చిత్రకళనే చికిత్సగా..

పదేళ్ల మౌనిక ఆడుకుంటున్న సమయంలో తండ్రి అకస్మాత్తుగా గుండె నొప్పితో కిందపడిపోయాడు. ఆసుపత్రికి సకాలంలో చేర్చడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అప్పటివరకు తల్లి ముఖంలో తీవ్ర ఆందోళనను గుర్తించింది మౌనిక. తండ్రి ఆరోగ్యం కుదుటపడిన తర్వాత మౌనిక ఎవరితోనూ మాట్లాడటం మానేసింది.

Published : 03 Jul 2021 00:50 IST

పదేళ్ల మౌనిక ఆడుకుంటున్న సమయంలో తండ్రి అకస్మాత్తుగా గుండె నొప్పితో కిందపడిపోయాడు. ఆసుపత్రికి సకాలంలో చేర్చడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అప్పటివరకు తల్లి ముఖంలో తీవ్ర ఆందోళనను గుర్తించింది మౌనిక. తండ్రి ఆరోగ్యం కుదుటపడిన తర్వాత మౌనిక ఎవరితోనూ మాట్లాడటం మానేసింది. తినడం తగ్గించింది. మానసిక నిపుణుల సలహామేరకు చిత్రకళ నేర్పించడం మొదలైన కొన్ని రోజులకు కోలుకుంది. పిల్లల భావోద్వేగాలు బయటికి వ్యక్తీకరించేలా చేయడానికి, వారి ఆందోళనలను దూరం చేయడానికి చిత్రకళ మంచి మార్గం అని నిపుణులు సూచిస్తున్నారు. ఈ అంశంపై తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా తల్లిదండ్రులకు కొన్ని మార్గ దర్శకాలను ప్రకటించింది. కొవిడ్‌ కల్లోల ప్రభావం చిన్నారులపై పడకుండా చేయడానికి ఆర్ట్‌ థెరపీని అలవాటు చేయమని సూచించింది. 

* ఆసక్తిని పెంచాలి... మనసుకు కష్టం కలిగించే సందర్భం ఎదురైనప్పుడు పిల్లలు కుంగిపోతారు. ఇతరులతో తమ ఆలోచనలను పంచుకోలేరు. క్రమేపీ అది భయం, ఆందోళన, కోపంగా మారుతుంది. బొమ్మలు గీయడం, వాటిని రంగులతో నింపడం, ముగ్గులు వేయడంపై పిల్లల్లో ఆసక్తిని పెంచాలి. ఇవి వారిలో గూడు కట్టుకున్న ఆలోచనలు, భావోద్వేగాలను బయటకు తెస్తాయి.
* వర్ణాలతో... ఒత్తిడి మాత్రమే కాదు, జన్యు సమస్యలున్న చిన్నారులకూ చిత్రకళ ఉపయోగపడుతుంది. పసుపు, నీలం, ఎరుపు వంటి వర్ణాలను బొమ్మల్లో నింపుతున్నప్పుడు వారి మానసిక ఆరోగ్యం మెరుగుగా ఉన్నట్లు కొన్ని అధ్యయనాలు తేల్చాయి. బొమ్మలు గీసేటప్పుడు పిల్లల మెదడు ఉత్సాహంగా పనిచేస్తుంది. వాటర్‌ కలర్స్‌ వేస్తున్నప్పుడు ఆ రంగులు వారి ఆలోచనాశక్తిని, భావోద్వేగాలను ప్రతిఫలిస్తాయి. కోపోద్రేకాలు తగ్గుతాయి. ఈ కళ ఓ చికిత్సలా పని చేయడం మొదలు పెడుతుంది.
* ఏకాగ్రత... బొమ్మలు గీయడం, రంగులేయడం వల్ల చిన్నారులకు  ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. సహనం అలవడుతుంది. ఒత్తిడిని జయించగలుగుతారు. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటారు. మనసుకు నచ్చిన బొమ్మను వేయగలిగితే అది వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. జీవన నైపుణ్యాలను ఎలా మెరుగు పరుచుకోవాలో నేర్చుకుంటారు. వీటన్నింటివల్ల చదువులోనూ ముందుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్