స్కూల్‌లో గొడవ పడుతుంటే..

ఇంట్లో తల్లిదండ్రుల సంభాషణను పిల్లలు శ్రద్ధగా వింటూ ఉంటారు. హోంవర్క్‌ చేస్తున్నా చదువుకుంటున్నా పెద్దవాళ్లను పరిశీలించడం పిల్లలకు అలవాటు. వాళ్లెదుట తల్లి పట్ల తండ్రి దురుసుగా ప్రవర్తించడం లేదా చేయి చేసుకోవడం వంటివి పిల్లల మనసులో నిక్షిప్తమవుతాయి. వారి మనసును గాయపరుస్తాయి. అది క్రమేపీ కోపంగా మారే ప్రమాదం ఉంది.

Published : 07 Aug 2022 00:44 IST

రమణి తొమ్మిదేళ్ల కొడుకు రోజూ స్కూల్‌ నుంచి ఏదో ఒక గొడవ తెస్తూనే ఉంటాడు. దీనికి కారణం తెలియాలంటే మీ ఇంటి వాతావరణాన్ని ఓసారి పరిశీలించుకోవాలంటున్నారు నిపుణులు.

ఇంట్లో తల్లిదండ్రుల సంభాషణను పిల్లలు శ్రద్ధగా వింటూ ఉంటారు. హోంవర్క్‌ చేస్తున్నా చదువుకుంటున్నా పెద్దవాళ్లను పరిశీలించడం పిల్లలకు అలవాటు. వాళ్లెదుట తల్లి పట్ల తండ్రి దురుసుగా ప్రవర్తించడం లేదా చేయి చేసుకోవడం వంటివి పిల్లల మనసులో నిక్షిప్తమవుతాయి. వారి మనసును గాయపరుస్తాయి. అది క్రమేపీ కోపంగా మారే ప్రమాదం ఉంది. ఈ కోపాన్ని పిల్లలు వేరే వాళ్లపై చూపించడానికి ప్రయత్నిస్తారు. అలాగే తోటిపిల్లల తల్లిదండ్రులు అన్యోన్యంగా కనిపిస్తే భరించలేరు. చిన్నారుల మనసంతా వేదనతో నిండుతుంది. ఇది కూడా కసిగా మారి ఎవరో ఒకరి మీద దాన్ని ప్రదర్శిస్తారు. వీరి ప్రవర్తన వెనుక మానసికపరమైన ఎన్నో అంశాలు దాగి ఉంటాయి. వీటన్నింటిపైనా దాదాపు ఇంటి వాతావరణమే ప్రభావం చూపెడుతుంది. అందుకే చిన్నారులెదుట పెద్దలు మంచిగా ఉంటేనే వారి ఎదుగుదల బాగుంటుంది.

స్క్రీన్లు ఆపండి.. టీవీ లేదా ఫోన్‌లలో పిల్లలు ఎక్కువగా ఫైటింగ్‌, తుపాకులతో షూటింగ్‌ వంటి ఆటలు అలవరుచుకుంటున్నారు. దీంతో కొట్టుకోవడం అనేది సరదా అనే భావన మొదలవుతుంది. దీని వల్ల ఎదుటివారి బాధను గుర్తించలేరు, వారిపట్ల సానుభూతినీ ప్రదర్శించలేరు. నిత్యం చూసే కామెడీ షోల్లో ఒకరిని మరొకరు తరుముకుంటూ పరుగుపెట్టడం, కొట్టుకోవడం వంటివన్నీ తిరిగి చేయాలనిపించే పనుల్లా పిల్లల మనసులో పదిలమవుతాయి. వీటిని అనుసరిస్తూ తోటి పిల్లలతో అలాగే ప్రవర్తించే ప్రయత్నం చేస్తుంటారు. ఆటల్లో ఎదుటి వారిపై దాడి చేసి ఓడించడం నేర్చుకుంటారు. అలాంటి పిల్లలను స్క్రీన్‌కు వీలైనంత దూరంగా ఉంచడానికి ప్రయత్నించడం, ఆ సమయంలో ఏవైనా హాబీలు, పుస్తక పఠనం, మొక్కల పెంపకం వంటి అభిరుచులు, తోటిపిల్లలతో కలిసి ఆడుకోవడం వంటివి ప్రోత్సహిస్తే ఈ తరహా ప్రవర్తన తగ్గుతుంది. ఇలాంటి చిన్నారులతో తల్లిదండ్రులు ఎక్కువ సమయం గడపాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్