల్లో తెల్లజుట్టు నివారణకు చాలామంది తల్లులు వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఈక్రమంలో వారికి హెయిర్ డై, హెన్నా.. వంటివి పెట్టడం కూడా చేస్తుంటారు. అయితే ఇలాంటి పద్ధతులు పిల్లల జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. పిల్లల్లో ఈ సమస్యను తగ్గించడానికి కొన్ని సులభమైన, సహజసిద్ధమైన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అవేంటో చూద్దాం రండి..

బాదం నూనె, ఉసిరి నూనె.. ఈ రెండింటినీ సమపాళ్లలో తీసుకొని రాత్రి పడుకొనే ముందు పిల్లల జుట్టు మొదళ్లలో బాగా మర్దన చేయాలి. అలాగే రాత్రంతా ఉండనిచ్చి ఉదయాన్నే శుభ్రంగా తలస్నానం చేయించాలి.

తెల్లజుట్టు సమస్యను తగ్గించడంలో కరివేపాకు సమర్థంగా పనిచేస్తుంది. జుట్టుకు పెట్టుకొనే నూనెలో కరివేపాకు వేసి కొద్దిసేపు బాగా మరిగించాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఇలా తయారైన నూనెను జుట్టుకు తరచూ పెడుతుండాలి. ఫలితంగా కొన్ని రోజులకు తెల్లజుట్టు సమస్య తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది.

పాలమీగడ కూడా పిల్లల్లో తెల్లజుట్టు సమస్యను తగ్గిస్తుంది. వారానికి రెండు సార్లు పిల్లల జుట్టుకు పాలమీగడతో మర్దన చేయడం వల్ల కొన్నాళ్లకు చక్కటి ఫలితం కనిపిస్తుంది. దీనికి బదులుగా తాజా నెయ్యిని కూడా ఉపయోగించవచ్చు.

ఉసిరి కాయల్ని ముక్కలుగా చేసి కొన్ని నీళ్లలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటితో పిల్లల జుట్టును శుభ్రపరచాలి. ఇలా కొన్ని రోజులు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. లేదంటే ఉసిరికాయ ముక్కల్ని మరిగించిన నూనెను రోజూ పిల్లల తలకు మర్దన చేసినా సరిపోతుంది.

కలబంద గుజ్జు కూడా పిల్లల్లో తెల్లవెంట్రుకల్ని నిర్మూలించడంలో తోడ్పడుతుంది.

ఐరన్, విటమిన్ బి, కాపర్, సోడియం, ఫోలికామ్లం.. వంటివి అధికంగా ఉండే ఆహారంతో పాటు యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయల్ని పిల్లలకు ఎక్కువగా అందించాలి.

రోజూ పిల్లలతో ఒక గ్లాసు క్యారట్ రసం తాగించినట్లయితే కేవలం తెల్లజుట్టే కాదు.. చుండ్రు, జుట్టు రాలే సమస్యలు కూడా క్రమంగా తగ్గిపోతాయి.

అలాగే పిల్లలకు పదే పదే తలస్నానం చేయించడం, గాఢత ఎక్కువగా ఉండే షాంపూలు వాడడం.. వంటివి ఎంత తగ్గిస్తే అంత మంచిది.

చిన్నవయసులోనే పిల్లల్లో తెల్లజుట్టు రావడానికి గల కారణాలు, వాటికి తగిన పరిష్కార మార్గాలేంటో తెలుసుకున్నారు కదా! ఇవన్నీ సహజసిద్ధమైనవే కాబట్టి ఎలాంటి దుష్ప్రభావాలూ ఉండకపోవచ్చు. కానీ ఇవన్నీ వాడిన తర్వాత కూడా ఎలాంటి మార్పూ కనిపించకపోతే ఆలస్యం చేయకుండా సంబంధిత వైద్యుని సంప్రదించి తగిన సలహాలు పాటించడం మాత్రం మర్చిపోవద్దు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్