Published : 09/06/2022 18:35 IST

Back To Work: ఇలా చేస్తే కెరీర్‌లో మళ్లీ రాణించచ్చు!

అనామిక ఎనిమిది నెలల బాబుకు తల్లి. డెలివరీకి ముందు వరకు ఓ ఐటీ కంపెనీలో ఉన్నత హోదాలో పనిచేసిన ఆమెను.. ప్రసవానంతర సెలవు అనంతరం ఏవేవో కారణాలు చెప్పి సంస్థ ఉద్యోగంలో నుంచి తొలగించింది.

సాధన తల్లిదండ్రులు, అత్తమామలు ముసలి వాళ్లు. ఓ చంటి బిడ్డకు తల్లైన ఆమె.. పాపాయిని వాళ్లకు అప్పగించే వీల్లేక తనే ఉద్యోగానికి రాజీనామా చేసింది.

మేఘన పరిస్థితి వీరికి భిన్నం. వయసు పైబడిన అత్తమామల బాధ్యతను చూసుకోవడానికి ఆమె తన ఉద్యోగానికి స్వస్తి చెప్పక తప్పలేదు.

ఇలా ప్రస్తుతం ఎంతోమంది మహిళలు వివిధ కారణాల వల్ల ఇష్టంగానో, అయిష్టంగానో తమ వృత్తిగత జీవితంలో కొన్నేళ్ల పాటు విరామం తీసుకుంటున్నారు. ఇక తిరిగి ఉద్యోగంలో చేరదామంటే ఇటు సమాజం నుంచి, అటు సంస్థ నుంచి పలు సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇది పరోక్షంగా వారి కెరీర్‌ పురోగతిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చెప్పచ్చు. అయితే ఈ సవాళ్లను ఎదుర్కొని కెరీర్‌లో రాణించాలంటే మహిళలు పలు అంశాలపై దృష్టి సారించాలంటున్నారు నిపుణులు. మరోవైపు సంస్థలు కూడా ఉద్యోగినుల ఉన్నతికి కృషి చేయాలని చెబుతున్నారు. మరి, ఈ రెండూ ఎలా సాధ్యమో తెలుసుకుందాం రండి..

మీపై మీరు నమ్మకముంచండి!

ఎక్కువ శాతం మంది మహిళలు తమ కెరీర్‌లో విరామం తీసుకోవడానికి ముఖ్య కారణం పిల్లలు పుట్టడం. అయితే వాళ్లు కాస్త పెద్దయ్యాక లేదంటే ఇంట్లో చంటి పిల్లల్ని చూసుకునే వారు ఎవరైనా ఉంటే తిరిగి ఉద్యోగం వెతుక్కోవాలనుకుంటారు. ఇలా ఎంతో ఉత్సాహంగా ఉన్న వారిని చుట్టూ ఉన్న కొంతమంది అనే మాటలు ఇబ్బంది పెడుతుంటాయి. ‘ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోక.. ఈ ఉద్యోగం అవసరమా?’, ‘డబ్బు సంపాదనపై పెట్టే శ్రద్ధ పిల్లలపై పెట్టచ్చు కదా!’.. అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటారు. నిజంగా మీ పిల్లల్ని చూసుకోవడానికి ఇతర ప్రత్యామ్నాయాలేవైనా ఉంటే మాత్రం ఇలాంటి వాళ్ల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. ఎవరేమనుకున్నా స్వీయ నమ్మకంతో ముందుకు సాగితే అవకాశాలు తప్పకుండా మీ తలుపు తడతాయి. ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపవుతుంది. తద్వారా ఇటు తల్లిగా, అటు కెరీర్‌ పరంగా సక్సెసవ్వచ్చు.

రెజ్యూమేలో అది కూడా..!

ఈరోజుల్లో ఉద్యోగ ప్రయత్నాల్లో రెజ్యూమే కీలకంగా మారిపోయింది. అయితే మనం నేర్చుకున్న నైపుణ్యాల్ని ఎప్పటికప్పుడు అందులో పొందుపరచడమూ మనకు తెలిసిందే! కెరీర్‌లో విరామం తీసుకొని తిరిగి ఉద్యోగంలో చేరదల్చుకున్న మహిళలు సైతం రెజ్యూమేను అప్‌డేట్‌ చేసుకోవడం ముఖ్యమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీరు అసలు విరామం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో అన్న విషయం క్లుప్తంగా ఇందులో పొందపరచమని చెబుతున్నారు. ఇంటర్వ్యూలో దీని గురించి సవివరంగా చెప్పచ్చు. అలాగే ఈ మధ్యలో మీరు నేర్చుకున్న కొత్త నైపుణ్యాలేవైనా ఉంటే వాటినీ రెజ్యూమేలో చేర్చాల్సి ఉంటుంది. ఇలా స్పష్టంగా, నిజాయతీగా ఉన్న రెజ్యూమే ఎప్పుడూ రిక్రూటర్లను ఆకట్టుకుంటుంది. అలాగే ప్రస్తుతం చాలా కంపెనీలు ఆయా వ్యక్తుల లింక్డిన్‌ ప్రొఫైల్‌ ఆధారంగా.. వారి వృత్తిపరమైన అనుభవాలను పరిగణనలోకి తీసుకొని.. ఉన్నత అవకాశాలను అందిస్తున్నాయి. కాబట్టి రెజ్యూమేతో పాటు మీ లింక్డిన్‌ ప్రొఫైల్‌ని అప్‌డేట్‌ చేసుకోవడం, మీ వృత్తినైపుణ్యాలను బట్టి ఆయా లింక్డిన్‌ గ్రూపుల్లో చేరడం, వాళ్లతో తరచూ టచ్‌లో ఉండడం.. వంటివి చేస్తే మీ నైపుణ్యాలకు తగ్గ ఉద్యోగావకాశాల్ని సొంతం చేసుకోవచ్చు.

సాధన చేయాల్సిందే!

చాలామంది కెరీర్‌ బ్రేక్‌ను ఓ అగాథంలా భావిస్తుంటారు. దీనివల్ల రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టినా తమ నైపుణ్యాలకు తగ్గ అవకాశాలు రావన్న అభద్రతా భావనలో ఉండిపోతారు. ఉదాహరణకు.. పిల్లలు పుట్టాక రెండుమూడేళ్లు గ్యాప్‌ తీసుకున్నారనుకుందాం.. చాలా సంస్థలు దీన్ని సరైన కారణంగా భావించవన్న ఆలోచనలో ఉండిపోతారు. తద్వారా ఇంటర్వ్యూ సమయంలోనూ ఏదో పైపైన సమాధానమిస్తూ, తప్పు చేసిన భావనలో ఉండిపోతారు. ఇలా మీపై మీకే నమ్మకం లేకపోతే అవతలి వారు కూడా మిమ్మల్ని సంస్థలోకి తీసుకోవడానికి ఆసక్తి చూపరు. పైగా మహిళలకు ఇలాంటి కెరీర్‌ బ్రేక్స్‌ సహజమే. కాబట్టి మీరు ఏ కారణంతో విరామం తీసుకోవాల్సి వచ్చిందో నిర్మొహమాటంగా, సూటిగా రిక్రూటర్లకు తెలియజేయాలి. ఈ క్రమంలో తడబాటు లేకుండా, నిండైన ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూకు హాజరవ్వాలంటే ముందు నుంచే సాధన చేయడం ముఖ్యమంటున్నారు నిపుణులు.

ఆ గ్యాప్‌ మరింత పెరగకుండా..!

ఇంట్లో పరిస్థితులన్నీ సర్దుకున్నాయి, పిల్లలూ పెద్దవాళ్లయ్యారు.. ఇలా అన్నీ సవ్యంగా ఉన్నా కొందరు మహిళల విషయంలో రెండోసారి అవకాశం రావడం మరింత ఆలస్యం కావచ్చు. ఈ దిగులుతో ఖాళీగా కూర్చుంటే ఆ గ్యాప్‌ మరింత పెరిగిపోవచ్చు. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా, మీ చదువుకు తగ్గట్లుగా కొత్త కోర్సులు నేర్చుకోవడం మంచిది. ఈ క్రమంలో ప్రస్తుతం సైబర్‌ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషీన్‌ లెర్నింగ్‌, లీడర్‌షిప్‌-మేనేజ్‌మెంట్‌, బిజినెస్‌ అనాలిసిస్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌.. వంటి కోర్సులకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. కాబట్టి వాటిని ఇంటి నుంచైనా, వీలైతే బయటికెళ్లి నేర్చుకోవచ్చు. దీనివల్ల మీ నైపుణ్యాల్నీ విస్తరించుకోవచ్చు.. ఉద్యోగావకాశాల్నీ మెరుగుపరచుకోవచ్చు.

సంస్థలూ సహకరించాలి!

కెరీర్‌లో విరామం తీసుకొని తిరిగి ఉద్యోగంలో చేరాలనుకునే మహిళల్ని ఆయా సంస్థలూ ప్రోత్సహించాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో..

* గతంలో తమ సంస్థలో పనిచేసిన ఉద్యోగినుల కోసం ఇప్పుడున్న టెక్నాలజీకి అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి కోర్సుల్ని నేర్పించాలి. ఇలా వారు పూర్తిగా ఉద్యోగానికి సన్నద్ధమయ్యాకే తిరిగి ఉద్యోగంలో చేర్చుకోవచ్చు.

* ఓసారి విరామం తీసుకొని తిరిగి ఉద్యోగంలో చేరిన మహిళలకు వేతనం విషయంలోనూ సమ న్యాయం దక్కట్లేదనే చెబుతున్నాయి పలు సర్వేలు. కాబట్టి ఇలాంటి విరామాలతో కెరీర్‌ను బేరీజు వేయకుండా.. వాళ్లకున్న నైపుణ్యాలు, పనితనాన్ని బట్టి కంపెనీలు వారికి మంచి జీతాన్ని అందించాలి. తద్వారా అటు వాళ్లూ ఎదగగలుగుతారు.. ఇటు కంపెనీ కూడా వృద్ధి చెందుతుంది.

* కంపెనీ అభివృద్ధి కోసం ఉద్యోగినులు పనిచేస్తున్నప్పుడు.. ఒక్కోసారి వారి విషయంలో కంపెనీలు కొన్ని వెసులుబాట్లు కల్పించాలని చెబుతున్నారు నిపుణులు. ఉదాహరణకు.. పిల్లలు, ఇతర కుటుంబ బాధ్యతల రీత్యా ఆఫీసుకొచ్చి పనిచేయడం కుదరకపోవచ్చు.. అలాంటప్పుడు వారి సౌకర్యార్థం ఇంటి నుంచి పనిచేసే వీలు కల్పించే విషయంలో సంస్థలు చొరవ చూపాలి. ఇలా ఉద్యోగులు-యాజమాన్యం పరస్పరం సహకరించుకోవడం మంచిదే.

* కొత్తగా తల్లైన మహిళా ఉద్యోగుల సౌకర్యార్థం.. వారి పిల్లల ఆలనా పాలన కోసం క్రెష్ సౌకర్యం, నర్సింగ్‌ రూమ్స్‌ సదుపాయం.. వంటివి అందుబాటులో ఉంచాలి. ఇప్పటికే కొన్ని ప్రముఖ కంపెనీలు ఆయా సౌకర్యాల్ని అందిస్తున్నాయి. మిగతా సంస్థలు కూడా వాళ్ల బాటలో నడిస్తే ఉద్యోగినులకు మేలు జరుగుతుంది.

‘మహిళాభివృద్ధే దేశాభివృద్ధి..’ అంటుంటారు. కాబట్టి వాళ్ల అవసరాల్ని పరిగణనలోకి తీసుకొని.. ఇటు వ్యక్తిగతంగా, అటు కెరీర్‌ పరంగా వారిని ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారనడంలో సందేహం లేదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని