సంతోషాన్ని శాశ్వతం చేసుకోవాలంటే..

కొందరు దంపతుల నడుమ ఉండే అనుబంధం చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. ఈ అన్యోన్యత అందరిలోనూ ఉండాలంటే... కొన్ని నియమాలను అలవాట్లుగా మార్చుకోవాలంటారు నిపుణులు.

Published : 20 Apr 2023 00:47 IST

కొందరు దంపతుల నడుమ ఉండే అనుబంధం చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. ఈ అన్యోన్యత అందరిలోనూ ఉండాలంటే... కొన్ని నియమాలను అలవాట్లుగా మార్చుకోవాలంటారు నిపుణులు.

* నిద్రలేస్తూనే చిర్రుబుర్రులాడితే...ఆ ప్రభావం రోజంతా వెంటాడుతుంది. అలాకాకుండా ఉదయాన్నే మీ పలకరింపులు కాస్త గోముగా, మరికొంత ప్రేమగా ఉంటే... ఆ సానుకూలత రోజంతా మీకు సంతోషాన్నీ, ఉత్సాహాన్నీ తెచ్చిపెడుతుంది.

* పని ఒత్తిడి పెరిగితే... దాన్ని తగ్గించుకునే మార్గం చూడాలి తప్ప అందుకు ఎదుటివారిని నిందించొద్దు. ప్రణాళిక ప్రకారం రోజువారీ పనులు చేసుకోవడం...వాటిని కుటుంబ సభ్యులతో పంచుకోవడం వల్ల ఇబ్బందిని అధిగమించొచ్చు. సమస్య ఏదైనా మీలో మీరు సతమతమవ్వకుండా... భాగస్వామితో చెప్పుకోవడం, వారిని పరిష్కారాలు అడగడం వల్ల ఒంటరిగా పోరాడుతున్నామనే బాధకు దూరంగా ఉండొచ్చు. ఈ తీరు మీ ఇద్దరి మధ్య అనుబంధాన్ని పెంచుతుంది.

* భాగస్వామి అవసరాలను గుర్తించడం, వారిని ప్రేమించడమే కాదు, మర్యాదనివ్వడం, వారి అభిప్రాయాలను గౌరవించడం వంటివీ ఉండాలి. ఇవన్నీ ఆ దంపతుల నడుమ అనుబంధాన్ని మరింత పెంచుతాయి.

* ఆలుమగల బంధంపై ఎక్కువ ప్రభావం చూపించేది ఇంటి వాతావరణమే. అందుకే అది వీలైనంత ఆహ్లాదంగా ఉండేలా చూసుకోవాలి. ప్రతి చిన్న విషయంలోనూ లోటుపాట్లను వెతకడం వల్ల ఆందోళన, అసహనం పెరిగిపోతాయి. అలానే ఎప్పుడైనా భాగస్వామి విసుగు ప్రదర్శించినా...ఆ ప్రవర్తన వెనుక కారణాన్ని తెలుసుకుని స్పందించే పరిపక్వత తెచ్చుకుంటే ఇద్దరి మధ్యా అనుబంధం ఆనందంగా సాగిపోతుంది.

* ఒక్కటిగా నడవాల్సిన ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వస్తోంటే... అందుకు కారణాలు గమనించుకోండి. ఎదుటివారు చెప్పింది నేనెందుకు వినాలి అన్నట్లు కాక... అదెంత వాస్తవికంగా ఉందో తెలుసుకోండి.  పొరపాటు జరిగినప్పుడు... క్షమాపణలు అడగడానికీ,  ఆ తప్పుని సరిదిద్దుకోవడానికీ వెనుకాడొద్దు. అప్పుడే ఎంతటి సమస్య అయినా ఇట్టే సద్దుమణిగిపోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్