ప్రెగ్నెన్సీలో జలుబు చేస్తే..?

గర్భవతిగా ఉన్న సమయంలో ప్రతి మహిళ తన ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ వహిస్తుంది. ఈ సమయంలో ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే.. ఆ ప్రభావం తనతో పాటు పుట్టబోయే బిడ్డపై కూడా పడే అవకాశాలుండటమే దీనికి కారణం.

Published : 10 Feb 2024 12:30 IST

గర్భవతిగా ఉన్న సమయంలో ప్రతి మహిళ తన ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ వహిస్తుంది. ఈ సమయంలో ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే.. ఆ ప్రభావం తనతో పాటు పుట్టబోయే బిడ్డపై కూడా పడే అవకాశాలుండటమే దీనికి కారణం. అందుకే ఆ సమయంలో ఉపయోగించే మందుల విషయంలోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు కాబోయే తల్లులు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నప్పటికీ గర్భం దాల్చినప్పుడు కొన్ని సందర్భాల్లో జలుబు చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు ప్రెగ్నెంట్‌గా ఉన్న మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు.. జలుబు తగ్గడానికి ఏం చేయాలో తెలుసుకొందాం...

బిడ్డపై ప్రభావం ఉంటుందా..?

గర్భం దాల్చిన సమయంలో జలుబు చేసినప్పుడు దాని ప్రభావం కడుపులోని బిడ్డపై కూడా పడుతుందని భావిస్తుంటారు కొందరు. కానీ ఈ సమయంలో బిడ్డ చుట్టూ రక్షణ వలయంగా ఉన్న మాయ దాన్ని చిన్నారి వరకు చేరకుండా ఆపుతుంది. అయితే ఇలా గర్భవతిగా ఉన్నప్పుడు కొంతమందిలో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల తరచూ ఈ సమస్య తలెత్తే అవకాశం లేకపోలేదు. ఇలాంటప్పుడు దాన్ని తగ్గించడానికి మనం ఉపయోగించాలనుకొంటున్న మందుల వల్ల చిన్నారుల్లో శారీరక పరమైన లోపాలు ఏర్పడే అవకాశాలున్నాయి. అందుకే వీలైనంత వరకు సహజసిద్ధమైన చిట్కాలే పాటించాలి. అయితే గర్భవతిగా ఉన్నప్పుడు వచ్చే జలుబు చాలావరకు ప్రమాదకారి కాకపోయినా కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు కొన్ని లక్షణాల ఆధారంగా సమస్యను వెంటనే గుర్తించి వైద్యుని సంప్రదించడం మంచిది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీలో నొప్పిగా అనిపించడం లేదా ఒత్తిడి కలగడం, వెజైనల్ బ్లీడింగ్, ఎక్కువగా వాంతులవడం, జ్వరం రావడం, గర్భంలో బిడ్డ కదలిక తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే.. వెంటనే డాక్టరు వద్దకు వెళ్లడం శ్రేయస్కరం.

ఇవి పాటించాలి..

గర్భవతిగా ఉన్న సమయంలో జలుబు చేసినప్పుడు సొంత నిర్ణయంతో మాత్రలు వేసుకోవడం లాంటివి చేయకూడదు. వాటి వల్ల కడుపులో బిడ్డ సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందుకే వీలైనంత వరకు సహజసిద్ధమైన చిట్కాలు పాటించడం.. అది కూడా ఓసారి డాక్టరు సలహా అడగడం మరీ మంచిది.

⚛ గర్భం దాల్చినప్పుడు వచ్చే జలుబును నియంత్రించడంలో వెల్లుల్లి బాగా పని చేస్తుంది. ఓ అధ్యయనం ప్రకారం.. రోజూ ఆహారంలో వెల్లుల్లిని భాగంగా చేసుకొన్నట్లయితే జలుబు వచ్చే అవకాశాలు 60 శాతం మేర తగ్గుతున్నాయని తేలింది. అందుకే భోజనం చేసేటప్పుడు తాజా వెల్లుల్లి రేకను అన్నంతో పాటు కలిపి తినాలి.

⚛ తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్, యాంటీ సెప్టిక్ గుణాలుంటాయి. దీన్ని టేబుల్ స్పూన్ చొప్పున రోజులో మూడుసార్లు తీసుకోవడం ద్వారా మంచి ఫలితం కనిపిస్తుంది.

⚛ ఉల్లిపాయలో ఫైటో కెమికల్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి శ్వాస వ్యవస్థను సక్రమంగా పనిచేసేలా చూస్తాయి. అందుకే రోజూ కొన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కలను తినడం మంచిది.

⚛ నిమ్మరసంలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలుంటాయి. ఇవి శరీరాన్ని ఆల్కనైజ్ చేస్తాయి. దీనిలో అధికంగా లభించే విటమిన్ సి జలుబును తగ్గించడంలో తోడ్పడుతుంది. నిమ్మరసం కలిపిన నీటిలో టేబుల్ స్పూన్ తేనె, కొద్దిగా ఉప్పు కలిపి కొద్దికొద్దిగా తాగుతూ ఉండాలి. తద్వారా జలుబు నుంచి త్వరిత ఉపశమనం కలుగుతుంది.

⚛ ఇంట్లోనే తయారుచేసుకొన్న చికెన్ సూప్‌ని తాగడం ద్వారా కూడా జలుబు తగ్గించుకోవచ్చు.

⚛ జలుబు చేసినప్పుడు నోరంతా చేదుగా మారిపోతుంది. ఇలాంటప్పుడు గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి పుక్కిలించి ఉమ్మితే ఉపశమనం ఉంటుంది.


రాకుండా ఈ జాగ్రత్తలు..

జలుబు వచ్చిన తర్వాత బాధపడేకంటే అది రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అందుకే గర్భం దాల్చిన మహిళలు తమకు అనారోగ్యం కలిగించే వాటికి దూరంగా ఉండటం మంచిది.

⚛ ముఖ్యంగా జలుబు రాకుండా ఉండాలంటే.. తరచూ చేతులను కడుక్కొంటూ ఉండాలి.

⚛ సరిపడినంత సమయం నిద్రపోవాలి.

⚛ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా జలుబు రాకుండా జాగ్రత్తపడొచ్చు. అనారోగ్యం బారిన పడిన వారికి దూరంగా ఉండాలి.

⚛ అలాగే మానసిక ఒత్తిడి ప్రభావానికి గురికాకుండా జాగ్రత్త వహించాలి.

⚛ రోజూ తగినంత వ్యాయామం చేయడం ద్వారా కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్