‘బంగారు’ తల్లులు

వీధి దీపం కింద చదువుకుని గొప్పవాళ్లయిన కథలు ఎన్నో విన్నాం. ఈ ఇద్దరూ దాదాపుగా అలాంటి పరిస్థితుల నుంచి వచ్చినవారే. ఇద్దరూ పేద రైతు కుటుంబాల వాళ్లే! చైత్రా నారాయణ్‌ హెగ్దే, మాదలాంబిక.. మైసూరు విశ్వవిద్యాలయం....

Published : 08 Sep 2021 01:25 IST

వీధి దీపం కింద చదువుకుని గొప్పవాళ్లయిన కథలు ఎన్నో విన్నాం. ఈ ఇద్దరూ దాదాపుగా అలాంటి పరిస్థితుల నుంచి వచ్చినవారే. ఇద్దరూ పేద రైతు కుటుంబాల వాళ్లే! చైత్రా నారాయణ్‌ హెగ్దే, మాదలాంబిక.. మైసూరు విశ్వవిద్యాలయం నుంచి ఇరవై, పది చొప్పున బంగారు పతకాలు సాధించారు. మంగళవారం కర్ణాటక గవర్నరు చేతుల మీదుగా 101వ స్నాతకోత్సవంలో వాటిని అందుకున్నారు. సాధించాలన్న తపన ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపిస్తున్నారు.


తర్వాతి లక్ష్యం డాక్టరేట్‌: చైత్రా నారాయణ్‌ హెగ్దే

మెది ఉత్తర కన్నడ జిల్లా శిరసి దగ్గర చిన్న పల్లెటూరు. అమ్మానాన్నా నారాయణ్‌ హెగ్దే, సుమంగళ వేరుశెనగ రైతులు. పేద కుటుంబం. వాళ్ల ఊరికి రోజు మొత్తంలో రెండే బస్సులు తిరిగేవి. ఆమెను ఉన్నత స్థానంలో చూడాలన్నది తల్లిదండ్రుల కోరిక. అందుకే కష్టమైనా చదివించారు. అందుకు తగ్గట్టుగానే చైత్రా కష్టపడి చదివేది. ఈమెకు రసాయనశాస్త్రమంటే చాలా ఇష్టం. మైసూరు విశ్వవిద్యాలయంలో ఎంఎస్‌సీ కెమిస్ట్రీ పూర్తిచేసింది. దీనిలో ఈమె చూపిన ప్రతిభకు ఏకంగా 20 బంగారు పతకాలు దక్కాయి. ఈ ఏడాది విశ్వవిద్యాలయంలోనే అధిక పతకాలు సాధించిన వారిలో ఈమె మొదటి స్థానంలో నిలిచింది. వీటితోపాటు నాలుగు నగదు బహుమతులూ దక్కాయి. చైత్ర డిగ్రీ స్థాయిలోనూ బంగారు పతకాన్ని అందుకుంది. ఇప్పుడు అదే కళాశాలలో గెస్ట్‌ లెక్చరర్‌గా పనిచేస్తోంది. మెడిసినల్‌ కెమిస్ట్రీలో డాక్టరేట్‌ చేయడం తన లక్ష్యమంటోంది. ఆ దిశగా సన్నద్ధమవుతోంది కూడా. పదో తరగతి వరకూ కన్నడలోనే చదివిన ఈమె ఇంటర్‌ నుంచి ఆంగ్లమాధ్యమంలో విద్యను కొనసాగించింది. పట్టుదల ఉంటే మాధ్యమం అడ్డుకాదనీ చెబుతోంది.


నాన్న కల ఇది: టీఎస్‌ మాదలాంబిక

మడహల్లికి చెందిన మాదలాంబిక తండ్రి శివమల్లప్పకి చదువంటే ప్రాణం. కానీ ఆయనకు ఎనిమిదో తరగతి తర్వాత చదువు కొనసాగించే అవకాశం లేకుండా పోయింది. పేద రైతు. అయినా తన నలుగురు కూతుళ్లనీ ఉన్నత చదువులు చదివించి ఆ కోరిక తీర్చుకోవాలనుకున్నాడు. ఈమె నాలుగో అమ్మాయి. నాన్న కోరికకు తగ్గట్టుగానే చదువులో ముందుండేది. ఆయనా ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఈమెను ఉన్నతవిద్య వైపు ప్రోత్సహించాడు. ఆయన కల సాకారం చేస్తూ మాదలాంబిక ఎంఏ కన్నడలో మొదటి స్థానంలో నిలిచి, 10 బంగారు పతకాలను సాధించింది. కానీ.. అది చూడటానికి ఆయన లేరు. ఈమె మొదటి సెమిస్టర్‌ చదువుతున్నప్పుడే చనిపోయారు. ఆ తర్వాత తల్లి, అక్క మాదలాంబిక చదువుకు అండగా నిలిచారు. బంగారు పతకాన్ని ఆశించా కానీ పది వస్తాయని ఊహించలేదంటున్న ఈమె.. ఇప్పుడు తన నాన్న ఉండుంటే ఎంతో సంతోషించేవారని చెబుతోంది. నెట్‌ లక్ష్యంగా సన్నద్ధమవుతోంది. ఈమెకి నాలుగు నగదు బహుమతులూ వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్